![Krithi Shetty decided to special song in bollywood](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Krithi-Shetty-image0-%281%29.jpg.webp?itok=21mz8DvY)
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెత చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తుంటుంది. ఈ విషయంలో హీరోయిన్లు ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు హీరోకి జోడీగా నటించి, ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లో నటించేందుకు పలువురు కథానాయికలు పచ్చజెండా ఊపుతుంటారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, శ్రుతీహాసన్, శ్రీలీల, రెజీనా, ఫరియా అబ్దుల్లా వంటి పలువురు కథానాయికలు ప్రత్యేకపాటల్లో చిందేశారు.
తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ కృతీ శెట్టి కూడా చేరనున్నారని బాలీవుడ్ టాక్. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బేబమ్మగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు.
2024 జూన్ 7న విడుదలైన ‘మనమే’ సినిమా తర్వాత కృతీ శెట్టి తెలుగులో ఏ సినిమా కూడా కమిట్ కాలేదు. అయితే తమిళ చిత్రాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారామె. ఇదిలా ఉంటే.. కృతీ శెట్టి బాలీవుడ్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని టాక్. అద్భుతమైన డ్యాన్స్ చేయడంలో ఆమెకు మంచి పేరుంది. అందుకేనేమో... ప్రత్యేకపాటలో మెరిసేందుకు సై అన్నారని టాక్. అయితే ఆమె ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారు? ఇందులో వాస్తవం ఎంత? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment