నటుడిగానే కాకుండా రాజకీయాల పరంగానూ వార్తల్లో నిలుస్తున్న స్టార్ హీరో విశాల్. ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడుతుంటారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన లత్తీ చార్జ్ (తెలుగులో లాఠీ) చిత్రం ఈ నెల 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు విషయాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. అవేంటో చూద్దాం
ప్ర: లత్తీ చార్జ్ చిత్రం గురించి?
జ: నేను ఇంతకు ముందెన్నడూ చేయని కథా, కథనాలతో కూడిన చిత్రం ఇది. తొలిసారిగా పోలీస్ కానిస్టేబుల్‌గా నటించాను. సమాజంలో పోలీస్ కానిస్టేబుళ్ల పాత్ర కీలకం. అయితే వారి వ్యక్తిగత జీవితం మాత్రం కష్టాల కడలే. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా పరుగులు తీయాల్సిన పరిస్థితి. అలాంటి ఒక కానిస్టేబుల్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం లత్తీ చార్జ్. ఈ చిత్రం కోసం శక్తికి మించి శ్రమించాల్సి వచ్చింది. ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి క్‌లైమాక్స్ సన్నివేశాలను ఇందులో చూస్తారు.
ప్ర: లత్తీ చార్జ్‌ను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడంపై?
జ: పాన్ ఇండియా చిత్రాలు అనడాన్ని నేను సమరి్ధస్తాను. తమిళ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతున్నాయి. తెలుగు, మలయాళం చిత్రాలు తమిళనాడులో ఆడుతున్నాయి. కన్నడ చిత్రాలు తమిళనాడులో ఎక్కువగా విడుదల కాకపోయినా, ఆ చిత్ర పరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే పాన్ ఇండియా అనే చట్రంలో ఇరుక్కుపోతే బయట పడటం కష్టం.
ప్ర: మెగాఫోన్ ఎప్పుడు పట్టబోతున్నారు?
జ: లత్తీ చార్జ్ తరువాత మార్క్ ఆంటోని చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తండ్రీకొడుకులుగా చేస్తున్నాను. నటుడు ఎస్‌జే సూర్య కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ చిత్రంలో విశాల్ కనిపించడు.. పాత్రలే కనిపిస్తాయి. తదుపరి నేను దర్శకత్వం చేసే చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. యానిమల్స్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం. దీని తరువాత తుప్పరివాలన్ 2 చిత్రానికి దర్శకత్వం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్ర: మళ్లీ మిష్కిన్ దర్శత్వంలో నటిస్తారా?
జ: కచ్చితంగా నటిస్తాను. ఆయన ఇప్పుడు ఫోన్ చేసినా ఆయన ఆఫీస్‌కు వెళ్తాను. మిష్కిన్ అద్భుతమైన దర్శకుడు. అయితే ఒక నిర్మాతగా మాత్రం నేను ఆయన్ని క్షమించను. నాకు అంత ద్రోహం చేశారు.
ప్ర: త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ తరుఫున కుప్పం నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారట?
జ: ఒసామా (చిరునవ్వు) అలాంటి ప్రచారం నా దృష్టికి వచ్చింది. విశేషం ఏమిటంటే కుప్పం నియోజకవర్గంతో నాకున్న అనుబంధాన్ని, అక్కడి ప్రజలతో సత్సంబంధాలు వంటి వివరాలు సేకరించి కుప్పంలో చంద్రబాబు నాయుడుకు గట్టి పోటీ ఇచ్చే సత్తా విశాల్‌కే ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావించినట్లు ప్రచారం జరిగిన మాట నిజమే. నిజంగానే కుప్పంతో నాకు అనుభవం ఉంది. మా నాన్న అక్కడ గ్రానైట్ వ్యాపారం చేశారు. ఆ సమయంలో నేను మూడేళ్ల పాటు కుప్పంలో తిరిగాను. అక్కడ ప్రతి వీధి నాకు పరిచయమే. అక్కడి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కుప్పం నియోజకవర్గంలో 40 శాతం తమిళులు ఉన్నారు. అయితే కుప్పంలో నేను పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు.
ప్ర: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా?
జ: రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. అసలు రాజకీయం అంటే ప్రజాసేవ. అలా మీరు కూడా ఏదో ఒక అనాధాశ్రమానికి సాయం చేసే ఉంటారు. అదీ రాజకీయ సేవే. తుపాన్ సమయంలో నేనూ నా మిత్రులం కలిసి సహాయ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రజాసేవ చేయడానికి ఇన్ని రాజకీయ పార్టీలు అవసరమా?
ప్ర: మీ కాలేజ్ మేట్ ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీని గురించి మీ స్పందన?
జ: ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడం సంతోషంగా ఉంది. సినీ రంగం అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెన్నైలో ఫిలిం సిటీని అభివృద్ధి చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఫిలిం సిటీలు ఉన్నాయి. చెన్నైలో లేకపోవడం బాధాకరం.
Comments
Please login to add a commentAdd a comment