టైటిల్: ఎల్‌జీఎం
నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు తదితరులు
నిర్మాణ సంస్థ: ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్
నిర్మాతలు: సాక్షి ధోని, వికాస్ హస్జా
దర్శకత్వం: రమేశ్ తమిళ్
విడుదల తేది(తెలుగులో): ఆగస్ట్ 4, 2023
ఎల్‌జీఎం కథేంటంటే..
ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. గౌతమ్ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి లీల(నదియ) అల్లారుముద్దుగా పెంచుతుంది. గౌతమ్‌కి తల్లి అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కూడా తల్లితో కలిసే ఉండాలనుకుంటాడు. కానీ మీరా మాత్రం డిఫరెంట్. చిన్నప్పటి నుంచి హాస్టల్‌లోనే పెరగడంతో ఇతరులతో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడదు. ఇదే విషయాన్ని పెళ్లి చూపులకని ఇంటికి వచ్చి గౌతమ్‌తో చెప్పేస్తుంది. దీంతో గౌతమ్ తల్లి కోసం ప్రేమను వదులుకుంటాడు.
కొన్నాళ్ల తర్వాత మీరా రాజీకొచ్చి.. అత్తను అర్థం చేసుకునేందుకు పెళ్లికి ముందు ఓ వారం ట్రిప్‌కి వెళ్దాం అని గౌతమ్‌ని ఒప్పిస్తుంది. అయితే ఈ విషయం గౌతమ్ తన తల్లికి చెప్పకుండా ఆఫీస్ ట్రిప్ అని తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఒకవైపు తల్లి, మరోవైపు ప్రేయసి.. ఇద్దరి ఈగోల కారణంగా గౌతమ్ పడ్డ కష్టాలేంటి? మీరా తన కాబోయే అత్తతో పాటు గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? గోవా నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఏం జరిగింది? చివరకు గౌతమ్, మీరాల పెళ్లికి లీల ఒప్పుకుందా లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
పెళ్లిపై నేటి యువతకు ఎన్నో భయాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య ఉండే రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా పెళ్లి తర్వాత అత్తతో కలిసి ఉండగలనా లేనా అని తెలుసుకోవడానికి సిద్ధమైన నేటి తరం అమ్మాయి కథే ఈ ఎల్‌జీఎం. ఈ కథను కాస్త తిరిగేస్తే మనకు బొమ్మరిల్లు హాసినిని గుర్తు చేస్తుంది . అందులో కోడలు తమతో ఎలా ఉంటుందో అని అత్తింటి వారు పరీక్ష పెడితే.. ఇక్కడ అత్త తనతో ఎలా ఉంటుందో అని టూర్ పేరుతో పరీక్ష పెడుతుంది కోడలు. అంతే తేడా.
అత్త కోడళ్ల మధ్య గొడవలు.. వారిద్దరి మధ్య హీరో పడే కష్టాలు.. ఈ కాన్సెప్ట్‌తో సినిమాలతో పాటు పలు సీరియళ్లు కూడా తెలుగులో వచ్చాయి. అలాంటి రోటీన్ పాయింట్‌తో ఎల్‌జీఎం కథను రాసుకున్నాడు దర్శకుడు రమేష్ తమిళమణి. పెళ్లికి ముందే అత్తతో కలిసి కోడలు టూర్‌కి వెళ్లే కాన్సెప్ట్ వినడానికి కాస్త కొత్తగా ఉంది కానీ తెరపై మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కథనం నెమ్మదిగా సాగడం మరింత ఇబ్బందికరం. కామెడీకి ఎమోషనల్ జోడించి మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఫస్టాఫ్‌లో యోగిబాబుతో ఓ ముసలాయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అయితే ద్వితియార్థంలో కథ సాగదీతగా అనిపిస్తుంది. అత్తా కోడళ్లు కిడ్నాప్‌కు గురైన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. అక్కడ కూడా యోగిబాబు కామెడీ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాకు ప్రధాన బలం ఇవానా, నదియా అనే చెప్పాలి. హీరోగా హరీశ్ కల్యాణ్ చేసిన.. కథ మొత్తం ఇవానా, నదియా పాత్రల చుట్టే తిరుగుతుంది. అత్తాకోడళ్లుగా వీరిద్దరి నటన ఆకట్టుకుంటుంది. ఇద్దరు కలిసి పబ్‌లో వేసే స్టెప్పులు అలరిస్తాయి. నేటితరం అమ్మాయి మీరాగా ఇవానా, గడుసరి అత్తగా నదియా అదరగొట్టేశారు. వీరిద్దరి మధ్య నలిగే వ్యక్తి గౌతమ్. ఈ పాత్రలో హరీశ్ కల్యాణ్ చక్కగా నటించాడు. బస్సు డ్రైవర్‌గా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్. హీరో స్నేహితుడిగా చేసిన నటుడి కామెడీ పంచులు కూడా బాగున్నాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే దర్శకుడు తమిళమణియే ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలు కథలో బాగంగా వస్తాయి కానీ ఒక్కటి కూడా గుర్తిండిపోయేలా ఉండదు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment