కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్‌తో విజయాలను అందుకున్నారు.
కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.
ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్‌కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్‌లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.
సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదే
లోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment