Maayon Movie Review And Rating In Telugu | Sibi Sathyaraj | Tanya Ravichandran - Sakshi
Sakshi News home page

Maayon Movie Review Telugu: ‘మాయోన్‌’ మూవీ రివ్యూ

Published Thu, Jul 7 2022 7:20 PM | Last Updated on Fri, Jul 8 2022 11:16 AM

Maayon Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : మాయోన్‌
నటీనటులు : సిబి రాజ్‌, తాన్య రవిచంద్రన్‌, రాధా, రవి, కె.ఎస్‌.రవికుమార్‌ తదితరులు
నిర్మాత: అరుణ్‌ మోళిమాణికర్‌
రచన,దర్శకత్వం: ఎన్‌. కిశోర్‌
సంగీతం : ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: రామ్‌ ప్రసాద్‌
ఎడిటర్‌: రామ్‌ పాండియన్‌, కొండలరావు
విడుదల తేది: జులై 7, 2022

‘కట్టప్ప’ సత్యరాజ్‌ కుమారుడు సిబి సత్యరాజ్‌ హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ రూపొందించిన చిత్రం ‘మాయోన్‌’. అరుణ్‌ మోజి మాణికం నిర్మించిన ఈ తమిళ చిత్రం తెలుగు హక్కులను మూవీమ్యాక్స్‌ అధినేత మామిడాల శ్రీనివాస్‌ సొంతం చేసుకున్నారు. కోలీవుడ్‌లో మాదిరే టాలీవుడ్‌లో కూడా భారీ ప్రమోషన్స్‌ చేయడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 7) 227 థియేటర్స్‌లో విడుదలైన ‘మాయోన్‌’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

 

మయోన్‌ కథేంటంటే..
అర్జున్‌(సిబి సత్యరాజ్‌) ఆర్కియాలజిస్ట్‌. పూరాతన వస్తులను కాపాడుకోవడం మన బాధ్యత అని, అది మన పూర్వికుల సంస్కృతి అని తోటి ఉద్యోగులకు చెబుతూనే..తాను మాత్రం విగ్రహాల స్మగ్లింగ్(Idol Smuggling)కు పాల్పడుతాడు. తన సీనియర్‌ అధికారి దేవరాజ్‌(హరీష్‌ పేరడీ)తో చేతులు కలిసి పురాతన వస్తువులను, విగ్రహాలను విదేశాలకు అమ్మెస్తుంటారు. ఈ క్రమంలో వీరికి విజయానందపురంలో ఐదు వేల సంవత్సరాల చరిత్ర గల మాయోన్‌ ఆలయం, అందులో ఉన్న నిధి గురించి తెలుస్తుంది.

ఆ నిధిని ఎలాగైన సొంతం చేసుకోవాలకుంటారు. ఉద్యోగ రిత్యా అక్కడి వెళ్లి నిధివేట మొదలుపెడతారు. మరి ఆ నిధి రహస్యం ఎలా తెలిసింది? మాయోన్‌ ఆలయం యొక్క చరిత్ర ఏంటి? ఆ నిధిని సొంతం చేసుకునేందుకు అర్జున్‌, దేవరాజ్‌ ఎలాంటి ప్రయత్నం చేశారు. అర్జున్‌ నిజంగానే నిధి కోసం దేవరాజ్‌తో చేతులు కలిపాడా? విదేశాల్లో ఉన్న ఐడియల్‌ స్మగ్లర్‌ సాన్స్‌ ఫెరాడోని ఇండియన్‌ పోలీసులు ఎలా పట్టుకున్నారు? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘మాయోన్‌’సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
పురాతన ఆలయాలు.. నిధి వేట.. దైవశక్తి, సైన్స్‌ కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను ప్రేక్షకులను అలరిస్తాయి. అందుకే ఇప్పటికే ఆ తరహా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు మన దర్శకనిర్మాతలు. అయితే ఇలాంటి కథలను తెరపై ఎంత ఉత్కంఠంగా చూపించామనేదానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠని సినిమా చివరి వరకు ఉంచగలితే అది విజయం సాధిస్తుంది. అలాంటి ఉత్కంఠభరితమైన కథ, కథనంలో తెరకెక్కిన చిత్రమే ‘మాయోన్‌’. పాత కథే అయినా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో చాలా కొత్తగా, ప్రెష్‌గా తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్‌.

‘మాతృభూమి గుర్తులు అమ్మడం...కన్న తల్లిని అమ్మడం ఒక్కటే’ సినిమా క్లైమాక్స్‌ వచ్చే డైలాగ్‌ ఇది. ఈ ఒక్క డైలాగ్‌తో కథ ఏంటి? కథనం ఎలా సాగుతుందో ఊహించొచ్చు. అయితే ప్రేక్షకుడి ఊహకి ఉత్కంఠను జోడించి సినిమాని ముందుకు నడిపించాడు దర్శకుడు కిశోర్‌. సినిమా ప్రారంభంలోనే కథనం  ఎలా సాగబోతుందో చూపించాడు. హీరో మొదలుకొని.. ప్రతి పాత్రని నెగెటివ్‌ షేడ్స్‌లో పరిచయం చేసి.. అందరిపై ప్రేక్షకులను అనుమానం కలిగేలా చేశారు.

ఫస్టాఫ్‌లో కథను ప్రారంభించడానికి కొంత సమయం తీసుకున్నా.. సెకండాఫ్‌లో మాత్రం కథను చాలా ఉత్కంఠంగా, స్పీడ్‌గా నడిపించాడు. అర్జున్‌ బృందం ఆలయంలోకి చొరబడిన తర్వాత వచ్చే ప్రతి సీన్‌ ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే క్లైమాక్స్‌ మాత్రం కాస్త రొటీన్‌గా ఉంటుంది. దైవశక్తి, సైన్స్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ కథనాన్ని ముందుకు నడిపారు.మైతలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘మాయోన్‌’కచ్చితంగా నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే..
సత్యరాజ్‌ కొడుకు సిబి సత్యరాజ్‌కి ఇది తొలి చిత్రం. అయినా ఆ విషయం తెరపై ఎక్కడా తెలియకుండా నటించాడు యంగ్‌ హీరో సిబి సత్యరాజ్‌. ఆర్కియాలజిస్ట్‌ అర్జున్‌ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా, చురుగ్గా కనిపించాడు. ఇక హీరో బృందంలో ఉండే మరో ఆర్కియాలజిస్ట్‌ సంజనగా తాన్య రవిచంద్రన్‌ మెప్పించింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న దేవరాజ్ పాత్రలో హరీశ్‌ పేరడి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గ్రామ పెద్ద, కృష్ణప్పగా రాధ రవి పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తెలుగు ప్రేక్షకులను పెద్దగా తెలియదు కానీ.. తమ తమ పాత్రల పరిధిమేర నటించి, మెప్పించారు. 

సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. బాలయ్య నటించిన అఖండ చిత్రానికి ఈయనే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. తమిళ్‌లో ఇది ఆయనకు తొలి సినిమా. తనదైన కెమెరా పనితనంతో ప్రతి సీన్‌ని ఆసక్తికరంగా చూపించాడు. ఆలయ సన్నివేశాలను తెరపై చాలా అధ్భుతంగా చూపించాడు.  

గ్రాఫిక్స్ వర్క్‌ బాగుంది. సాంకేతికతను ఉయోగించి ఆలయంలోకి ఈగను పంపించడం.. మొబైల్‌ వాచ్‌, కొత్త పరికరంతో అర్థరాత్రి వచ్చే చెడు శబ్ధాలను ఆపడం లాంటి సీన్స్‌ ఆకట్టుకుంటాయి.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు చాలా రిచ్‌గా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement