ప్రతినాయకుడిగా పాత్రలో లీనమైపోయారు... విప్లవ సినిమాల ఒరవడి సృష్టించారు.. యువతరం పతాకం మీద అభ్యుదయ చిత్రాలు తీశారు.. పుస్తకాలు కాదు జీవితాన్ని చదివి తెలుసుకోవాలన్నారు.. ఆదర్శాలతో జీవించమని పిల్లలకు బోధించిన విప్లవ నటుడు మాదాల రంగారావు గురించి వారి పెద్ద కుమారుడు మాదాల రవి పంచుకున్న అందమైన జ్ఞాపకాలు...
నాన్నగారు తన సొంత బ్యానర్ మీద అభ్యుదయ చిత్రాలే తీయాలనుకున్నారు, అలాగే తీశారు. నన్ను కూడా ఆ గీత దాటద్దన్నారు. ఇంతవరకు దాటలేదు. ప్రకాశం జిల్లా మైనంపాడు (ఒంగోలు దగ్గర) లో మాదాల కృష్ణయ్య, మాదాల హనుమాయమ్మ దంపతులకు నాన్న రెండో సంతానంగా పుట్టారు. పెద్దాయన మాదాల కోదండ రామయ్య. నాన్న ఒంగోలులోని శర్మ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లోనే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
అమ్మ పేరు పద్మావతి. నేను పుట్టాక పెద్ద వాళ్లు అంగీకరించారు. మా తాతగారి కుటుంబీకులు ఆచార్య ఎన్‌జి రంగా మిత్రులు. అందుకే నాన్నకు రంగారావు అని పేరు పెట్టారు. నాన్న చాలా సింపుల్‌గా ఉండేవారు. తెల్ల ప్యాంటు, ఎర్ర చొక్కా, మఫ్లర్... లేదంటే ఎర్ర ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకునేవారు. నాన్నకి ఒక్క పైసా కూడా ఆస్తి లేదు. స్థలాలు ఇచ్చినా తీసుకోలేదు. ఆయన తీసుకునే ఆహారం చాలా సింపుల్‌గా ఉండేది. మాంసాహారం ఇష్టపడేవారు కాదు. సాంబార్ రైస్, పెరుగన్నం ఇష్టపడేవారు. చిరుతిళ్లలో ఆరోగ్యకరమైన సున్నుండలు, గారెలు ఇష్టపడేవారు.
అది ఒక ప్రభంజనం...
నాన్నగారికి మేం ముగ్గురు పిల్లలం. నేను మాదాల రవిచంద్... పెద్దబ్బాయిని. నాకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మా తాతలంతా సంపన్న రైతులు. నాన్న శర్మ కాలేజీలో చేరాక, ప్రజానాట్య మండలి తరఫున నాటకాలు వేస్తున్న తరుణంలో నల్లూరి వెంకటేశ్వర్లు గారి ప్రభావంతో కమ్యూనిజం భావాలు నాటుకున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ సోషియాలజీ పూర్తయ్యాక ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లారు. చైర్మన్ చలమయ్య చిత్రం నాన్న నటించిన మొదటి సినిమా.
ఆ తరవాత కలియుగ మహాభారతం, హరిశ్చంద్రుడు (జాతీయ అవార్డు), వంటి సినిమాలలో నటించాక, 1980లో నవతరం పిక్చర్స్ స్థాపించి, ‘యువతరం కదిలింది’ చిత్రంతో అభ్యుదయ చిత్రాలకు, ‘ఎర్రమల్లెలు’ చిత్రంతో విప్లవ సినిమాలకు ‘విప్లవ శంఖం’ సినిమాతో ప్రభుత్వ వ్యతిరేక విధానాల చిత్రాలకు ఆద్యులయ్యారు. చాలా సినిమాలు స్కూటర్ మీద తిరుగుతూనే తీశారు. ‘ఎర్రమట్టి’ సినిమా సమయంలో డిస్ట్రిబ్యూటర్ కన్నుమూయటంతో, సొంత బ్యానర్ మీద సినిమాలు తీయటం మానేశారు.
ప్రపంచాన్ని చదవాలన్నారు..
నాన్న చాలా క్రమశిక్షణతో ఉండేవారు. అప్పుడప్పుడు కొంచెం కఠినంగానే ఉండేవారు. పుస్తకాలు రుబ్చి చదవటం కాదు, శాస్త్రీయంగా చదవాలనేవారు. నాన్న ఇంట్లోకి వస్తుంటే పుస్తకాలు మూసేసేవాళ్లం. ‘గాడ్ మేడ్ మి’ అని చదువుతుంటే, ‘పేరెంట్స్ మేడ్ మి’ అనాలనేవారు. నన్ను ప్రజా కళాకారుడిని చేయాలనుకునేవారు. అమ్మ మాత్రం వైద్యుడిని చేయాలనుకుంది. ‘వైద్యుడిగా శరీరానికి పట్టిన జబ్బు, కళాకారుడిగా సమాజానికి పట్టిన జబ్బు వదిలించాలి. కళ సామాజిక చైతన్యం కోసం. వైద్యం వ్యాపారం కాకూడదు, ఆదర్శంగా పీపుల్స్ హాస్పిటల్‌గా ఉండాలి’ అనేవారు. నేను ఎండి, డిఎం చేసి, పీపుల్స్ హాస్పిటల్ నిర్మించి, ఉచితంగా సేవ చేస్తున్నాను. కోవిడ్ సమయంలో చాలామందికి ఉచిత వైద్య సేవలు అందించి, నాన్నగారి కోరిక నెరవేరుస్తున్నాను.
నువ్వు మా నాన్నవు...
నేను వైద్య సేవలు చేస్తూ, దేశానికి అంకితం అయ్యాను. అందుకని ‘నువ్వు దేశానికి అంకితం అయ్యావు. నువ్వు మా నాన్నవు’ అనేవారు. బ్యాగ్‌లో ఉన్న డబ్బులు కూడా చాటుగా దానం చేసేసేవారు. స్కూటర్ పెట్రోట్‌కి డబ్బులు లేకపోయినా, చేతిలో ఉన్నది ఇచ్చేసేవారు. పాండ్యన్ అని తమిళనాడు సెక్రటరీ. ఒకసారి ఆయన నడిచి వస్తుంటే, తన స్కూటర్ ఆయనకు ఇచ్చి, ‘నా కంటె మీరు చేయవలసినవి చాలా ఉన్నాయి. నడుస్తూ వెళితే చేయటం కష్టం. ఈ స్కూటర్ మీద ప్రయాణించండి’ అన్నారు.
నాన్నకి తగ్గట్లే ఉండేది అమ్మ. చాలా సాధారణంగా జీవించింది. అమ్మకి ఎక్కువ చీరలు ఉండేవి కాదు. బస్‌లో వెళ్లి, ట్రైబల్ పార్టీ ఆర్గనైజ్ చేశారు. యూనిటీ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీ కోసం కష్టపడ్డారు. ఆదర్శాలతో జీవించాలనేవారు. మీటింగ్‌లకి సొంత ఖర్చుతో వెళ్లేవారు. నాన్నగారి వారసుడిగా అభ్యుదయ చిత్రాలు తీయాలనుకున్నాను. 2003లో ‘నేను సైతం’ తీస్తూ, నాన్నగారిని నటించమన్నాను. నాన్న అంగీకరించారు. అదే నాన్న నటించిన చివరి చిత్రం. ప్రజా పోరాటాలు, నిరాహార దీక్షలతో ఆరోగ్యం దెబ్బ తింది.
అయినా తిరుగుతూనే ఉండేవారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. యాక్టివ్ లైఫ్ నుంచి ఇనాక్టివ్ కావటంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. 2018 మే, 27న కాలం చేశారు. ఆయన కోరిన విధంగా.. ఆయన భౌతిక దేహానికి ఎర్ర జెండా కప్పి, పార్టీ ఆఫీసులో పెట్టాం. ఆయన జీవితమంతా ప్రజలకే అంకితం అయ్యారు. కనుక ప్రజా కళాకారులు, నాయకుల సమక్షంలోనే నాన్న అంత్యక్రియలు నిర్వహించాను. నాన్న కోరిక నెరవేర్చినందుకు తృప్తి చెందాను.
ఒక్క రోజులో తీశారు..
‘ఎర్ర మల్లెలు’ చిత్రం తీస్తున్న సమయంలో ఇంట్లో ‘నాంపల్లి టేషన్’ పాట పెడుతుంటే వింటూ డ్యాన్స్ చేస్తుండేవాడిని. అప్పుడు నాన్న నన్ను ఆ సినిమాలో చేయమన్నారు. డ్యాన్స్ మాస్టర్ లేకుండా, ఆ పాటను ఒక్క రోజులో తీశారు. సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ పట్ల అవగాహన ఉండేది. అప్పట్లో నాన్న దొరకటమే మాకు కష్టంగా ఉండేది. సినిమా షూటింగ్‌లతో పాటు, ఇంట్లో ఉన్నంతసేపు ప్రజల సమస్యలు వింటూ, వారికి సహాయం చేసేవారు.
సొంత ఇల్లు ఉండాలని అందరూ అంటున్నా, నాన్న పట్టించుకోలేదు. నాన్నకు... పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు ఆదర్శం. నేను పెద్దవాడినయ్యాక ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. మా చెల్లి పెళ్లి చేశాను. ఆ సమయంలో నాన్న తన జీవితంలో మొట్టమొదటిసారిగా ‘రెండు లక్షలు ఉన్నాయా’ అని అడిగితే ఇచ్చాను. ఆ డబ్బులు చేతిలో పట్టుకుని, ‘నా కూతురు పెళ్లి సందర్భంగా రెండు కమ్యూనిస్టు పార్టీలకు లక్ష చొప్పున ఇస్తున్నాను’ అంటూ లక్ష రూపాయలు సిపిఐకి, లక్ష రూపాయలు సిపిఎంకి ఇచ్చారు.
– మాదాల రవి
సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment