Madala Ravi
-
ఆ నటుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ, పైగా డిప్రెషన్.. దీంతో
ప్రతినాయకుడిగా పాత్రలో లీనమైపోయారు... విప్లవ సినిమాల ఒరవడి సృష్టించారు.. యువతరం పతాకం మీద అభ్యుదయ చిత్రాలు తీశారు.. పుస్తకాలు కాదు జీవితాన్ని చదివి తెలుసుకోవాలన్నారు.. ఆదర్శాలతో జీవించమని పిల్లలకు బోధించిన విప్లవ నటుడు మాదాల రంగారావు గురించి వారి పెద్ద కుమారుడు మాదాల రవి పంచుకున్న అందమైన జ్ఞాపకాలు... నాన్నగారు తన సొంత బ్యానర్ మీద అభ్యుదయ చిత్రాలే తీయాలనుకున్నారు, అలాగే తీశారు. నన్ను కూడా ఆ గీత దాటద్దన్నారు. ఇంతవరకు దాటలేదు. ప్రకాశం జిల్లా మైనంపాడు (ఒంగోలు దగ్గర) లో మాదాల కృష్ణయ్య, మాదాల హనుమాయమ్మ దంపతులకు నాన్న రెండో సంతానంగా పుట్టారు. పెద్దాయన మాదాల కోదండ రామయ్య. నాన్న ఒంగోలులోని శర్మ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లోనే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మ పేరు పద్మావతి. నేను పుట్టాక పెద్ద వాళ్లు అంగీకరించారు. మా తాతగారి కుటుంబీకులు ఆచార్య ఎన్జి రంగా మిత్రులు. అందుకే నాన్నకు రంగారావు అని పేరు పెట్టారు. నాన్న చాలా సింపుల్‌గా ఉండేవారు. తెల్ల ప్యాంటు, ఎర్ర చొక్కా, మఫ్లర్... లేదంటే ఎర్ర ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకునేవారు. నాన్నకి ఒక్క పైసా కూడా ఆస్తి లేదు. స్థలాలు ఇచ్చినా తీసుకోలేదు. ఆయన తీసుకునే ఆహారం చాలా సింపుల్‌గా ఉండేది. మాంసాహారం ఇష్టపడేవారు కాదు. సాంబార్ రైస్, పెరుగన్నం ఇష్టపడేవారు. చిరుతిళ్లలో ఆరోగ్యకరమైన సున్నుండలు, గారెలు ఇష్టపడేవారు. అది ఒక ప్రభంజనం... నాన్నగారికి మేం ముగ్గురు పిల్లలం. నేను మాదాల రవిచంద్... పెద్దబ్బాయిని. నాకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మా తాతలంతా సంపన్న రైతులు. నాన్న శర్మ కాలేజీలో చేరాక, ప్రజానాట్య మండలి తరఫున నాటకాలు వేస్తున్న తరుణంలో నల్లూరి వెంకటేశ్వర్లు గారి ప్రభావంతో కమ్యూనిజం భావాలు నాటుకున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ సోషియాలజీ పూర్తయ్యాక ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లారు. చైర్మన్ చలమయ్య చిత్రం నాన్న నటించిన మొదటి సినిమా. ఆ తరవాత కలియుగ మహాభారతం, హరిశ్చంద్రుడు (జాతీయ అవార్డు), వంటి సినిమాలలో నటించాక, 1980లో నవతరం పిక్చర్స్ స్థాపించి, ‘యువతరం కదిలింది’ చిత్రంతో అభ్యుదయ చిత్రాలకు, ‘ఎర్రమల్లెలు’ చిత్రంతో విప్లవ సినిమాలకు ‘విప్లవ శంఖం’ సినిమాతో ప్రభుత్వ వ్యతిరేక విధానాల చిత్రాలకు ఆద్యులయ్యారు. చాలా సినిమాలు స్కూటర్ మీద తిరుగుతూనే తీశారు. ‘ఎర్రమట్టి’ సినిమా సమయంలో డిస్ట్రిబ్యూటర్ కన్నుమూయటంతో, సొంత బ్యానర్ మీద సినిమాలు తీయటం మానేశారు. ప్రపంచాన్ని చదవాలన్నారు.. నాన్న చాలా క్రమశిక్షణతో ఉండేవారు. అప్పుడప్పుడు కొంచెం కఠినంగానే ఉండేవారు. పుస్తకాలు రుబ్చి చదవటం కాదు, శాస్త్రీయంగా చదవాలనేవారు. నాన్న ఇంట్లోకి వస్తుంటే పుస్తకాలు మూసేసేవాళ్లం. ‘గాడ్ మేడ్ మి’ అని చదువుతుంటే, ‘పేరెంట్స్ మేడ్ మి’ అనాలనేవారు. నన్ను ప్రజా కళాకారుడిని చేయాలనుకునేవారు. అమ్మ మాత్రం వైద్యుడిని చేయాలనుకుంది. ‘వైద్యుడిగా శరీరానికి పట్టిన జబ్బు, కళాకారుడిగా సమాజానికి పట్టిన జబ్బు వదిలించాలి. కళ సామాజిక చైతన్యం కోసం. వైద్యం వ్యాపారం కాకూడదు, ఆదర్శంగా పీపుల్స్ హాస్పిటల్‌గా ఉండాలి’ అనేవారు. నేను ఎండి, డిఎం చేసి, పీపుల్స్ హాస్పిటల్ నిర్మించి, ఉచితంగా సేవ చేస్తున్నాను. కోవిడ్ సమయంలో చాలామందికి ఉచిత వైద్య సేవలు అందించి, నాన్నగారి కోరిక నెరవేరుస్తున్నాను. నువ్వు మా నాన్నవు... నేను వైద్య సేవలు చేస్తూ, దేశానికి అంకితం అయ్యాను. అందుకని ‘నువ్వు దేశానికి అంకితం అయ్యావు. నువ్వు మా నాన్నవు’ అనేవారు. బ్యాగ్‌లో ఉన్న డబ్బులు కూడా చాటుగా దానం చేసేసేవారు. స్కూటర్ పెట్రోట్కి డబ్బులు లేకపోయినా, చేతిలో ఉన్నది ఇచ్చేసేవారు. పాండ్యన్ అని తమిళనాడు సెక్రటరీ. ఒకసారి ఆయన నడిచి వస్తుంటే, తన స్కూటర్ ఆయనకు ఇచ్చి, ‘నా కంటె మీరు చేయవలసినవి చాలా ఉన్నాయి. నడుస్తూ వెళితే చేయటం కష్టం. ఈ స్కూటర్ మీద ప్రయాణించండి’ అన్నారు. నాన్నకి తగ్గట్లే ఉండేది అమ్మ. చాలా సాధారణంగా జీవించింది. అమ్మకి ఎక్కువ చీరలు ఉండేవి కాదు. బస్‌లో వెళ్లి, ట్రైబల్ పార్టీ ఆర్గనైజ్ చేశారు. యూనిటీ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీ కోసం కష్టపడ్డారు. ఆదర్శాలతో జీవించాలనేవారు. మీటింగ్లకి సొంత ఖర్చుతో వెళ్లేవారు. నాన్నగారి వారసుడిగా అభ్యుదయ చిత్రాలు తీయాలనుకున్నాను. 2003లో ‘నేను సైతం’ తీస్తూ, నాన్నగారిని నటించమన్నాను. నాన్న అంగీకరించారు. అదే నాన్న నటించిన చివరి చిత్రం. ప్రజా పోరాటాలు, నిరాహార దీక్షలతో ఆరోగ్యం దెబ్బ తింది. అయినా తిరుగుతూనే ఉండేవారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. యాక్టివ్ లైఫ్ నుంచి ఇనాక్టివ్ కావటంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. 2018 మే, 27న కాలం చేశారు. ఆయన కోరిన విధంగా.. ఆయన భౌతిక దేహానికి ఎర్ర జెండా కప్పి, పార్టీ ఆఫీసులో పెట్టాం. ఆయన జీవితమంతా ప్రజలకే అంకితం అయ్యారు. కనుక ప్రజా కళాకారులు, నాయకుల సమక్షంలోనే నాన్న అంత్యక్రియలు నిర్వహించాను. నాన్న కోరిక నెరవేర్చినందుకు తృప్తి చెందాను. ఒక్క రోజులో తీశారు.. ‘ఎర్ర మల్లెలు’ చిత్రం తీస్తున్న సమయంలో ఇంట్లో ‘నాంపల్లి టేషన్’ పాట పెడుతుంటే వింటూ డ్యాన్స్ చేస్తుండేవాడిని. అప్పుడు నాన్న నన్ను ఆ సినిమాలో చేయమన్నారు. డ్యాన్స్ మాస్టర్ లేకుండా, ఆ పాటను ఒక్క రోజులో తీశారు. సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ పట్ల అవగాహన ఉండేది. అప్పట్లో నాన్న దొరకటమే మాకు కష్టంగా ఉండేది. సినిమా షూటింగ్‌లతో పాటు, ఇంట్లో ఉన్నంతసేపు ప్రజల సమస్యలు వింటూ, వారికి సహాయం చేసేవారు. సొంత ఇల్లు ఉండాలని అందరూ అంటున్నా, నాన్న పట్టించుకోలేదు. నాన్నకు... పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు ఆదర్శం. నేను పెద్దవాడినయ్యాక ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. మా చెల్లి పెళ్లి చేశాను. ఆ సమయంలో నాన్న తన జీవితంలో మొట్టమొదటిసారిగా ‘రెండు లక్షలు ఉన్నాయా’ అని అడిగితే ఇచ్చాను. ఆ డబ్బులు చేతిలో పట్టుకుని, ‘నా కూతురు పెళ్లి సందర్భంగా రెండు కమ్యూనిస్టు పార్టీలకు లక్ష చొప్పున ఇస్తున్నాను’ అంటూ లక్ష రూపాయలు సిపిఐకి, లక్ష రూపాయలు సిపిఎంకి ఇచ్చారు. – మాదాల రవి సంభాషణ: వైజయంతి పురాణపండ -
లక్షల్లో పేరుకు పోయిన ఎమ్మెల్యే ఇంటి నల్లా బిల్లు!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిల వసూలుకు అధికారులు నడుం బిగించారు. బకాయిల వసూలు కార్యక్రమంలో ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని తెగేసి చెప్తున్నారు. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ ఇంటి నల్లా కనెక్షన్‌ను వాటర్‌బోర్డు అధికారులు తొలగించారు. బాబుమోహన్ ఇంటిపై 4 లక్షల రూపాయల నల్లా బిల్లులు బకాయి ఉందని తెలిపారు. సినీ నటుడు మాదాల రవి ఇంటి నల్లా కనెక్షన్ కూడా కట్ చేశారు. రవి ఇంటిపై రూ. 3 లక్షల నల్లా బిల్లు బకాయి ఉందని వెల్లడించారు. -
ఉత్తర భారతదేశపు పార్టీ అంటే తప్పేంటి?
ఒంగోలు: భారతీయ జనతా పార్టీని ఉత్తర భారతదేశపు పార్టీ అంటే తప్పేంటో చెప్పాలని ప్రత్యేక హోదా–విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. స్థానిక ఒంగోలు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో రూ. 70 వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, మహారాష్ట్రకు రైల్వే బడ్జెట్లో రూ. 50 వేల కోట్లు కేటాయించారని, కానీ తెలుగు రాష్ట్రాలకు కేవలం రూ. 5,600 కోట్లు ముష్టిగా వేశారని అలాంటప్పుడు బీజేపీని ఉత్తర భారతీయ జనతా పార్టీ అనడం సమంజసమేనంటూ తన వాదనను సమర్థించుకున్నారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటిస్తున్నారని, ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తనతో పాటు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారని, పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బీజేపీ చెప్పే అభివృద్ధి ఏంటో స్పష్టం చేస్తామని చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్న రాజకీయ పార్టీలతో పాటు అనేక పార్టీలు తామే ఉద్యమాలు మొదలు పెట్టామంటూ చెప్పుకోవడం సరికాదని, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తామే హోదా ఉద్యమాన్ని ప్రారంభించామనేది జనానికి తెలుసన్నారు. రాజకీయ పార్టీ జెండాలకు అతీతంగా సినీ హీరోలు కూడా ప్రత్యేక హోదా ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం మునుకోటి, భాను ప్రాణత్యాగం చేశారని, వారి ఆత్మలు శాంతించాలంటే హోదా సాధని తప్పనిసరన్నారు. జూలైలో విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్నాయని, యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా నెలలో కనీసం ఒక్కరోజు వారికి నచ్చిన సమయంలో ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ఎక్కడైతే జాతీయ రహదారి కలుస్తుందో ఆ ప్రాంతంలో 24 గంటల బంద్ చేపడతామని తెలిపారు. దీంతో బంద్ ప్రభావం మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుందని పేర్కొన్నారు. హోదాకు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నామని సినీ నిర్మాత, నటుడు మాదాల రవి ప్రకటించారు. ప్రగతిశీల శక్తులు అందరూ కలిసి వచ్చి మొండి వైఖరి అవలంబిస్తున్న బీజేపీ మెడలు వంచేందుకు భగత్‌సింగ్‌లా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చుకునేందుకు తగిన నిధులు కేటాయించే వరకు పోరుబాట పడదామన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. సినీ సంగీత దర్శకులు ఖుద్దూస్ మాట్లాడుతూ కళా చైతన్యం లేకుండా ఏ ఉద్యమం కూడా విజయం సాధించలేదని, అందుకే ప్రత్యేక హోదా సాధనక కోసం తాను పాటలకు సంగీతం అందించానని, ఇటీవల తాను సంగీతం అందించిన ఓ పాటను పాడి వినిపించారు. కవులు, కళాకారులు గజ్జెకట్టి ప్రజలను ఉద్యమం వైపు నడిపించేందుకు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, ప్రొఫెసర్ డాక్టర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు -
నింగికేగిన‘రెడ్ స్టార్’
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు కల్చరల్: వెండి తెరకు ‘ఎర్ర’రంగులద్దిన విప్లవ శంఖం మూగబోయింది. సినీ వినీలాకాశంలో ‘రెడ్ స్టార్’గా వెలుగొందిన ఎర్ర సూరీడు అస్తమించాడు. విప్లవ, అభ్యుదయ భావాలతో ఓ తరాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ నటు డు, నిర్మాత మాదాల రంగారావు (70) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతు న్న ఆయన్ను చికిత్స కోసం 19న స్టార్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు డాక్టర్ మాదాల రవి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ గూడపాటి పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించినా ఫలి తం లేకపోయింది. రెండు మాసాల కిందట గుండెపోటు రావడంతో రంగారావుకు చైన్నైలో చికిత్స అం దించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమా ర్తె ఉన్నారు. సోమవారం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో మాదాల అంత్యక్రియలు జరగనున్నాయి. నాటకాల నుంచి సినీరంగం వైపు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో 1948 మే 25న మాదాల రంగారావు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఒంగోలు మున్సిపల్ హైస్కూలులో విద్యనభ్యసించారు. అనంతరం కళాకారుల పుట్టినిల్లైన సీఎస్ఆర్ శర్మ కాలేజీలో బీఏ చదివారు. నల్లూరి వెంకటేశ్వర్లు సాహచర్యంలో కళాకారుడిగా ఎదిగారు. అభ్యుదయ చిత్రాలకు నూతన ఒరవడి దిద్దిన టి.కృష్ణ, పోకూరు బాబూరావు, వందేమాతరం శ్రీనివాస్, నర్రాతోపాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటివారు సినీరంగం వైపు ఆకర్షితులు కావడానికి మాదాలే స్ఫూర్తిగా నిలిచారు. సినీరంగంలోకి వచ్చే ముందు అనేక నాటకాల్లో నటించిన ఆయన మొదటిసారిగా నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై 1980లో ‘యువతరం కదిలింది’ సినిమా తీశారు. ఆ చిత్రం శత దినోత్సవం జరుపుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం గెల్చుకుంది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్ర పావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’తదితర చిత్రాల్లో నటించి రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 80వ దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కళ ప్రజల కోసం.. ప్రజా కళాకారుడిగా, ప్రజా నాట్యమండలి నీడన మా దాల ప్రజలను చైతన్యపరిచే చిత్రాలనే నిర్మించారు. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే గరికిపాటి రాజారావు మార్గంలో పయనించారు. సినిమాల ద్వా రా వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వడంతోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల కు, దానధర్మాలకు వెచ్చించేవారు. గతంలో సినిమాలన్నీ స్టూడియోల్లోనే రూపుదిద్దుకునేవి. ఆ సంప్రదాయాన్ని తోసిరాజని సినిమా మొత్తాన్ని ప్రజల మధ్య రూపొందించిన ఘనత మాదాలకే దక్కుతుంది. ప్రముఖుల నివాళి ఆదివారం ఉదయం మాదాల పార్థివ దేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. మంత్రి తలసానితో పాటు సినీ నటులు చిరంజీవి, శ్రీకాంత్, శివాజీరాజా, నరేశ్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, వామపక్షాల నేతలు నారాయణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. పవన్ కల్యాణ్ ఆయన మృతి పట్ల ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు బాగ్ లింగంపల్లిలోని ఎస్వీకేలో అభిమానుల సందర్శనార్థం మాదాల భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న చిరంజీవి చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం: జగన్ మాదాల రంగారావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. వామపక్ష భావజాలంతో కూడిన సినిమాలతో కీర్తి గడించిన రంగారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, స్థానాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. మాదాల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేసీఆర్ సంతాపం మాదాల మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు తీయడం ద్వారా మాదాల అనేక మందికి స్ఫూర్తి కలిగించారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమానికి తీరనిలోటు మాదాల రంగారావు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి, కళారంగానికి తీరని లోటు. అభ్యుదయ, వామపక్ష భావాలు కలిగిన ఎన్నో సినిమాలు నిర్మించి ఆయన ప్రజలను చైతన్యపరిచారు. – తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి తలసాని, చిత్రంలో మాదాల రవి. -
టాలీవుడ్ నటుడు మాదాల రంగారావు కన్నుమూత
-
ప్రముఖ సినీనటుడు ‘రెడ్‌స్టార్’ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు(70) ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈనెల 20న హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మాదాల కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజల, ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌లోని మాదాల రవి ఇంటికి తరలించనున్నారు. మాదాల రంగారావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నటుడి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేపథ్యం.. ప్రకాశం జిల్లా మైనం పాడు మాదాల స్వగ్రామం. 1948 మే 25న ఆయన జన్మించారు. నవతరం పిక్చర్స్ బ్యానర్లో సినిమాలు నిర్మించిన మాదాల, ఎక్కువగా విప్లవ భావాలు కలిగిన చిత్రాలనే తీశారు. నేటి తరంలో విప్లవ సినిమాలకు చిరునామాగా నిలిచిన ఆర్ నారాయణమూర్తికి మాదాల స్పూర్తిగా నిలిచారు. 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, విప్లవశంఖం, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి సినిమాల్లో నటించారు. -
హాస్పిటల్లో మాదాల
విప్లవ నటుడు, నిర్మాత ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన కుమారుడు, నటుడు మాదాల రవి మాట్లాడుతూ – ‘‘నాన్నగారికి గత ఏడాది గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించాం. అప్పటి నుంచి ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. డయాలసిస్ జరుగుతోంది. ఆయన్ని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మాదాల రంగారావు పరిస్థితి విషమం
విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ మేరకు ఆయన కుమారుడు మాదాల రవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైన మాదాల రంగారావుకు స్టార్ హాస్పిటల్ వైద్యులు చికిత్స చేశారు. అప్పటి నుంచి రంగారావు స్టార్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నారు. శనివారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో హాస్పిటల్ చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న ఆయనకు డయాలిసిస్ చేస్తున్నట్టుగా మాదాల రవి తెలిపారు. -
నాంపల్లి టేషనుకాడి...
‘‘రూపాయి నోటుకి కొత్త రూపం వచ్చింది. కానీ.. ధనిక–పేద అంతరాలు మారలేదు! సంపాదనకి కొత్త కొత్త మార్గాలు వచ్చాయి. కానీ.. ఇతరుల కష్టాన్ని దోచుకోవాలనే కొందరి స్వార్థం మారలేదు!’’ అన్నారు నటుడు మాదాల రవి. మాదాల రంగారావు, మురళీమోహన్ హీరోలుగా ‘ధవళ’ సత్యం దర్శకత్వంలో మాదాల రంగారావు నిర్మించిన చిత్రం ‘ఎర్ర మల్లెలు’. విప్లవ చిత్రాలకి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రంలోని ‘నాంపల్లి టేషనుకాడి..’ పాటను ‘ప్రజా నాట్యమండలి’ ప్రభు రాశారు. ఈ పాటతత్వం గురించి మాదాల రవి మాటల్లో... సుమారు ముప్ఫై ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ పాట వింటుంటే... అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పు రాలేదనిపిస్తుంది. పాట సందర్భం ఏంటంటే.... ఓ ధనవంతుడు నాంపల్లి నుంచి ఒంగోలుకి రైల్లో వస్తాడు. అక్కణ్ణుంచి ఆయన ప్రయాణం కోసం స్టేషన్ బయట ఖరీదైన కారు సిద్ధంగా ఉంటుంది. ఆ కారుని శుభ్రం చేస్తున్న కుర్రాణ్ణి చూసి జాలిపడిన వాళ్లావిడ ఏదైనా సహాయం చేయమంటుంది. అప్పుడా ధనవంతుడు కోపంతో ‘నాంపల్లి స్టేషన్లో ఎక్కింది మొదలు ఒంగోలు దిగే వరకు ఎక్కడ చూసినా ఇలాంటోళ్లే. ఇడియట్స్! కల్చర్ పెరిగిపోయి దేశమంతా రామరాజ్యం అయిపోతుంటే.. ఇలాంటి వెధవలంతా కలసి ఆ పేరుని పాడు చేస్తున్నారు’ అని వెళ్లిపోతాడు. అప్పుడీ పాట మొదలవుతుంది. పల్లవి: నాంపల్లి టేషనుకాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివాశంభు లింగా... లింగా (2) నాంపల్లి టేషనుకాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివాశంభు లింగా... లింగా (2) ‘ఒంగోలే కాదు.. నాంపల్లితో పాటు మన దేశమంతా ఇటువంటి పరిస్థితే ఉందా?’ అని పిల్లాడు ఈ పాట అందుకుంటాడు. అప్పుడు నాంపల్లి స్టేషన్, ఇప్పుడు హైదరాబాద్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ట్రాఫిక్ సిగ్నల్స్... ప్రతిచోటా కారు శుభ్రం చేయడానికి వచ్చే పిల్లలు అప్పుడప్పుడూ కనిపిస్తారు. చరణం : తిందామంటే తిండీలేదు... ఉందామంటే ఇల్లే లేదు (2) చేద్దామంటే కొలువు లేదు... పోదామంటే నెలవు లేదు ‘‘ నాంపల్లి..‘‘ గుక్కెడు గంజి కరువైపాయే... బక్కటి ప్రాణం బరువైపాయే (2) బీదబిక్కి పొట్టలు గొట్టి... మేడలు గట్టె సీకటి శెట్టి ‘‘నాంపల్లి..‘‘ స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా మనిషి కనీస అవసరాలు తిండి, ఇల్లు, ఉద్యోగం లేని ప్రజలు మన దేశంలో ఉన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చాయి. కానీ, ఇదే టెక్నాలజీని ఉపయోగించి పేదల కష్టాన్ని దోచుకుంటున్న ధనవంతుల గురించి అప్పుడప్పుడూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం. చరణం: లేని అమ్మది అతుకుల బతుకు.. ఉన్న బొమ్మకి అందం ఎరువు (2) కార్లలోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె ‘‘నాంపల్లి..‘‘ ఈ చరణం విన్నప్పుడల్లా ‘ప్రభుగారు ఎంత ముందు చూపుతో ఆలోచించారు’ అనిపిస్తుంది. పాశ్చాత్య సంస్కృతి పేరుతో చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడం ఇప్పటి ట్రెండ్. ఓ పక్క పేదలు చిరిగిన బట్టలకు అతుకులు వేసుకుంటుంటే.. మరోపక్క డబ్బున్నోళ్లు అందంగా ముస్తాబవడానికి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎవర్నీ తప్పుబట్టడం లేదు. కానీ, మన భారతీయ సంస్కృతికి సుదూరంగా ప్రజలు వెళ్తున్నారనేది అక్షర సత్యం. పైగా, ఇప్పుడు బట్టలు ఎంత కురచగా ఉంటే అంత ఎక్కువ రేటు ఉంటున్నాయి. చరణం: ముందు మొక్కులు ఎనక తప్పులు... ఉన్నవాడికే అన్నీ చెల్లును (2) ఉలకావేమి పలకావేమి... బండరాయిగ మారిన సామి ‘‘నాంపల్లి..‘‘ అప్పుడూ.. ఇప్పుడూ... వేలకోట్లకు టోపీ పెట్టేసినోళ్లు ఎక్కడైనా దర్జాగానే తిరుగుతున్నారు. పైకి దేవుడికి మొక్కుతున్నారు. వెనక తప్పులు చేస్తున్నారు. వాళ్లకు అన్నీ చెల్లుతున్నాయి. ఈ పరిస్థితులపై భగవంతుడు ఎప్పుడూ స్పందించడం లేదు! అని కుర్రాడు బాధతో పాటని ముగిస్తాడు. ఈ పాటకి చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రముఖ గాయని ఎస్పీ శైలజగారు ఈ పాటతోనే చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి పాటతోనే ఉత్తమ గాయనిగా నంది పురస్కారం అందుకున్నారామె. నేను బాల నటుడిగా పరిచయమైంది కూడా ఈ పాటతోనే. ఇందులో నేను నటించడం వెనుక జరిగిన ఓ చిత్రమైన సంఘటన గురించి చెప్పాలి. ఈ చిత్రానికి నిర్మాత నాన్నగారే కదా. పాటల రికార్డింగ్ పూర్తయిన తర్వాత క్యాసెట్ ఇంటికి తీసుకొచ్చారు. ఓసారి ఈ పాట పెట్టుకుని నేను డ్యాన్స్ చేస్తున్నాను. ఎక్కడో బయటకు వెళ్లొచ్చిన నాన్నగారు నన్ను చూశారు. పాటంతా పూర్తయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మెచ్చుకున్నారు. తర్వాత సినిమాలో కూడా నా చేత నటింపజేశారు. ఒక్క రోజులోనే పాట చిత్రీకరణ పూర్తయింది. మరో విశేషం ఏంటంటే... ప్రముఖ దర్శకులు టి. కృష్ణగారు ఈ పాటకి దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. ఈ పాటకి నృత్యదర్శకులు ఎవరూ లేరు. టి. కృష్ణగారితో పాటు చిత్ర దర్శకులు ‘ధవళ’ సత్యంగారు, చిత్రానికి కో–డైరెక్టర్‌గా పనిచేసిన బి. గోపాల్... ముగ్గురూ కలసి చిత్రీకరించారు. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ‘ఎర్ర మల్లెలు’ చిత్రం సిల్వర్‌జూబ్లీ ఆడింది. సినిమాతో పాటు పాట కూడా సూపర్‌హిట్. ‘ప్రజా నాట్యమండలి ప్రభుగారు రాసిన ఏకైక పాట ఇది. తెలుగులోని అత్యుత్తమ వంద పాటల్లో ‘నాంపల్లి టేషనుకాడ..’ పాట ఒకటని ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్ఎఫ్డీసీ) పేర్కొంది. ఇంటర్వూ్య: సత్య పులగం -
భయపెడుతూ..నవ్విస్తూ...
హారర్ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎంత భయపెట్టినా, ఇంకా భయపడాలని కోరుకుంటారు ప్రేక్షకులు. మరో చిత్రం ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైంది. మనోజ్ నందం, మాదాల రవి ముఖ్యతారలుగా శ్రీ హయగ్రీవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా. జేఆర్ రావు నిర్మించిన చిత్రం ‘అలౌకిక’. భానుకిరణ్ చల్లా దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. మంచి హారర్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే నవ్విస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. -
ఐదు కథలతో హారర్
దెయ్యాలతో అనుబంధం ఉన్న ఓ అయిదుగురి కథతో రూపొందిన చిత్రం ‘పంచముఖి’. ఆర్యన్ రాజేశ్, కృష్ణుడు, మాదాల రవి, చిన్నా, ఉత్తేజ్ ప్రధాన పాత్రలుగా గల ఈ చిత్రంలో సుమన్ ప్రత్యేక పాత్ర పోషించారు. చల్లా భానుకిరణ్ దర్శకుడు. యార్లగడ్డ కిరణ్ నిర్మాత. సుమన్, ప్రమోద్, మోహన్ బల్లేపల్లి, జయసూర్య, భాను కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని అల్లరి నరేశ్ ఆవిష్కరించి, తొలి ప్రతిని మాదాల రవికి అందించారు. ఆద్యంతం అలరించే హారర్ చిత్రమిదని, ఇందులో ఓ భిన్నమైన పాత్ర పోషించానని ఆర్యన్ రాజేశ్ చెప్పారు. ‘‘ఇందులోని ప్రధానమైన అయిదు పాత్రలకీ ఒకదానికొకటి లింకు ఉంటుంది. అదే ఇందులో ఆసక్తికరమైన అంశం’’ అని దర్శకుడు చెప్పారు. ఐదు కథలు, ఐదుగురు హీరోలు, ఐదు పాటలు, ఐదుగురు సంగీత దర్శకుల సమాహారమే ఈ సినిమా అని నిర్మాత తెలిపారు.