సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు(70) ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈనెల 20న హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మాదాల కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజల, ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌లోని మాదాల రవి ఇంటికి తరలించనున్నారు. మాదాల రంగారావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నటుడి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నేపథ్యం.. ప్రకాశం జిల్లా మైనం పాడు మాదాల స్వగ్రామం. 1948 మే 25న ఆయన జన్మించారు. నవతరం పిక్చర్స్ బ్యానర్లో సినిమాలు నిర్మించిన మాదాల, ఎక్కువగా విప్లవ భావాలు కలిగిన చిత్రాలనే తీశారు. నేటి తరంలో విప్లవ సినిమాలకు చిరునామాగా నిలిచిన ఆర్ నారాయణమూర్తికి మాదాల స్పూర్తిగా నిలిచారు. 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, విప్లవశంఖం, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి సినిమాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment