మాదాల రంగారావు
తెలుగు సినిమా ఎర్రజెండాను చూసింది ఆయనతోనే. ఎర్రజెండాను హీరోగా మలుచుకుంది ఆయనే. సినీ పరిశ్రమలో మాదాల అడుగు పెట్టిన తర్వాత ఏ పరిస్థితిల్లోనూ తన సిద్ధాంతాలను విడవలేదు. ఎర్రజెండా గౌరవాన్ని తగ్గించలేదు. తను ఎలా ఉండాలనుకున్నాడో అలానే చివరి శ్వాస వరకు ఉన్నారు. అనుకున్నట్లుగానే మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఆయనే రెడ్‌స్టార్ ‘మాదాల రంగారావు’. మే నెల 25వ తేది 1948 సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పక్కన ఉన్న మైనంపాడు గ్రామంలో జన్మించారు.
తను హైస్కూల్ చదువుకొనే రోజుల నుంచే వామపక్ష భావజాలానికి ప్రభావితమై సుమారు పదిహేనేళ్ల వయస్సులో ప్రజా నాట్యమండలిలో చేరారు. అతి కొద్ది కాలంలోనే కీలక సభ్యుడిగా వ్యవహరించారు. ప్రజా నాట్యమండలి నిర్వహించే సభలలో అనేక నాటకాలను ప్రదర్శించారాయన. అలా నటనపై ఏర్పడిన మక్కువతో చెన్నపట్నం చేరుకున్నారు రంగారావు . ప్రజా నాట్యమండలిలో చురుకుగా పాల్గొంటూనే సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి చెన్నై వెళ్లారు.
తండ్రితో మాదాల రవి
అక్కడ వేషాలొచ్చె పరిస్థితి కనుచూపుమేరలో కనపడక పోవడంతో తిరిగి పుస్తకాలు చేత పట్టి విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ ఆంధ్రా యూనివర్సిటీలో యం.ఏ పూర్తి చేసిన తర్వాత, తనకు అంతకుముందే ప్రజా నాట్యమండలిలో అన్నా అంటూ పరిచయమైన టి. కృష్ణను పిలిచి ‘నాకు వేషాలు రావట్లేదు, నీకు దర్శకత్వం చాన్స్ ఎవ్వరు ఇవ్వట్లేదు. మనకు మనమే ప్రయత్నం చేద్దామని’ టి.కృష్ణను వెంటపెట్టుకుని మద్రాసు చేరుకున్నారు మాదాల. అలా చెన్నై వెళ్లిన ఆయన మొదట ‘చైర్మన్ చలమయ్య’ అనే సెటైరికల్ సినిమాలో నటించారు.
ఆ తర్వాత రంగారావు తన సొంత నిర్మాణ సంస్థ ‘నవతరం పిక్చర్స్’ను స్థాపించారు. నవతరం పిక్చర్స్ పతాకంపై తన మొదటి ప్రయత్నంగా ‘యువతరం కదిలింది’ అనే చిత్రాన్ని ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మించారు. తన మొదటి చిత్రానికే ప్రేక్షకులు బ్రహ్మర«థం పట్టారు. ఆ సినిమాకు బంగారునంది అవార్డు వరించింది. అప్పటి వరకు ప్రేమ సినిమాలు ఎక్కువగా ఆడుతున్న రోజుల్లో విప్లవాత్మక సినిమాలతో ట్రెండ్ సెట్ చేశారాయన. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందాయి. నటుడిగా దాదాపు 70 సినిమాలు, నిర్మాతగా 15 సినిమాలు నిర్మించారు మాదాల రంగారావు. ఏ పసంగాన్నైనా ‘లాల్ సలామ్..’ అంటూ మొదలుపెట్టి, ముగించడం మాదాల స్టైల్.
టి. కృష్ణతో పాటు ప్రజా నాట్యమండలి సభ్యులైన బి. గోపాల్, నర్రా వెంకటేశ్వరరావు, రచయిత ఎమ్‌వీఎస్ హరినాథరావు, ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు వీరంతా మద్రాసు చేరుకోవడానికి ఊతమిచ్చింది మాదాల రంగారావే. ప్రజా నాట్య మండలి సభ్యులలో తమ ఎర్రజెండాను హీరోగా చేస్తూ ఆ జెండాను పతాక స్థాయికి చేర్చి ‘రెడ్‌స్టార్’గా అందరితో పిలిపించుకున్నారు మాదాల రంగారావు. కొడుకు పేరును రవిచంద్ అని, దర్శకుడు టి. కృష్ణ కుమారుడుకి గోపీచంద్ అని నామకరణం చేసింది కూడా మాదాలనే. వీరితో పాటు ఇప్పటి ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు కూడా ఆయనే పేరు పెట్టారు. (మాదాల రంగారావు సొంత మరదలు కుమారుడే గోపీచంద్ మలినేని).
కమ్యూనిజమే శ్వాసగా బతికారు – మాదాల రవి
‘‘ప్రజా కళాకారులకు మరణం ఉండదు. వారు ఎల్లపుడూ ప్రజల మనస్సులో సజీవంగా నిలిచి ఉంటారు. నాన్నగారు విప్లవాత్మక చిత్రాల్లో ట్రెండ్‌సెట్టర్. వెండి తెర మీద ఎర్ర జెండాను చూపెట్టిన విప్లవకారుడు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ విప్లవకారుడాయన. కమ్యూనిజమే శ్వాసగా బతికారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసమే నిలబడ్డారు. సినిమాలు హిట్ అయినప్పుడు సొంతగా ఏ ఆస్తులు కొన్నది లేదు. సినిమాల్లో హీరో అవ్వడానికి రాలేదు. జనంలో చైతన్యం తీసుకురావడానికి వచ్చారు. సినిమాను ఒక సాధనంగా ఉపయోగించాలి అని నమ్మారు.
టి. కృష్ణ, నాన్నగారు కలసి అనేక నాటకాలు వేశారు. వాళ్లిద్దరూ ఆత్మ బంధువులు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవారు. ‘వైద్యుడి యొక్క ధర్మం శరీరంలో ఉన్న జబ్బును పోగొట్టడం. కళాకారుడి యొక్క ధర్మం సమాజానికి పట్టిన జబ్బు వదలకొట్టడం’ అని నాన్నగారు నాతో అంటుండేవారు. బయట బ్యానర్ సినిమా అనేది ఎలా ఉన్నా. మన సొంత సినిమాలో కచ్చితంగా ఒక సమాజిక అంశం ఉండాలి అనేవారు. శ్రీశ్రీగారు మా నాన్నాగారు చాలా మంచి స్నేహితులు. నాన్నగారి సినిమాలు అన్నింటికీ పాటలు రాశారు. శ్రీశ్రీగారిని ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీగారి పాత్రలోనే చూపించారు.
మాట మీద నిలబడేవాడే కమ్యూనిస్టు
మాదాల రంగారావుగారితో నాలుగు సినిమాలు పని చేశాను. సినిమా ఇండస్ట్రీలో కమ్యూనిస్ట్‌లు అని చెప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు. కాని ప్రాక్టికల్‌గా అలా బతకడం చాలా కష్టం. ఆ కష్టంలో ఆయన ఆనందాన్ని వెతుక్కున్నారు. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. సినిమాల్లో పని చేస్తూ కూడా ఉద్యమాల్లో పాల్గొనేవారాయన. నా మొదటి సినిమా చిరంజీవి గారు చేసిన ‘జాతర’. ఆ సినిమా ప్రివ్యూ థియేటర్‌లోనే నువ్వు నా ‘యువతరం కదిలింది’ సినిమాకు డైరెక్టర్ అన్నారు. ‘జాతర’ కమర్షియల్‌గా ఆడలేదు. అయినా ఇచ్చిన మాట మీద నిలబడ్డారు.
ఒకసారి ‘‘జాతర’ ఫ్లాప్ కదా నన్ను ఎందుకు తీసుకున్నారు’ అని ఆయన్ను అడిగాను.ఫెయిల్యూర్, సక్సెస్‌లతో మాట మార్చేవాడు బజారోడు తమ్ముడు. మాట మీద నిలబడే వాడే కమ్యూనిస్ట్’ అన్నారు. ఆయన మాట అన్నాడంటే జరగాల్సిందే. దటీజ్ మాదాల రంగారావు. పొద్దున ఆయన మృతదేహాన్ని చూస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఎవరు సహాయనికి వచ్చినా చేసేవారు. ఏంటన్న అలా ఇచ్చేస్తున్నావు అని అడిగితే ‘వాళ్ళ డబ్బులే వాళ్లకు ఇస్తున్నాం కదా’ అనేవారు. ‘ఎర్రమల్లెలు’ టైటిల్‌కి నెగిటివ్ కామెంట్స్ వస్తున్న విషయాన్ని ఆయనకు చెబితే ‘ఎరుపంటే వాళ్లకు భయం తమ్ముడు. మనకు ఇష్టం’ అన్నారు.
ధవళ సత్యం
ఎర్రజెండాను తెరపై రెపరెపలాడించిన వీరుడు
ఎర్రజెండాను వెండి తెరపై రెపరెపలాడించిన వీరుడు. వామపక్షాలు కలవాలి? ఏకమవ్వాలనే సిద్ధాంతాన్ని నమ్మేవారు. రంగారావుగారు చేసిన కృషికి సెల్యూట్. నటుడిగా నేను జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తున్న రోజుల్లో ‘జనంమనం, మహాప్రస్థానం’ సినిమాల్లో అభిమానంతో నాకు వేషం ఇచ్చారు. వందేమాతరం శ్రీనివాస్, టి. కృష్ణా, నర్రా వెంకటేశ్వరరావు గారు,‘ఈతరం’ బాబురావుగారు వీళ్లంతా నల్లూరి వెంకటేశ్వరరావుగారి శిష్య బృందం. ఈయన ఫస్ట్ సినిమా ‘యువతరం కదిలింది. ‘నభూతో భవిష్యత్తు, ఎర్ర మల్లెలు’ సినిమాలు ఒక విప్లవం తీసుకు వచ్చాయి.
ఆయన స్ఫూర్తితో చాలా మంది విప్లవ సినిమాలు తీశారు. మేం అధికార పక్షం కాదు, అపోజిషన్ కాదు. మేమంతా ప్రజల పక్షం. ఎర్ర సినిమాలు తీయడానికి ఆద్యులు మేము కాదు అంతం మేం కాదు. విప్లవాత్మక సినిమాల్లో మాదాలగారు తనదైన మార్క్ ఏర్పరుచుకున్నారు. సెల్యూట్ టూ హిమ్. మేం డాక్యుమెంటరీగా కాకుండా జనరంజకంగా చెబుతాం. తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ మాదాల రంగారావుగారు. నా ఎర్ర సైన్యం, లాల్ సలామ్ సినిమా చూసి బాగా మెచ్చుకున్నారు. ‘విప్లవాత్మక సినిమాలు ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నావు. హ్యాట్సాఫ్ నారాయణమూర్తి’ అన్నారు రంగారావుగారు.
ఆర్.నారాయణమూర్తి
కథానాయకుడిగా, నిర్మాతగా ఒక నిబద్ధతతో సినిమాలు రూపొందించిన వ్యక్తి మాదాల రంగారావు. నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ జీవించిన మంచి మనిషి ఆయన. నాకు మంచి స్నేహితుడైన మాదాల రంగారావు మరణం నన్ను ఎంతగానో బాధించింది. చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ షిరిడీ సాయినా«థుని వేడుకుంటున్నాను.
మోహన్‌బాబు
విప్లవాత్మక సినిమాలు చేస్తూ కమర్షియల్ సినిమా అవకాశాలు వచ్చినా కూడా కాదని తాను నమ్మిన సిద్ధాంతాలతో ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తి మాదాల. ఆర్. నారాయణ మూర్తి లాంటి వారికి మాదాల స్ఫూర్తి. నేను ఒంగోలులో ఉన్నప్పుడు మాదాల రంగారావు, టి. కృష్ణ, పోకూరి బాబూరావులతో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో మాదాల రంగారావు ఒకరు.
చిరంజీవి
ప్రజల సమస్యలపై అనేక గొప్ప సినిమాలు నిర్మించిన గొప్ప వ్యక్తి మాదాల. ఆయన సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోతే ప్రభుత్వాల మెడలు వంచి సెన్సార్ సర్టిఫికెట్‌ను సంపాదించుకున్నారు. ఆ వ్యక్తి అకాల మరణం చెందటం బాధాకరం.
– తలసాని శ్రీనివాస్ యాదవ్
నేను, రంగారావు చాలా మంచి స్నేహితులం. ఇద్దరం ఎప్పుడూ ఆయన స్కూటర్‌పైనే తిరుగుతూ ఉండేవాళ్లం. ఆ టైమ్‌లో నేను నిర్మాతగా చిరంజీవి నటించిన ‘కోతలరాయుడు, మొగుడు కావాలి’ రెండు సినిమాలను ఆయన స్కూటర్ మీద తిరుగుతూనే నిర్మించాను. అప్పుడు మా స్నేహితులందరూ ఎప్పుడు ఆయన స్కూటర్ మీద తిరుగుతుంటావు నీ సినిమాలో ఓ వేషం ఇవ్వచ్చు కదా అని నన్నడిగారు. అప్పుడు నేను ఆయన నాకు మంచి స్నేహితుడే కానీ నటించటానికి రంగారావు పనికిరాడని చెప్పాను. కట్‌చేస్తే ఎప్పుడు బ్యానర్ పెట్టాడో, సినిమా ఎప్పుడు తీశాడో కాని ‘యువతరం కదిలింది’ అనే పెద్ద హిట్‌తో ఒక్కసారిగా షాకిచ్చాడు. చాలా కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి రంగారావు.
– తమ్మారెడ్డి భరద్వాజ
మాదాల రంగారావుతో నాది 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. సినిమాలకు నన్ను పరిచయం చేసింది ఆయనే. ప్రజల కోసమే సినిమాలు తీశారాయన. మాదాల లేకపోతే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా నేను లేను.
– వందేమాతరం శ్రీనివాస్.
రెడ్‌స్టార్ మాదాలగారి మరణంతో నిబద్ధతతో ఎగిరిన ఎర్రజెండా వాలిపోయింది. అర్థంలేని సెంటిమెంట్లకు, మూఢవిశ్వాసాలకు ఆలవాలమైన తెలుగు సినిమారంగంలో రంగారావుగారు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ‘యువతరం కదిలింది’ సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీకు పరిచయం చేశారాయన. ‘విప్లవశంఖం’ సినిమాకు సెన్సార్‌బోర్డ్ అభ్యంతరం చెప్పడంతో వారి కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేసి మరో సంచలనానికి కారణం అయ్యాడు. పాటల రికార్డింగ్ రోజునే విడుదల తేది ప్రకటించేవారు. సినిమా నిర్మాణం వ్యాపారంలా కాకుండా ఆశయంగా భావించారు. ఆయన మరణ వార్త తెలుగు సినిమా రంగంలో ప్రగతిశీల శక్తులమీద పిడుగులా పడింది.
– అదృష్ట దీపక్
Comments
Please login to add a commentAdd a comment