![Madras HC Refuses To Set Aside Rs 1 Lakh Cost Imposed On Mansoor Ali Khan In A Defamation Case - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/31/Madras.jpg.webp?itok=EkNb00B6)
తప్పు చేసిందే కాకుండా తప్పించుకోవాలని చూశాడు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. హీరోయిన్ త్రిషపై ఈయన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే! 'లియో సినిమాలో హీరోయిన్ త్రిష అని తెలిశాక తనతో బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను, కానీ అది జరగలేదు' అని వ్యాఖ్యానించాడు. ఇందులో అశ్లీల ధ్వనికి హీరోయిన్ త్రిష స్పందించింది. తనతో ఇంకే సినిమాలోనూ నటించేదే లేదని తేల్చి చెప్పింది. చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు తారలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. తన మాటల్లో తప్పు కనిపించలేదుకానీ అందరూ తనను తప్పుపడుతున్నారని ఫీలయ్యాడు మన్సూర్.
కోటి అడిగాడు.. రూ.1 లక్ష కట్టమన్న కోర్టు
త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని, తనకు ముగ్గురి నుంచి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్ వేశాడు. ఇది చూసి బిత్తరపోయిన కోర్టు మన్సూర్‌కు గడ్డిపెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన నీవు వారిపై పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కోర్టు సమయం వృథా చేసినందుకుగానూ చెన్నైలో అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1 లక్ష చెల్లించాలంటూ సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేసింది.
పది రోజుల్లో కడతానంటూ ట్విస్ట్
ఇది జరిగి నెల రోజుల పైనే అవుతోంది. ఇప్పటివరకు మన్సూర్ ఆ రుసుమును కట్టనేలేదు. వారం రోజుల క్రితం కోర్టు ఇదే విషయాన్ని గుర్తు చేయగా మరో పది రోజుల గడువు కావాలన్నాడు నటుడు. అతడి అవస్థను చూసిన న్యాయస్థానం.. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోమని మొట్టికాయలు వేస్తూనే మరో పది రోజుల గడువు ఇచ్చింది. చివరకు ఆ డబ్బు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు నటుడు.
స్టేకు నిరాకరించిన న్యాయస్థానం
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలుకు దరఖాస్తు చేశాడు. మన్సూర్ వైఖరికి విస్తుపోయిన న్యాయస్థానం.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది. డబ్బు కడతానని అంగీకరించాక ఆ తీర్పును ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఎదుటే ఏ విషయమో తేల్చుకుని రావాలని చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. గొడవ సద్దుమణిగిందనుకుంటే ఈయన మళ్లీ మొదలుపెట్టాడేంట్రా బాబూ అని తల బాదుకుంటున్నారు సినీప్రేక్షకులు.
చదవండి: థియేటర్‌లో హనుమాన్ చూస్తూ మహిళ వింత చేష్టలు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment