వీకెండ్‌ లాక్‌డౌన్‌తో హిందీ చిత్రాలకు షాక్‌ | Maharashtra Government New Guidelines For Covid 19 Second wave | Sakshi
Sakshi News home page

వీకెండ్‌ లాక్‌డౌన్‌తో హిందీ చిత్రాలకు షాక్‌

Published Mon, Apr 5 2021 3:32 AM | Last Updated on Mon, Apr 5 2021 8:36 AM

Maharashtra Government New Guidelines For Covid 19 Second wave - Sakshi

హిందీ చిత్రాలకు కరోనా పెద్ద షాక్‌ ఇచ్చింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం బాలీవుడ్‌ను కష్టాలపాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 15 మందికిపైగా బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారినపడ్డారు. థియేటర్స్‌లో సీటింగ్‌ ఆక్యుపెన్సీని యాభై శాతానికే పరిమితం చేయడం వల్ల సినిమాల రిలీజ్‌లు కూడా వాయిదాలు పడుతు న్నాయి. ఈ కారణాలతోనే బాలీవుడ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ను అనౌన్స్‌ చేసింది. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది బాలీవుడ్‌ పరిస్థితి.

నైట్‌ కర్ఫ్యూ వలన సెకండ్‌ షో సినిమాలు రద్దు అవుతాయి. ఈ ప్రభావం ఇండస్ట్రీపై పడుతుంది. సాధారణంగా సినిమా రిలీజ్‌లు అన్నీ వీకెండ్స్‌లోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తాజా వీకెండ్‌ లాక్‌డౌన్‌ కారణంగా కొత్త సినిమాల విడుదల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీకెండ్‌ లాక్‌డౌన్‌ శుక్రవారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు ఉంటుంది. ఈ ప్రకారం శుక్రవారం ఫస్ట్‌ షో తర్వాత మళ్లీ థియేటర్‌లో బొమ్మ పడేది సోమవారం ఫస్ట్‌ షోతోనే. ఈ పరిస్థితులు కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

మరోవైపు సినిమాల ప్రదర్శనే కాదు... షూటింగ్‌లపై కూడా నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ల ప్రభావం పడుతుంది. ఇప్పటివరకు షూటింగ్‌ లొకేషన్స్‌లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షూట్‌ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం షూట్‌ లోకేషన్‌లో 33శాతం మంది క్రూ మెంబర్స్‌కు మాత్రమే అనుమతి. ఈ నిబంధన ప్రకారం భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లకు, క్రౌడ్‌ ఎక్కువ కావాల్సిన సన్నివేశాల చిత్రీకరణకు, సాంగ్స్‌కు బ్రేక్‌ పడక తప్పదు.  అలాగే నైట్‌ కర్ఫ్యూతో నైట్‌ షూటింగ్‌లు అన్నీ రద్దు అవుతాయి.

ఈ పరిణామాలు బాలీవుడ్‌ను మరింత కుదిపేస్తాయి. ‘‘గత ఏడాది సెప్టెంబర్‌లో ఉన్న పరిస్థితుల మాదిరిగానే పెద్ద సంఖ్యలో జూనియర్‌ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, పెద్ద ఫైట్‌ సీన్స్‌కు అనుమతి లేదు. 33శాతం క్రూ మెంబర్స్‌తో మాత్రమే లొకేషన్‌లో షూట్‌ చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌ అధ్యక్షుడు బిన్‌ తివారి. సినీ ప్రముఖలందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను విధించిందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement