దైవం మహేష్ రూపేణ.. వారి కోసం 'మహేశ్‌' ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..? | Mahesh Babu 49TH Birthday Special Story | Sakshi
Sakshi News home page

బాబు బంగారం.. వారి కోసం 'మహేశ్‌' ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..?

Published Fri, Aug 9 2024 8:44 AM | Last Updated on Fri, Aug 9 2024 11:03 AM

Mahesh Babu 49TH Birthday Special Story

మహేశ్‌బాబు అనగానే టక్కున గురొచ్చేది రాజకుమారుడు లాంటి అందం. ఐదుపదుల వయసు దగ్గరపడుతున్నా కూడా తన గ్లామర్‌తో చూపు తిప్పుకోనివ్వడు. నలుగురికి నచ్చింది ఆయనకు నచ్చదు. అందుకే టక్కరిదొంగలా అభిమానుల మనసు దోచేశాడు. నాన్న నుంచి నేర్చుకున్న పాఠాలతో ఒక్కడే తన జీవితానికి బంగారు బాటలు వేసుకున్నాడు. పేద చిన్నారులకు సాయం చేస్తూ వాళ్లింటి వాకిట్లో సిరిమల్లె చెట్టులా కనిపించాడు.  ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపించే మహేశ్‌ బాబు నేడు ఆగష్టు 9న తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..

మహేశ్.. 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించాడు. ఇతడు పుట్టే నాటికే తండ్రి కృష్ణ 100 సినిమాలకు పైగా పూర్తి చేసి, ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఆరేళ్ల వయసులో మహేశ్‌ తన అన్నయ్య అయిన రమేశ్‌తో కలిసి విజయవాడ వెళ్లారు. అప్పట్లో దాసరి దర్శకత్వంలో 'నీడ' సినిమా రమేశ్‌ చేస్తున్నారు. అందులో ఓ కీలక పాత్రని మహేశ్‌కి తెలియకుండానే ఆయనపై తీశారు దాసరి. అలా బాల నటుడిగా మహేశ్‌ తెరంగేట్రం ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. అప్పుడు మహేశ్‌ వయసు ఆరేళ్లు మాత్రమే.. తర్వాత నాన్న కృష్ణతో 'పోరాటం' సినిమాలో మహేశ్‌ నటించి, మెప్పించారు. అలా స్కూల్‌ హాలీడేస్‌ రాగానే షూటింగ్స్‌లో మహేశ్‌ పాల్గొనేవాడు. 

ఈ క్రమంలో బజార్‌ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం  వంటి సినిమాల్లో ఆయన నటించారు. తర్వాత మహేశ్‌ స్కూల్‌కు వెళ్లడం తగ్గించాడు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అనే భయంతో ఇకపై సినిమాలు వద్దని, బుద్ధిగా చదువుకోవాలని ప్రిన్స్‌కు కృష్ణ చెప్పడంతో మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాడు. అలా లయోలా డిగ్రీ కాలేజీలో  బీకామ్‌ వరకు చదువు పూర్తిచేసిన ప్రిన్స్‌ ఆపై మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్‌.. 'రాజకుమారుడు' సినిమాతో మహేశ్‌ను హీరోగా పరిచయం చేశారు.

 దైవం మహేశ్‌ రూపేణ
'దైవం మానుష రూపేణ'.. అంటే దైవం ఎక్కడో లేదు.. 'మనిషి' రూపంలో మన దగ్గరే ఉందని అర్థం. ఎలాంటి లాభేక్ష లేకుండా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేపిస్తూ వారికి మరో జన్మ కల్పిస్తున్నారు మహేశ్‌. చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు.  అలాంటి చిన్నపిల్లలకే పెద్ద సమస్య వస్తే.. వారిని కాపాడుకోవడానికి పేదరికం అడ్డొస్తే.. ఆ తల్లిదండ్రులు వేదన ఎలా ఉంటుందో ఊహించుకోలేం. ఆ బాధను గుర్తించిన మహేశ్‌ కష్టాల్లో ఉన్నవారికి దేవుడిలా సాయం చేయడంలో వెనకాడడు. అందుకే దైవం మహేశ్‌ రూపేణ అని ఆ తల్లిదండ్రులు అంటారు.  పలు సేవా కార్యక్రమాల కోసం మహేశ్‌ తన సంపాదనలో ఏడాదికి 30 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆ మొత్తం సుమారు రూ. 50 కోట్లకు పైమాటే ఉండొచ్చన అంచనా ఉంది.

చిన్నపిల్లలకు అండగా మహేశ్‌.. కారణం ఇదే
కుటుంబానికే మహేశ్‌ బాబు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మహేశ్‌కు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ విషయంలో బయటి వారి పిల్లలు అయినా సరే.. వారికి ఏదైనా కష్టం వస్తే చూస్తూ ఉండే వ్యక్తి కాదు. ఆ మంచి మనసే ఎన్నో చిట్టి ‘గుండె’లకు ప్రాణం పోసింది. ఈ క్రమంలో సుమారు 3వేల మంది చిన్నారుల గుండెకు సంబంధించిన ఆపరేషన్స్‌ను ఉచితంగానే చేపించాడు. అందుకు ప్రధాన కారణం కూడా ఉంది.  మహేశ్‌ తనయుడు గౌతమ్‌.. డెలివరీ సమయం  కంటే ఆరువారాలు ముందే పుట్టడంతో పలు సమస్యలు ఎదుర్కొన్నాడు. అందుకు అవసరమైన చికిత్సను మహేశ్ చేయించారు. 

దాదాపు మూడు నెలలకి గౌతమ్‌ మామూలయ్యాడు. ఆయన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటన నేడు ఎంతోమంది చిన్నారుల జీవితాలను కాపాడుతుంది. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి ఎంతైనా ఖర్చుపెట్టి పిల్లాడిని రక్షించుకున్నామని ఆయన తెలిపారు.  అదే లేనివాళ్లకి ఇలా జరిగితే వారి పరిస్థితి ఏంటీ..? అని మహేశ్‌ బాధపడేవారు. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో మహేశ్‌ పంచుకున్నారు. పుట్టుకతో వచ్చే ఆ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని నమ్రతతో కలిసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది వెంటనే ఆ నిర్ణయానికి నమ్రత రూపకల్పన చేశారు. 

మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ను స్థాపించి ఇప్పటి వరకు సుమారు 3వేల మందికి పైగానే కోట్ల రూపాయాలు ఖర్చు చేసి వారికి మరో జన్మనిచ్చాడు. అలాంటి పిల్లలకు హైదరాబాద్‌, విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నారు.

ఆ పుస్తకమే సిగరెట్‌ మాన్పించింది
మహేశ్‌కు తరచూ పుస్తకాలు చదువుతూ ఉంటారు.. ఆపై బాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు కూడా కాలక్షేపం కోసం చూస్తుంటారు. అయితే, ప్రతి దాని నుంచి కొంత స్ఫూర్తిపొందుతుంటారు. గతంలో మహేశ్‌ బాగా సిగరెట్‌ తాగే అలవాటు ఉండేదని దానిని మానేద్దామంటే కుదరలేదని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఎలెన్‌ కార్‌ రాసిన 'ది ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్‌' అనే పుస్తకం చదివాక సిగరెట్‌ని మాత్రం ముట్టుకోలేదని ఓ ఇంటర్వ్యూలో మహేశ్‌ చెప్పారు. తన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటానని కూడా ఆయన తెలిపారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చెక్కర పదార్థాలు తీసుకోనని ఆయన పేర్కొన్నారు.

టాలీవుడ్‌లో తిరుగులేని రికార్డ్స్‌
మహేశ్‌ ఇప్పటి వరకు పాన్‌ ఇండియా సినిమాల్లో నటించలేదు. ఆయన సినిమాలు కనీసం రెండు మూడు భాషల్లో కూడా విడుదల కాలేదు. కేవలం తెలుగులోనే విడుదలయ్యాయి. ఈ క్రమంలో కేవలం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లను తిరగేసి ఆయన రికార్డ్స్‌ను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా పాన్‌ ఇండియా చిత్రాల సరసన నిలబడ్డాయి. 

మహేశ్‌ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ తెలుగులోనే విడుదలై  రూ. 214 కోట్ల వసూళ్లను సాధించింది. సరిలేరు నీకెవ్వరు రూ. 260 కోట్లు, మహర్షి రూ. 170 కోట్లు, గుంటూరు కారం రూ. 200 కోట్లు, భరత్‌ అనే నేను రూ. 187 కోట్లు రాబట్టింది. ఒక్క భాషలోనే విడుదల అయితేనే ఇలాంటి కలెక్షన్లతో  సత్తా చాటితే అదే పాన్‌ ఇండియా రేంజ్‌లో బొమ్మ పడితే ఎలా ఉంటుందో ఊహకే వదలేయ వచ్చు అని చెప్పవచ్చు.

ఈ ప్రత్యేకతలే మహేశ్‌ను అభిమానించేలా చేస్తాయి

  • మొదటి సినిమా రాజకుమారుడుతోనే  ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డ్‌ను అందుకున్నారు.

  • ఉత్తమ నటుడిగా నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు చిత్రాలకు   నంది పురస్కారాలు గెలుచుకున్నారు.

  • వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వారి మైనపు విగ్రహాలు 'మేడమ్‌ టుస్సాడ్స్‌'లో కొలువుదీరుతాయనే విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న వారి జాబితాలో మహేశ్‌ ఒకరు.

  • సుమారు 25 ఏళ్లుగా సినీ పరిశ్రమలో మహేశ్‌ ఉన్నారు. ఇన్నేళ్లలో ఆయన ఒక్క రీమేక్‌ చిత్రంలోనూ నటించకపోవడం రికార్డ్‌.

  • గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌ను మహేశ్‌ పరిచయం చేశారు. 'శ్రీమంతుడు'ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు.

  • మోపిదేవి పెదప్రోలులో కాకర్లపూడి రాజేష్ అని అభిమాని పిల్లలను దత్తత తీసుకున్న మహేశ్‌.. వారి పేర్లు కూడా అర్జున్, అతిథి,  ఆగడు ఇలా మహేశ్‌ సినిమా పేర్లనే ఆ అభిమాని పెట్టుకోవడం విశేషం.

  • మహేశ్‌ బాబుకు వచ్చే సంపాదనలో 30 శాతం డొనేషన్స్‌కే ఉపయోగిస్తారు .

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement