Mammootty Completes 50 Years In Cinema: మమ్మూట్టీ.. ఇండియన్ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా సౌత్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాలీవుడ్ మెగాస్టార్‌గా వెలుగొందుతున్న ఆయన.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలైన ముహమ్మద్ కుట్టీ పనపరంబిల్ ఇస్మాయిల్ నటనా పరంపర.. ఇవాళ అభిమానులతో ఆప్యాయంగా ‘మమ్ముక్క’ అని పిలిపించుకునేంత స్థాయికి ఎదిగింది.
సాక్షి, వెబ్‌డెస్క్: మిడిల్ క్లాస్ ముస్లిం కుటుంబంలో పుట్టిన మమ్మూట్టీ.. ఎర్నాకులం లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించాడు. ఆపై రెండేళ్లపాటు మంజేరీలో లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేశాడు. అనుభవంగళ్ పాలిచకల్(1971)లో గుంపులో గోవిందుడిగా కనిపించాడు పనపరంబిల్ ఇస్మాయిల్. ఆపై నటనపై ఆసక్తితో సినిమా, నాటకాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించాడు. 1979లో దేవలోకం సినిమాతో లీడ్ రోల్ పోషించాడు. కానీ, ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది. విక్కనుండు స్వప్నంగల్(1980) ద్వారా సాజిన్ పేరుతో మాలీవుడ్ ప్రేక్షకులను తొలిసారి పలకరించాడు. అదే ఏడాది వచ్చిన ‘మేళా’ ఆయనకి హీరోగా తొలి గుర్తింపు ఇచ్చింది.
ఆల్ జానర్ల ఆర్టిస్ట్
ఎనభై దశకం మొదట్లో సాజిన్ పేరుతోనే కొన్నాళ్లపాటు నటనా ప్రస్థానం నడిచింది. ‘అహింసా’ సినిమాకు గాను కేరళ స్టేట్ తొలి అవార్డు(సపోర్టింగ్ రోల్) అందుకున్నాడు. ఓవైపు మాస్ క్యారెక్టర్లతో పాటు మరోవైపు ఎక్కువగా భర్త-తండ్రి పాత్రలతో అలరించాడాయన అందుకే ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అంటూ ప్రాసను వాడేవాళ్లు ఆయన మీద. అలాంటి టైంలో ‘న్యూఢిల్లీ’, ‘తనియావర్తనం’ ఆయనలోని సీరియస్ నటనా కోణాల్ని ఆవిష్కరించాయి.
ఆపై చాలాకాలం వరుసగా అలాంటి సినిమాలే ఆయనకు దక్కాయి. 1984-93, 1994-2000, 2000-2010.. ఈ మధ్యకాలాల్లో మాస్-క్లాస్-ప్రయోగాత్మక కథలతో.. అప్ అండ్ డౌన్స్‌తో, మధ్య మధ్యలో భారీ బ్లాక్‌బస్టర్లతో మమ్మూటీ సినీ ప్రయాణం కొనసాగింది. ఎక్కువగా ఊరమాస్ క్యారెక్టర్లతో అలరించడం వల్లే మెగాస్టార్‌గా ముద్రపడిపోయాడు ఆయన.
క్రిటికల్ నటుడు
మమ్మూటీ మలయాళం పరిశ్రమకు మాస్ ఇంట్రోలు-యాక్షన్ అందించే మెగాస్టార్ కావొచ్చేమో.. కానీ, సౌత్‌కు మాత్రం ఆయనొక టిపికల్ నటుడు. సంగం, ఉత్తరం, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కథోడు కథోరం, పొంథన్ మడ, కౌరవర్, ప్రణామం, అయ్యర్ ది గ్రేట్, ముద్ర, ది కింగ్.. ఇలా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పాత సినిమాల సంగతి సరేసరి. పెరంబూ, ఉండా లాంటి కొన్ని రీసెంట్ చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని అన్ని భాషలకు చూపెట్టాయి. ఇక జబ్బర్ పటేల్ డైరెక్షన్‌లో వచ్చిన బాబా సాహెబ్ అంబేద్కర్‌కుగానూ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. ‘సామ్రాజ్యం’ లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
ఆరు భాషల్లో..
69 ఏళ్ల మమ్మూటీ ఇప్పటిదాకా 400పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఒక మెయిన్ లీడ్ హీరో మిగతా భాషల్లోనూ నటించడం అప్పటికే నడుస్తోంది. అలా మమ్మూటీ కూడా ఆరు భాషల్లో నటించారు. మాలీవుడ్‌తో పాటు మౌనం సమ్మదం(తమిళం)..దళపతి లాంటి సినిమాలు, స్వాతి కిరణం, త్రియాత్రి(హిందీ), షికారి(కన్నడ), డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(ఇంగ్లీష్) నటించారు. అంతేకాదు ఐదు సినిమాలకుగానూ మూడు నేషనల్ అవార్డులు అందుకున్న అరుదైన రికార్డు మమ్ముక్క సొంతం. ఒరు వడక్కన్(1989) వీరగాథకు ఫస్ట్ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. అలాగే ఏడు స్టేట్ అవార్డులు దక్కాయి కూడా. తెలుగులో స్వాతి కిరణం, సూర్య పుత్రులు(1996), రైల్వే కూలీ(రిలీజ్‌కు నోచుకోలేదు).. ఆపై రెండు దశాబ్దాల తర్వాత వైఎస్సార్ బయోపిక్‘యాత్ర’లో నటించి.. మెప్పించాడు మమ్మూట్టీ.
4 ఇయర్స్.. 120 ఫిల్మ్స్
జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలైన మమ్మూటీ.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా-విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌తో ఆపై లీడ్ రోల్స్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఒకానొక టైంలో ఆయన ఎంత బిజీ అయ్యారంటే.. 1983 నుంచి 1986 మధ్య నాలుగేళ్ల కాలంలో ఏడాదికి 30కి పైగా సినిమాల చొప్పున ఏకంగా 120 సినిమాల్లో నటించారాయన. అంతేకాదు మలయాళంలో 15సార్లు డ్యుయెల్‌రోల్స్ వేసిన ఘనత కూడా ఆయన ఖాతాలో ఉంది.
నిర్మాతగా కూడా..
నటుడే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. మెగాబైట్స్, ప్లే హౌజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్, టెక్నోటెయిన్‌మెంట్ పేరుతో డిసస్టట్రిబ్యూషన్ కంపెనీ నడిపించారు కూడా. ఆయనలో రాతగాడు కూడా ఉన్నాడు. కాల్చప్పుడు పేరుతో ఓ పేపర్‌లో తన అనుభవాలను పంచుకోవడంతో పాటు సందర్భానికి తగ్గటుగా సోషల్ మీడియాలో వేదాంత ధోరణిలో కొటేషన్లు కూడా రాస్తుంటాడు. ఆయనలో మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అందుకే కేరళ వాలీబాల్ లీగ్‌కు అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడు.
ఫ్రెండ్లీ స్టార్
సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోల మధ్య పోటీతత్వం.. అలాగే వాళ్ల అభిమానుల మధ్య వైరం కనిపిస్తుంటుంది. కానీ, మెగాస్టార్‌గా పేరున్న మమ్మూటీ.. మాలీవుడ్‌లో సీనియర్-జూనియర్లతోనూ స్నేహం కొనసాగిస్తుంటాడు. మధ్య మధ్యలో వాళ్ల సినిమాల్లో, మాలీవుడ్ చేపట్టే ఛారిటీ కార్యక్రమాల్లోనూ సహ నటులతో మెరుస్తుంటాడు. 2005-10 మధ్య మమ్మూట్టీ-మోహన్‌లాల్-దిలీప్.. ఈ త్రయం 97 శాతం మాలీవుడ్ ఫిల్మ్ రెవెన్యూను రాబట్టగా.. అందులో మేజర్ షేర్ మమ్మూట్టీదే కావడం విశేషం. ఇక మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కొనసాగించే స్నేహం చాలామంది హీరోలకు ఒక మంచి పాఠం కూడా.
Today, my brother completes 50 glorious years in the film industry. I feel so proud to have shared the screen with him in 55 memorable films and looking forward to many more. Congratulations Ichakka! @mammukka pic.twitter.com/UevUpSkSGH
— Mohanlal (@Mohanlal) August 6, 2021
Comments
Please login to add a commentAdd a comment