ఎన్టీఆర్‌ని వెండితెరకు తెచ్చిన 'కృష్ణవేణి' ఎవరో తెలుసా..? | Mana Desam Movie Producer And Senior Actress C Krishnaveni Born On 24th December 1924, Know Facts About Them - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ని వెండితెరకు పరిచయం చేసిన కృష్ణవేణి గురించి తెలుసా..?

Published Sun, Dec 24 2023 4:24 AM | Last Updated on Sun, Dec 24 2023 10:24 AM

Mana Desam Movie Producer and Senior Actress C Krishnaveni was born on 24th December 1924 - Sakshi

మణిలాంటి నటి... మణిలాంటి గాయని... మణిలాంటి నిర్మాత... కృష్ణవేణి చిత్రసీమకు ఒక అమ్యూలమైన మణి. మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబర్చారు. మంచి గాయనీమణిగా తన గాత్రాన్ని వినిపించారు. ‘మన దేశం’ వంటి చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. నేడు నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు సి. కృష్ణవేణి.  ఈ సందర్భంగా కృష్ణ‘మణి’ జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న జన్మించారు కృష్ణవేణి. తండ్రి యర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్‌. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి. ఆ తర్వాత వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించారు.

ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్లినప్పుడు ఆయన ‘తులాభారం’ నాటకం చూశారు. అందులో కృష్ణవేణి నటన నచ్చి, సినిమాలో నటించమని అడి గారు. అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి.

ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1973) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో 

నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్‌ జయా పిక్చర్స్‌–శోభనాచల స్టూడియోస్‌ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్‌గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్‌ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. నటిగా ఆమెకు ‘గొల్లభామ,

లక్ష్మమ్మ’ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. ‘కచదేవయాని, గొల్లభామ, అనసూయ’ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి. ‘తిరుగుబాటు’ సినిమాలో ఆమె చేసిన వ్యాంప్‌ క్యారెక్టర్‌పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనూరాధ జన్మించడం.. భర్త రాజా సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి.

కుమార్తె పేరుపై  ‘ఎంఆర్‌ఏ’ప్రోడక్షన్‌ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో ‘మన దేశం’ (1949) సినిమా తీసి, విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవేణి. కాగా ‘వరూధుని’ సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావుని పిలిపించి, ‘మన దేశం’లో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు.

ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గానూ తన ప్రత్యేకత చాటుకున్నారామె. ‘ధర్మాంగద’కి రూ. నలభై ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన ‘గుడ్‌ ఈవెనింగ్, లేడీ డాక్టర్‌’ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, ‘కుమ్మరి మొల్ల’ వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు కృష్ణవేణి. ఆమె హీరోయిన్‌గా నటించిన ఆఖరి చిత్రం ‘సావాసం’ (1952).

మహారాష్ట్ర గవర్నర్‌గా చేసిన కోన ప్రభాకరరావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి నిర్మించిన చిత్రాల్లో ‘భక్త ప్రహ్లాద’ (1942) ఒకటి. నిర్మాతగా 1957లో విడుదలైన ‘దాంపత్యం’ కృష్ణవేణి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. గత ఏడాది ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు కృష్ణవేణి.  

తల్లి బాటలో కుమార్తె
కృష్ణవేణి బాటలో ఆమె కుమార్తె ఎన్‌ఆర్‌ అనురాధా దేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి, లక్ష్మి ఫిలింస్‌ కంబైన్స్‌పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం ‘భక్త కుంబారా’ (1974)ని నిర్మించారు. ఇందులో రాజ్‌కుమార్‌ హీరో. తెలుగులో అనురాధ నిర్మించిన తొలి చిత్రం ‘చక్రధారి’ (1977). అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది.

నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ. ఆమె నిర్మించిన చివరి చిత్రం ‘మా పెళ్లికి రండి’ (2000). జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధా దేవి 2001లో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. - అనురాధా దేవి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement