టైటిల్: ఆదిపర్వం
నటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులు
రచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటి
నిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్
సంగీతం: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)
సినిమాటోగ్రఫీ - ఎస్ ఎన్ హరీశ్
ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటి
విడుదల తేది: నవంబర్ 8, 2024
కథేంటంటే..
ఈ సినిమా కథ 1974-90 మధ్యకాలంలో జరుగుతుంది.రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే నాగమ్మ(మంచు లక్ష్మి) ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా ఆ గుప్త నిధులను దక్కించుకోవాలనుకుంటాడు. గుప్త నిధుల కోసం వీరిద్దరు చేసిన అరాచకాలు ఏంటి? రాయప్ప తన కూతురుని ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెనే ఎందుకు చంపాలనుకుంది? బుజ్జమ్మ-శ్రీనుల ప్రేమ కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
అమ్మవారి గుడిలో గుప్త నిధులు.. వాటిని సొంతం చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించడం.. దైవ శక్తి-దుష్ట శక్తుల మధ్య పోరాటం..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఆదిపర్వం’సినిమా కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే. అప్పట్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్‌ను మిక్స్ చేసి తెరకెక్కించారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలో అమ్మవారి ఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాసకు ప్రాధాన్యత ఇచ్చారు.ఒక పీరియాడిక్ కథని ఫాంటసీతో మేళవించి రాయలసీమ నేపథ్యంలో చక్కగా చూపించారు. ఆలయాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఈ చిత్రం ఆధ్యాత్మికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగా కుదిరింది. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌తో పాటు కథనం కూడా రొటీన్‌గాన సాగడంతో పాత మూవీ చూసిన ఫీలింగే కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే..
మంచు లక్ష్మి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. కొన్ని సీన్లలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ ("చంటిగాడు" ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఈవెనింగ్ సినిమాలో హీరో, హీరోయిన్ అనే ప్రత్యేక పాత్రలు లేకుండా, ప్రతి పాత్ర కూడా కథలో భాగంగా ఉంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. తక్కువ బడ్జెట్ మూవీయే అయినా గ్రాఫిక్స్ బాగా కుదిరింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment