నరేశ్, మోహన్‌బాబు, విష్ణు
‘‘ఇది ఏ ఒక్కరి విజయం కాదు. ‘మా’లోని సభ్యులందరి విజయం. అందరూ మనవాళ్లే. అందరి ఆశీస్సులు ఉన్నాయి. నా బిడ్డ(మంచు విష్ణు), అతని జట్టు సభ్యులు గెలిచారు. ఇది ఆనందం అనుకుంటే కరెక్ట్ కాదు. భయంకరమైన ప్రామిస్‌లు చేసేశారు. వాటన్నింటినీ నా బిడ్డ వందశాతం సాధిస్తాడు. నా బిడ్డ చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే... జరిగింది... జరిగిపోయింది.. అందరం కళామతల్లి బిడ్డలం అని గుర్తుపెట్టుకోవాలి.
నటుడిగా నాకు జన్మనిచ్చిన దాసరిగారు ఎక్కడ ఉన్నారో!. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ ఎలక్షన్స్ జరగకుండా ఏకగ్రీవంగా జరిగేలా పెద్దలు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టండి. ఆ ప్యానల్ వారు కావొచ్చు.. ఈ ప్యానల్ వారు కావొచ్చు.. నా సోదరులు, నా ఆడపడుచులు.. ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా మీడియా ముందుకు వెళ్లవద్దని కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీస్సులతో పాటు రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు నా బిడ్డకు, అతని జట్టు సభ్యులకు ఉండాలి. వారు అనుకున్నది విజయవంతం అవుతుంది. నా తమ్ముడు నరేశ్ చాలా కష్టపడ్డారు. ఎలక్షన్ అధికారికి, సహకరించిన కొందరు ‘మా’ సభ్యులకు ధన్యవాదాలు. ఇది అందరి విజయం.
కృష్ణ, కృష్ణంరాజు, నా సోదరుడు బాలయ్య, నా ఆత్మీయుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్.. ఇలా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలని కోరుకుంటున్నాను. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అని మోహన్‌బాబు అన్నారు. దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు వైస్‌ప్రెసిడెంట్స్, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్‌లతో పాటు 18 మంది ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులతో కూడిన 26 మంది ‘మా’ (2021– 2023) ప్యానల్ సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. విజేతలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకటించారు. ‘‘925 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో 883 ఓటర్లు ఉండగా 665 మంది ఓట్లు వేశారు (52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు). ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు. సమయాభావం వల్ల మిగతా వివరాలను సోమవారం అధికారికంగా వెల్లడిస్తాం’’ అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అన్నారు.
‘మనమంతా ఒకటే కుటుంబం. ప్రకాశ్‌రాజ్‌గారు అంటే నాకు చాలా ఇష్టం. నరేశ్‌గారికి, సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఆ ప్యానల్, ఈ ప్యానల్ అంటూ లేదు. మేం అందరం ఒకటే కుటుంబం. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగింది. ‘మా’ లో ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడూ జరగకూడదు’’ అని అన్నారు మంచు విష్ణు. ‘‘తెలుగు బిడ్డ గెలిచాడు. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ‘‘నేను వెళ్లేటప్పుడు మంచి వారసుడిని ఇచ్చి వెళతాను అని చెప్పాను. మంచు విష్ణు రూపంలో మంచి వారసుడు వచ్చాడు. ‘మా’ మసకబారలేదు.. మెరుగుపడింది’’ అన్నారు నరేశ్. ఇదిలా ఉంటే... మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు ఇటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ గెలుపొందారని తెలిసింది. అలాగే ఈసీ మెంబర్స్‌గా ప్రగతి, పూజిత, శశాంక్, జయవాణి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ, మాణిక్, హరినాథ్‌బాబు, బొప్పన విష్ణు, శ్రీనివాసులు, సంపూర్ణేష్ బాబు, శివారెడ్డి, కౌశిక్, అనసూయ, సురేశ్ కొండేటి, బ్రహ్మాజీ, ఖయ్యుం గెలిచారనే వార్త బయటికొచ్చింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రికార్డు పోలింగ్
‘మా’ ఎలక్షన్స్‌లో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు పోలింగ్ నమోదు అయ్యింది. గత ‘మా’ ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే నమోదు కాగా, ఈ సారి 665 (883 ఓట్లకు గాను..70 శాతానికి పైగా) ఓట్లు పోల్ అయ్యాయి. పోలైన ఓట్లలో 52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. అయితే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉన్నప్పటికీ రెండు ప్యానల్స్ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పోలింగ్ సమయాన్ని మరో గంట పొడగించారు. ఎప్పుడూ లేనట్లుగా ‘మా’లో భాగమైన సభ్యులు ఇతర రాష్ట్రాల (ముంబై, చెన్నై, కర్ణాటక) నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయాన్ని పొడగించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ‘మా’ సభ్యులు కూడా ఉత్సాహంగా ‘మా’ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి కారణాలు పోలింగ్ శాతం పెరగడానికి కారణం
అయ్యాయని చెప్పుకోవచ్చు.
ఫైటింగ్.. బైటింగ్.. బెట్టింగ్!
‘మా’ ఎన్నికల పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌కల్యాణ్ వంటి స్టార్స్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌లో హడావిడి చేస్తున్న ఓ అజ్ఞాతవ్యక్తిని నటుడు వీకే నరేశ్ పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు ప్యానల్ సభ్యుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగి, కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఇరువర్గాల అభ్యర్థులు ఆరోపించారు. అలాగే పోలింగ్ కేంద్రంలో తమ ప్యానల్స్ తరఫున ప్రచారం చేసే ప్రక్రియలో భాగంగా శివబాలాజీ, సమీర్‌లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో శివబాలాజీ చేతిని నటి హేమ కొరకడం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆ తర్వాత శివబాలాజీ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. మరోవైపు ‘మా’ ఎన్నికల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కొందరు బెట్టింగ్‌రాయుళ్లు ‘మా’ ఎన్నికల జయాపజయాలపై బెట్టిం గ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఫైటింగ్.. బైటింగ్.. బెట్టింగ్ నడుమ ఎన్నికలు జరిగాయి.
ఓటుకు దూరం
కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికల గురించి హీట్ నడుస్తున్నప్పటికీ కొందరు ప్రముఖ నటీనటులు ఎన్నికల్లో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేశ్, రానా, మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, నిహారిక, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సుమంత్, సుశాంత్ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిసింది. ఇంకా మహేశ్‌బాబు (స్పెయిన్‌లో ‘సర్కారు వారిపాట’ షూటింగ్‌లో ఉన్నారు) ప్రభాస్, ఎన్టీఆర్, నితిన్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ముంబయ్ నుంచి జెనీలియా, ఢిల్లీ నుంచి జయప్రద హైదరాబాద్‌కు వచ్చి ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయడం విశేషం.
చెల్లని ఓట్లు
ఈసీ మెంబర్స్ కోసం పోలైన 665 ఓట్లలో 44 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. అయితే ‘మా’ సభ్యులకు పోలింగ్‌పై అవగాహన లేకపోవడం వల్ల చెల్లని ఓట్లు నమోదయ్యాయా? లేక సభ్యులకు ఇష్టం లేక చెల్లని విధంగా ఓట్లు వేశారా? అన్న చర్చలు జరుగుతున్నాయి.
ప్రత్యర్థుల ఆలింగనం
‘మా’ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ మధ్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆదివారం ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా పోలింగ్ కేంద్రం నుంచి ప్రకాశ్‌రాజ్‌తో తాను ఉన్న ఫోటోను షేర్ చేశారు మంచు విష్ణు. ఈ ఫోటో, ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నటుడు, నిర్మాత నాగబాబు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారాయన. ‘‘ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక అసోసియేషన్లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు. నా రాజీనామాను 48 గంటల్లో ‘మా’ కి నా సిబ్బంది ద్వారా పంపిస్తాను. ఇది నేను ఎంతగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం’’ అని ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు నాగబాబు.
‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, ఇతర విజేతలందరికీ పేరు పేరునా అభినందనలు.. నా శుభాకాంక్షలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. ‘మా’ ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచనట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment