అందుకే నా మార్కెట్‌ని మించి ఖర్చుపెట్టాను | Manchu Vishnu Mosagallu Trailer Launched By Chiranjeevi | Sakshi
Sakshi News home page

అందుకే నా మార్కెట్‌ని మించి ఖర్చుపెట్టాను

Published Fri, Feb 26 2021 4:08 AM | Last Updated on Fri, Feb 26 2021 5:19 AM

Manchu Vishnu Mosagallu Trailer Launched By Chiranjeevi - Sakshi

‘‘నా కెరీర్‌లో పెద్ద బడ్జెట్‌ సినిమా ‘మోసగాళ్ళు’. నా మార్కెట్‌ అంత లేదు. కానీ సినిమాపై నమ్మకంతో నా మార్కెట్‌ని మించి ఖర్చు పెట్టా. ఏ సినిమా అయినా నిర్మాతకి రిస్కే. కాకపోతే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రిస్క్‌ తీసుకుంటామని ముందుకెళ్లా’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీ చిన్‌  దర్శకత్వంలో మంచు విష్ణు నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. హీరోయిన్‌  కాజల్‌ అగర్వాల్, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు.

ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ‘మోసగాళ్ళు’ చిత్రం ట్రైలర్‌ని హీరో చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే ట్రైలర్‌ని రిలీజ్‌ చేసిన చిరంజీవిగారికి, వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన వెంకటేష్‌గారికి ధన్యవాదాలు. 2015 నుంచి 2017 వరకూ ఓ అక్క, తమ్ముడు కలసి ముంబయ్, గుజరాత్‌లలో ఉండి ఒక సింపుల్‌ ఐడియాతో అమెరికా డబ్బుని 4వేల కోట్ల స్కామ్‌ చేశారు. అమెరికాలో జరిగిన ఈ స్కామ్‌ని ఎందుకు సినిమాగా చేయకూడదనిపించింది? ‘మోసగాళ్ళు’ కథని అమెరికాలో ఉండి మూడేళ్లు డెవలప్‌ చేశాం. హాలీవుడ్‌కి ధీటుగా జెఫ్రీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంలో నా అక్క పాత్ర చేయమని ప్రీతీ జింతాని అడిగితే, ఈ పాత్ర చేస్తే బయట తనకు ఇబ్బందులు వస్తాయని చేయనన్నారు. ఆ తర్వాత కాజల్‌కి కథ చెప్పగానే ఎంతో స్పోర్టివ్‌గా తీసుకొని చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో హీరో నేను కాదు.. కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు. సునీల్‌ శెట్టిగారి పాత్రని నేను చేయాల్సింది, కానీ కుదరలేదు. ‘మోసగాళ్ళు’ చూసిన నాన్నగారు (మోహన్‌ బాబు), డైరెక్టర్‌ శ్రీను వైట్లగారు ‘నువ్వేంటి విలన్‌ గా చేశావ్‌?’ అన్నారు. మా అమ్మ (నిర్మల) మాత్రం బాగా చేశావన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేరోజు, వేర్వేరు టైటిల్స్‌లో మా సినిమా విడుదలవుతుంది.. ఎప్పుడు రిలీజ్‌ చేస్తామన్నది మరో వారంలో ప్రకటిస్తాం. ‘భక్త కన్నప్ప’ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. అది స్టార్ట్‌ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement