టైటిల్: మంగళవారం
నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
దర్శకత్వం:అజయ్ భూపతి
సంగీతం: అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి
ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి
విడుదల తేది: నవంబర్ 17, 2023
‘మంగళవారం’కథేంటంటే..
ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు.
మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్‌ర రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్‌లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే.
ఎలా ఉందంటే..
హారర్ టచ్‌తో సాగే రివేంజ్ డ్రామా థ్రిల్లర్ చిత్రమిది. దాంతో పాటు మహిళలకు సంబంధించి ఓ మంచి సందేశాన్ని కూడా అందించారు. అయితే ఆ సందేశాన్ని ఇచ్చేందుకు దర్శకుడు అల్లుకున్న కథ చాలా కొత్తగా ఉన్నా.. ప్రేక్షకులు చూసే కోణాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎందుకంటే.. ఈ కథలో దర్శకుడు అజయ్ భూపతి చాలా సెన్సిటివ్ అయిన ‘హైపర్ సెక్స్ డిజార్డర్’ అనే మానసిక, లైంగిక రుగ్మత, వివాహేతర సంబంధాల గురించి చర్చించారు. అలా అని ఇది మెసేజ్ ఓరియెంటెంట్ ఫిల్మ్‌గా సాగదు. కథ ప్రారంభం నుంచే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సినిమా ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇంటర్వెల్ వరకు మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండదు.. అసలు కథ ప్రారంభం కాదు కానీ.. ఎక్కడ బోర్ కొట్టదు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు అజయ్ భూపతి.
శైలు చిన్ననాటి ఎపిసోడ్‌తో కథ ప్రారంభం అవుతుంది. తల్లి చనిపోవడం..తండ్రి మరోపెళ్లి చేసుకోవడం..అమ్మమ్మ దగ్గరే శైలు పెరగడం.. ఇలా మొదటి నుంచే హీరోయిన్ క్యారెక్టర్‌పై సానుభూతి కలిగించేలా కథను మలిచాడు దర్శకుడు. శైలు, రవిల చిన్ననాటి ప్రేమ కథను కాసేపు చూపించి..ఆ తర్వాత వెంటనే స్టోరీని పదేళ్ల ముందుకు అంటే 1996కు తీసుకెళ్లాడు.
అక్కడ వరుస మరణాలు.. గోడపై ఆక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పేర్లు రాయడం.. మరుసటి రోజే వాళ్లు శవాలై కనిపించడం.. ఇలా ప్రతి మంగళవారం జరగడం.. దాని వెనుక ఉన్నదెవరని ఎస్సై మాయ చేపట్టే విచారణ.. అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు ఊరి ప్రజలు రంగంలోకి దిగడం.. ఇలా చాలా ఉత్కంఠభరితంగా కథనం సాగుతుంది. హీరో హీరోయిన్లు పాత్రలు లేకుండానే ఫస్టాఫ్‌ను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ ముందు శైలు పాత్రకు ఇచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
శైలు లవ్‌స్టోరీ ఎపిసోడ్‌తో చాలా ఎమోషనల్‌గా ద్వితియార్థం ప్రారంభం అవుతుంది. తెరపై శైలు పాత్ర బోల్డ్‌గా చూపిస్తూనే. ఆమెపై సానుభూతి కలించేలా చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. అలా చేయడం చాలా కష్టమైన పని.. కొంచెం తేడా కొట్టినా.. ఫలితమే మారిపోతుంది. కానీ అజయ్ మాత్రం బలమైన స్క్రిప్ట్‌తో ఈ సాహసం చేసి విజయం సాధించాడు. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం.. బలమైన పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం కాస్త మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే..
ఆర్‌ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ చాలా సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. చాలా సినిమాల్లో ఆమెను గ్లామర్ గాళ్‌గానే చూపించారు. కానీ మంగళవారం చిత్రంతో ఆమెలోని మరో యాంగిల్‌ని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసింది. శైలు పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. గ్లామర్‌తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఇక ఎస్సై మాయగా నందిని శ్వేత మరో డిఫరెంట్ రోల్ ప్లే చేసి మెప్పించింది. అయితే నటనకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు ఆమెది.
అజయ్ ఘోష్, లక్ష్మణ్ పాత్రలు పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. వారిద్ధరి మధ్య సంబాషణలు నవ్వులు పూయిస్తాయి. శైలు చిన్ననాటి ప్రియుడు, మాస్క్ ధరించిన వ్యక్తి( ఈ నటుడి ఎవరనేది తెరపై చూస్తేనే థ్రిలింగ్‌గా ఉంటుంది) కూడా అద్భుతంగా నటించాడు. ఆర్‌ఎంపీ డాక్టర్‌గా రవీంద్ర విజయ్, జమిందారుగా చైతన్య కృష్ణ, అతని భార్యగా దివ్యా పిళ్ళైతో పాటు శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అజనీష్ లోకనాథ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొత్త లుక్‌ని అదించింది. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment