ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఎమర్జన్సీ చిత్రానికి ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషిర్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీకి సిక్కు కమ్యూనిటీ ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ మూవీ రిలీజ్‌ను అడ్డుకోవద్దని వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాపై కొందరు కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ చంపింది నిజం కాదా? అని వారిని ప్రశ్నించారు. ఇందిరాగాంధీని చంపింది సిక్కులు కాదా? అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బ్లూ స్టార్ ఆపరేషన్ సమయంలో మరణించిన ఖలిస్తాన్ ఉద్యమ నాయకులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే గురించి రచయిత ప్రస్తావించారు. ఈ చిత్రంలో జర్నైల్ సింగ్‌ను ఉగ్రవాదిలా చూపిస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన అతను ఉగ్రవాది కాదా? అని ముంతశిర్ ప్రశ్నించారు. దయచేసిన భింద్రావాలేను హీరోగా గుర్తించవద్దని సిక్కు సమాజాన్ని కోరాడు.
ఎమర్జన్సీ కంటెంట్‌పై అభ్యంతరం చెప్పే ముందు సినిమాను చూడమని వారిని కోరారు. ధైర్యమైన సిక్కు సమాజం సినిమా విడుదలకు భయపడుతుందని తాను నమ్మడం లేదన్నారు. వారు భారతదేశాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు.. అలాంటి ధైర్యం కలిగిన వారు కేవలం సినిమాకే భయపడుతారంటే ఎవరు నమ్ముతారని మనోజ్ అన్నారు. కాగా.. ఎమర్జన్సీ మూవీ రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ సెన్సార్ బోర్డుపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని హితవు పలికారు. ఇది పూర్తిగా భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్ర హక్కును హరించడమేనని తెలిపారు. సినిమాపై నిరసనలు తెలిపే వారు.. ముందుగా థియేటర్లలో విడుదలై చూసిన తర్వాత.. అందులో తప్పులుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.
కాగా.. కంగనా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, దివంగత సతీష్ కౌశిక్ కూడా నటించారు. అయితే ఈ మూవీపై ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కంగనా రనౌత్‌కు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment