‘మరో ప్రస్థానం’ మూవీ రివ్యూ | Maro Prasthanam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Maro Prasthanam Review: ‘మరో ప్రస్థానం’ మూవీ రివ్యూ

Published Thu, Sep 23 2021 10:39 PM | Last Updated on Thu, Sep 23 2021 10:58 PM

Maro Prasthanam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : మరో ప్రస్థానం
నటీనటులు : తనీష్‌, ముస్కాన్ సేథీ , భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ: మిర్త్ మీడియా
నిర్మాతలు :  ఉదయ్ కిరణ్
దర్శకత్వం:  జాని 
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ :ఎంఎన్ బాల్ రెడ్డి 
ఎడిటింగ్‌: క్రాంతి (ఆర్కే),
విడుదల తేది : సెప్టెంబర్‌ 24, 2021

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ‘నచ్చావులే’తో హీరోగా మారాడు తనీష్‌. ఆ తర్వాత రైడ్‌, ‘మౌనరాగం’, ’ఏం పిల్లో ఏం పిల్లడో’ లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కెరీర్‌ పరంగా తనీష్‌ చాలా వెనుకబడ్డారు. ఆయన చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకున్న తనీష్‌.. చాలా కాలం తర్వాత ‘మరో ప్రస్థానం’తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం, సినిమా ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మరో ప్రస్థానం’పై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమా తనీష్‌ను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం


కథేంటంటే
ముంబై క్రిమినల్ గ్యాంగ్ లో సభ్యుడు శివ (తనీష్). గ్యాంగ్ రాణేభాయ్‌( కబీర్ సింగ్ దుహాన్ )  ఈ గ్యాంగ్ లీడర్. ఆ గ్యాంగ్ నేరాల్లో తనూ భాగమవుతూ నేరమయ జీవితం గడుపుతుంటాడు శివ. ఇలా హత్యలు, కిడ్నాప్‌లంటూ తిరిగే శివ.. నైని (అర్చనా ఖన్నా) అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. తన క్రిమినల్ జీవితానికి, నైని సరదా లైఫ్ కు సంబంధం లేదు. ఈ తేడానే శివను నైని ప్రేమలో పడేలా చేస్తుంది. నైనిని పెళ్లి చేసుకుని క్రిమినల్ లైఫ్ వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాలని అనకుంటాడు శివ. గోవాలో కొత్త ఇంటిలోకి మారాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. శివ ఇలాంటి ప్రయత్నాల్లో ఉండగా..రాణె భాయ్ గ్యాంగ్ సీక్రెట్స్ ఎవరో లీక్ చేస్తుంటారు. ఆ బ్లాక్ షీప్ ఎవరో కనుక్కునేందుకు రాణె భాయ్ అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపేస్తుంటాడు. జర్నలిస్ట్ సమీర (భాను శ్రీ మెహ్రా) రాణె భాయ్ నేరాలను ఆధారాలతో సహా డాక్యుమెంట్ చేస్తుంది. ఆమెను కిడ్నాప్ చేసిన రాణె భాయ్ గ్యాంగ్, ఆధారాలు ఇచ్చేయమని హింసిస్తుంటారు. రాణె భాయ్ గ్యాంగ్ లోని బ్లాక్ షీప్ ఎవరు, జర్నలిస్ట్ సమీర ఆధారాలతో గ్యాంగ్ ను పట్టించిందా. తన లీడర్ రాణె భాయ్ తో శివ ఎందుకు గొడవపడ్డాడు అనేది మిగిలిన కథ.

ఎలా చేశారంటే..
శివ పాత్రలో తనీష్ నటన మెప్పిస్తుంది. ఎమోషనల్ కిల్లర్ క్యారెక్టర్ కు తనీష్ తన నటనతో న్యాయం చేశాడు. ఇక హీరోని ఇష్టపడే సరదా అమ్మాయిగా ముస్కాన్ సేథి తనదైన నటన, అందంతో ఆకట్టుకుంది. నైని పాత్రలో అర్చనా సింగ్ పర్వాలేదనిపించింది. రాణె భాయ్ గా కబీర్ సింగ్ దుహాన్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే.. 
మరో ప్రస్థానం మూవీ మేకింగ్ పరంగా ఇన్నోవేటివ్ ప్రయత్నమే అని చెప్పాలి. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. దర్శకుడు అనుకున్న పాయింట్‌ కొత్తగా ఉన్నప్పటికీ, అనుకున్నట్లు తెరపై చూపిండంతో కాస్త తడబడ్డాడు. అయితే ఓ రాత్రిలో జ‌రిగే క‌థ‌ను సింగిల్ షాట్‌లో చిత్రీక‌రించాల‌నుకున్న దర్శకుడి ఆలోచ‌న మాత్రం బాగుంది. అందుకు త‌గ్గ‌ట్లు స‌న్నివేశాల‌ను ప్లాన్ చేసుకుని సినిమాను చిత్రీక‌రిస్తూ వ‌చ్చారు. వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ లో కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అనిపించవచ్చు. కానీ తన డెసిషన్ కు కట్టుబడి ఫిల్మ్ చేశాడు.

ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్‌ టిస్ట్‌ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్‌ కూడా రోటీన్‌గా సాగడం కాస్త మైనస్‌. సునీల్ క‌శ్య‌ప్ పాటలు కథలో స్పీడుకు బ్రేకులు వేసేలా ఉంటాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది.  సింగిల్ షాట్ మూవీ కావ‌డం, రీటేక్స్ తీసుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో టెక్నిక‌ల్‌గా ఈ విష‌యంలో ఎవ‌రినీ త‌ప్పు ప‌ట్ట‌లేం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ఉంటే మరో ప్రస్థానంలో మరింత రిలీఫ్ దొరికేది. మొత్తంగా సింగిల్ షాట్‌లో తీసిన మరో ప్రస్థానం టాలీవుడ్‌లో ఒక కొత్త ప్రయత్నమనే చెప్పాలి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement