ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా. వైశాలి రాజ్ హీరోయిన్. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట సినిమాపై ఆసక్తిని పెంచింది. నేడు(ఫిబ్రవరి 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు కమెడియన్‌గా అందరిని నవ్వించిన అభినవ్.. హీరోగా ఏ మేరకు ఆకట్టుకున్నాడు? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
మనోహర్ అలియాస్ మను(అభినవ్ గోమఠం) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పుడే మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా పేరు సంపాదించుకుంటాడు. పెద్దయ్యాక తనకు వచ్చిన కళనే వృత్తిగా మార్చుకుంటాడు. ఒక అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్సవుతుంది. అయితే డబ్బులు లేవని, పెయింటింగ్ ద్వారా వచ్చే ఆదాయం సంసారానికి సరిపోదని.. పెళ్లికి ఒకరోజు ముందు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఆ అమ్మాయి లేచిపోతుంది. మరోవైపు మను క్లాస్‌మేట్, రిచ్ ఫ్యామిలీకి చెందిన రాహుల్(అలీ రెజా)..అతన్ని హేళన చేసి మాట్లాడుతాడు. దీంతో మను ఎలాగైనా బాగా సెటిల్ కావాలనుకుంటాడు. సొంత ఊళ్లోనే ఓ ఫ్లెక్సీ ఫ్రింటింగ్ షాపు పెట్టి బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు.
అందుకోసం అప్పు చేసి స్నేహితుడు శివ(మొయిన్ మహ్మద్) అదేగ్రామానికి చెందిన మరొక వ్యక్తి(నిజల్ గళ్ రవి)తో సహాయంతో ఊర్లో ఫెక్సీ ఫ్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఆదిలోనే మనుకి ఎదురుదెబ్బ తాకుతుంది. కొన్ని కారణాల వల్ల అతని బిజినెస్ మధ్యలోనే ఆగిపోతుంది. అసలు మను ప్రింటింగ్ బిజినెస్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? పరువు కోసం మను ఆడిన ఓ అబద్దం అతన్ని ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టింది?మను బిజినెస్‌ను దెబ్బతీయాలని రాహుల్ ఎందుకు ప్రయత్నించాడు? చివరకు మను అనుకున్నట్లుగా ప్రింటింగ్ షాపు పెట్టి డబ్బులు సంపాదించాడా లేదా? ఉమాదేవి(వైశాలి రాజ్)తో మను ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మస్ట్ షేడ్స్ ఉన్నాయి రా?’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని నమ్ముకొని ముందుకు సాగితే విజయం వరిస్తుంది. కానీ చాలా మంది తమలోని టాలెంట్‌ని గుర్తించకుండా ఏవోవే ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా.. అసమర్థులుగా మిగిలిపోతున్నారు.అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించిన చిత్రమే ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా’. టాలెంట్ ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న యువకులు పడే ఇబ్బందులు ఏంటి? ఆర్థికంగా బలంగా లేకపోతే సొంతవాళ్లతో పాటు ఇతరులు మనల్ని ఎలా చూస్తారు? తదితర అంశాలన్నీ ఈ చిత్రంలో చర్చించాడు దర్శకుడు. టాలెంట్ ఉన్నవాడికి ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎంతమంది ఇబ్బంది పెట్టినా..ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి ఎదుగుతాడు అనేది ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేశారు.
మను చిన్ననాటి ఎపిసోడ్‌తో చాలా సరదాగా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెళ్లి కూతురు లేచిపోవడం.. మను గురించి ఊరంతా మాట్లాడుకోవడం.. అవమానానికి గురైన మను ఫ్లెక్సీ ఫ్రింటింగ్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే బిజినెస్ కోసం మను చేసే ప్రయత్నాలు.. ఫోటో షాప్ నేర్చుకోవడం.. ఈక్రమంలో ఉమాదేవితో ప్రేమాయణం ఇవ్వన్నీ రోటీన్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా.. చివరి 15 నిమిషాలు ఉత్కంఠంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం సింగిల్ పాయింట్ చుట్టే తిరగడం, ఎమోషనల్ సన్నివేశాలు సాదా సీదాగా ఉండడం మైనస్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్తే ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ కొంతవరకు అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అభినవ్ గోమఠం. ఆయన వేసే పంచులు బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఇన్నాళ్లు తెరపై చూసిన దానికి పూర్తి భిన్నంగా అభినవ్‌ని చూపించాడు దర్శకుడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు మనోహర్ పాత్రలో అభినవ్ ఒదిగిపోయాడు. కమెడియన్‌గా మాత్రమే కాదు.. సీరియస్ పాత్రల్లోనూ అభినవ్ చక్కగా నటిస్తాడనేది ఈ సినిమా ద్వారా తెలియజేశాడు.
ఉమాదేవిగా వైశాలి రాజ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో స్నేహితుడు శివగా మెయిన్ చక్కగా నటించాడు. తెరపై చాలా చలాకీగా కనిపిస్తాడు. రవి పాత్రకు తమిళ నటుడు నిజల్ గళ్ న్యాయం చేశాడు. తరుణ్ భాస్కర్ ఎమ్మెల్యేగా గెస్ట్ రోల్ చేశాడు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో లావణ్య రెడ్డి పర్వాలేదు అనిపించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా ఈ సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన లాంగ్ స్పెషల్ అట్రాక్షన్. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment