‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ | 'Mathu Vadalara 2' Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Mathu Vadalara 2 Review: ‘మత్తు వదలరా 2’ మూవీ ఎలా ఉందంటే.. ?

Published Fri, Sep 13 2024 12:42 PM | Last Updated on Fri, Sep 13 2024 2:59 PM

'Mathu Vadalara 2' Movie Review And Rating In Telugu

టైటిల్‌: మత్తు వదలరా- 2
నటీనటులు:  శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులు
నిర్మాణ సంస్థలు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత
రచన, దర్శకత్వం: రితేష్ రానా
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
విడుదల తేది : సెప్టెంబర్‌ 13, 2024

‘మత్తు వదలరా’ సినిమా తర్వాత హీరో శ్రీసింహాకు ఆ స్థాయి హిట్‌ ఒక్కటి కూడా లేదు. వరుస సినిమాలు చేస్తున్నా.. ఏవీ వర్కౌట్‌ కాలేదు. దీంతో తనకు హిట్‌ ఇచ్చిన సినిమాకు  సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’తొ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘మత్తు వదలరా 2’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో​ చూద్దాం.


కథేంటంటే.. 
‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్‌ అయిన బాబు మోహన్‌(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్‌లో హీ టీమ్‌(హై ఎమర్జెన్సీ టీమ్‌)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్‌ యాడ్‌ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్‌ కేసులను డీల్‌ చేయడం వీళ్ల పని. 

వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్‌ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్‌ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్‌ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్‌ చేసి రూ. 2 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్‌కి తెలియకుండా డీల్‌ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్‌ ఆకాశ్‌(అజయ్‌) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్‌ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్‌ చేసిందెవరు..? స్టార్‌ హీరో యువ(వెన్నెల కిశోర్‌)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్‌ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.


ఎలా ఉందంటే.. 
ఒక హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ అంటే.. కచ్చితంగా ఆ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకుంటారు. మొదటి భాగం కంటే రెండో పార్ట్‌ ఇంకా బెటర్‌గా ఉంటుందనే ఆశతో థియేటర్స్‌కి వస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే ఒకే.. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతి. అందుకే సీక్వెల్‌ తీయడం ఓ రకంగా కత్తి మీద సాము లాంటిదే. డైరెక్టర్‌ రితేష్‌ రానా ఆ సాహసం చేశాడు. కానీ పార్ట్‌ 1ని మించేలా కథనాన్ని నడిపించలేకపోయాడు. కథలో బలమైన పాయింట్‌ లేకపోవడం.. కథనం మొత్తం ఒక పాయింట్‌ చుట్టే తిరగడం సినిమాకు పెద్ద మైనస్‌. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే ఈ లోపాలన్నింటిని సత్య కామెడీ కొంతవరకు కవర్‌ చేస్తే.. టెక్నికల్‌ టీమ్‌ మరికొంత కవర్‌ చేసింది. 

పార్ట్‌ 1 చూసిన వాళ్లకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో మొదటి నుంచే కనెక్ట్‌ అవుతారు. కానీ చూడని వాళ్లకు మాత్రం కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతారు. హీ టీమ్‌లో బాబు, యేసులో జాయిన్‌ అయ్యే సీన్‌ నుంచి.. రియా కిడ్నాప్‌ డ్రామా వరకు ప్రతి సీన్‌ గత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే, ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మొత్తం మిస్టరీ మర్డర్‌, హత్య చుట్టే తిరుగుతుంది.  ఫరియా, సత్య, శ్రీసింహా కలిసి చేసే యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. అయితే, కథకు ఏ మాత్రం సంబంధం లేని ‘ఓరి నా కొడక’ సీరియల్‌ డ్రామా అయితే నవ్వించకపోవడమే కాకుండా.. ఒకానొక దశలో చిరాకు తెప్పిస్తుంది. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నారు.  ప్రీ క్లైమాక్స్‌ నుంచి చివరి వరకు సాగే కథనం.. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు సినిమాపై  కొంతవరకు పాజిటివ్‌ ఒపీనియన్‌ని తెప్పిస్తాయి. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాకు ప్రధాన బలం సత్య కామెడీయే. శ్రీసింహా హీరో అయినప్పటికీ.. సత్యనే స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించాడు.  బాబు మోహన్‌ పాత్రకు శ్రీసింహా న్యాయం చేశాడు. తెరపై శ్రీసింహా, సత్యల కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఇక ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఓ డిఫరెంట్‌ పాత్రను పోషించింది. హీ టీమ్‌లో పని చేసే 'నిధి' పాత్రలో ఒదిగిపోయింది. యాక్షన్‌ సీన్‌లో కూడా చక్కగా నటించింది. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడి ఆకట్టుకుంది. హీ టీమ్‌ హెడ్‌గా రోహిణి, మైఖెల్‌గా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా బాగుంది. కాల భైరవ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరపై చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement