టాలీవుడ్ మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్‌కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటిచండంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మెగాస్టార్ మాట్లాడుతూ..'కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా.' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల కు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. మీరు నా పై చూపిస్తున్నకొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు మెగాస్టార్‌కు అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment