
ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా బాధితుల కోసం మెగాస్టార్ చిరంజీవి నడుంబిగించారు. ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాలకు ఆక్సిజన్ బ్యాంకులు ఎర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తరలిస్తున్న వీడియోను చిరంజీవి ట్విటర్‌లో షేర్ చేశారు.
‘అనుకున్న ప్రకారం వారం రోజుల్లోనే వందల సంఖ్యల్లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లు సంపాదించాం. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’ సేవలు ప్రారంభమవుతున్నాయి. గురువారం నుంచి ఖమ్మం, కరీంనగర్ జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆక్సిజన్ సిలిండర్లు సంపాదించడానికి రామ్‌చరణ్ కూడా ఎంతో కృషి చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదు’ ఆయన చెప్పుకొచ్చారు.
కాగా కరోనా కారణంగా చాలా చోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో స్వయంగా తానే ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని కొన్ని రోజుల క్రితం చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఆక్సిజన్ బ్యాంకులను ఆయా జిల్లాల చిరంజీవి అభిమానల సంఘాల అధ్యక్షులు నిర్వాహకులుగా వ్యవహరిస్తారని రామ్ చరణ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment