
ఓ వైపు పెద్ద పెద్ద హీరోల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో వస్తున్న చిత్రాలు ఊరించి ఊరించి ఉస్సురుమనిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్లో పెద్దగా ఫాలోయింగ్ లేని స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తున్నాయి. అది మరీ వింత కాకపోయినా ఈ మధ్య తరచుగా జరుగుతుండడమే గమనార్హం. మరీ ముఖ్యంగా బలమైన నెట్ వర్క్,సమర్ధులైన సాంకేతిక నిపుణులు పనిచేసిన భారీ చిత్రాల్లో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక అప్రతిష్ట పాలవుతున్నాయి. ఇటీవల విడుదలైన విశ్వంభర టీజర్ గానీ, హరి హర వీరమల్లు, కన్నప్ప లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో చిన్న చిత్రాల్లోని గ్రాఫిక్స్ కళ్లప్పగించేలా చేస్తూ సినిమాని బ్లాక్ బస్టర్‌గా మారుస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు మిరాయ్(Mirai Movie) కూడా జేరింది.
విడుదలైన రోజు నుంచి మిరాయ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు సమీక్షలు కూడా సాధిస్తోంది. ఈ చిత్రం బృందంలో సాంకేతికత పాత్ర భారీగా ప్రశంసలు అందుకుంటోంది. అత్యంత ఆశ్చర్యకరంగా, హాలీవుడ్‌లోని అంతర్జాతీయ విఎఫ్‌ఎక్స్ కంపెనీలతో సమానమైన అవుట్‌పుట్‌ను మిరాయ్ బృందం అందించగలిగింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఇదంతా హైదరాబాద్‌లోనే స్థానికంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నియమించిన టీమ్ ఈ అద్భుతమైన ఆవిష్కరణను అందించడం.
ట్రైలర్ విడుదలైనప్పుడే వీక్షకులు అందరూ అవుట్‌పుట్‌కి ఆశ్చర్యపోయారు నేడు, సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ ముందు పక్షి ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, రాముడి సీన్లు...తెరపైన ఆవిష్కృతమవుతుంటే.. ప్రేక్షకులు ఆ అద్భుతమైన గ్రాఫిక్స్ పనితీరుని కళ్లప్పగించి చూస్తుండటం కనిపిస్తోంది. ఇటీవల అనేక భారీ బడ్జెట్ చిత్రాలు పరిశ్రమలలోని టాప్ కంపెనీల నుంచి కూడా నమ్మదగిన విఎఫ్‌ఎక్స్ అవుట్‌పుట్‌ను పొందడంలో తరచుగా విఫలమవుతున్న పరిస్థితిలో హైదరాబాద్‌లోని సాంకేతిక నిపుణులే దీనిని సాధించగలగడం మరింత ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది. విఎఫ్‌ఎక్స్ వర్క్ లో ఎటువంటి అస్పష్టత రాకుండా కూడా చిత్రబృందం చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నారు, పరిమిత వనరులతోనే టీమ్ మిరాయ్ ఈ అద్భుతమైన అవుట్‌పుట్‌ను సాధించడం గమనార్హం.
ఈ సినిమా సాధించిన అనూహ్య విజయం రాబోయే మరో అగ్రహీరో ప్రభాస్ భారీ చిత్రం రాజా సాబ్(The Raja Saab) ను చర్చనీయాంశంగా మారుస్తోంది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న రాజాసాబ్ కూడా మిరాయ్ ను అందించిన అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రానుంది. రెబల్ స్టార్ అభిమానులు ఈ చిత్రానికి కూడా అదే రకమైన అవుట్‌పుట్ ను ఊహిస్తున్నారు. దాంతో ఆ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగి ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి. రాజా సాబ్ ఒక హర్రర్ డ్రామా, దీనిని చాలా వరకూ సెట్‌లోనే చిత్రీకరించారు దాంతో విఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమా బృందం విడుదల చేసిన టీజర్ కూడా బాగుంది మిరాయ్ లాగే దీనికి కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ జతగూడితే...ప్రభాస్ అనే అగ్నికి ఆజ్యం పోసినట్టే అయి ఇక అభిమానులకు రికార్డుల పండగే అని చెప్పొచ్చు.