
తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండగకు ఆదరణ పెరిగిపోతుంది. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించే బతుకమ్మ వేడుకలు ఇప్పుడు పట్టణ ప్రజలు సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చినప్పుటి నుంచి బతుకమ్మ పండగ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. అంతేగాక ప్రతి ఏడాది బతుకమ్మ పాటలు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోను మారుమోగుతున్నాయి. ప్రతి ఎడాది బతుకమ్మ సంబరాల్లో భాగం ఒక కొత్త పాటను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఎడాది లాగే ఈ సారి కూడా బతుకమ్మ పాటపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే ఈ సారి బతుకమ్మ పాట అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఎడాది బతుకమ్మ పాటకు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ‘అల్లిపూల వెన్నెల’ అంటూ సాగే ఈ పాట హైదరాబాద్ సమీపంలోనే భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరుపుకుంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత ఈ పాటను విడుదల చేయనున్నారు. అంతేగాక ఈ సాంగ్‌ను ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎడాది అక్టోబర్ 6 నుంచి బతుకుమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్నాయి.