కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో చిక్కుకున్న సినీ నటుడు మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇదే కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అందుకు అంగీకరించని న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఏం జరిగిందంటే?
ఇటీవల మోహన్‌బాబు, మనోజ్ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జల్‌పల్లిలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో జర్నలిస్టు రంజిత్‌పై మోహన్‌బాబు మైక్‌తో దాడి చేశారు. దీంతో ఆయన పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించిన కేసులో ఆయన తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అయితే, డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వబోమని న్యాయస్థానం తెలిపింది.
దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేడు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment