manchu mohanbabu
-
మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో (Supreme Court ) స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే వరకు మోహన్‌బాబుపై (Mohan Babu) ఎలాంటి చర్యలు తీసుకోకవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే, విచారణలో భాగంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు అడిగింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా.. ? అంటూ నటుడు మోహన్ బాబును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది ఆవేశంలో జరిగిన ఘటన అని, బాధితుడికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి నష్టపరిహారం కావాలా.. ? మోహన్ బాబును జైలుకు పంపాలా..? అని జర్నలిస్టు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగింది. అయితే, ఈ అంశం గురించి తదుపరి విచారణలో సమాధానం ఇస్తామని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది చెప్పడంతో మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని రంజిత్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది.(ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే హైప్)మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇలా వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు ఆహ్వానం లేకుండానే ఎందుకు ఇంటికి వచ్చారని న్యాయవాది ప్రశ్నించారు. అయినప్పటికీ ఇది ఆవేశంలో జరిగిన ఘటనగా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ముకుల్ కోరారు. అయితే, మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డానని జర్నలిస్ట్ కోర్టుకు తెలిపారు. ఆ కారణంగా ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ దాడి వల్ల వృత్తిపరంగా తనకు నష్టం జరిగిందని జర్నలిస్ట్ తెలిపారు. -
సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో చిక్కుకున్న సినీ నటుడు మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇదే కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అందుకు అంగీకరించని న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.ఏం జరిగిందంటే?ఇటీవల మోహన్‌బాబు, మనోజ్ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జల్పల్లిలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో జర్నలిస్టు రంజిత్‌పై మోహన్‌బాబు మైక్‌తో దాడి చేశారు. దీంతో ఆయన పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించిన కేసులో ఆయన తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అయితే, డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వబోమని న్యాయస్థానం తెలిపింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేడు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరగనుంది. -
రాజకీయాలపై 'మంచు మోహన్‌బాబు' సంచలన లేఖ
కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ విలక్షణ నటులు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఒక లేఖ విడుదల చేశారు. ఏ పార్టీ వారైనా తన పేరును వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఆయన ఇలా విజ్ఞప్తి చేశారు. 'ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరుతున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తున్నాను.శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నాను. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను.' అని మంచు మోహన్ బాబు ఒక లేఖను తన ఎక్స్పేజీలో విడుదల చేశారు. విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5 — Mohan Babu M (@themohanbabu) February 26, 2024 -
మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం గ్లింప్స్..
మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీప్రసన్న నిర్మించారు. మంగళవారం ఈ సినిమా గ్లింప్స్‌ని హీరో రానా రిలీజ్ చేసి, చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో లక్ష్మీప్రసన్న పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘అగ్ని నక్షత్రం’. రానా విడుదల చేసిన గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజామణి, కెమెరా: గోకుల్ భారతి. -
మల్టీ హంగామా.. ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి!
ఈ ఏడాది మల్టీస్టారర్ ట్రెండ్ తెలుగులో బాగా కనిపించింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘బంగార్రాజు, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇద్దరు స్టార్ హీరోలు కనిపించిన ఈ ‘మల్టీ హంగామా’లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. వచ్చే ఏడాది మరికొన్ని మల్టీస్టారర్ ఫిల్మ్స్ రానున్నాయి. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి. దాదాపు ఇరవైరెండు సంవత్సరాల తర్వాత హీరో చిరంజీవి, రవితేజ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, రవితేజ. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి ‘అన్నయ్య’ (2000) సినిమా చేశారు. ఆ చిత్రంలో చిరంజీవి తమ్ముడు పాత్ర చేశారు రవితేజ. ఇప్పుడు వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కూడా చిరంజీవి, రవితేజ బ్రదర్స్‌గానే కనిపిస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇందులో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. చిరంజీవి, రవితేజల కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణ కూడా ఇటీవల వైజాగ్‌లో జరిగింది. ఇక అప్పుడు ‘అన్నయ్య’ చిత్రం జనవరిలో సంక్రాంతి పండక్కి రిలీజ్ కాగా, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ కానుండటం విశేషం. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక వెంకటేష్, సల్మాన్ ఖాన్, రామ్‌చరణ్‌లు కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఒకేసారి కనిపిస్తే వారి అభిమానులు విజిల్స్ వేయాల్సిందే. ఈ ముగ్గురూ కలిసి హిందీ చిత్రం ‘కిసీ కీ భాయ్ కీసీ కీ జాన్’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ లీడ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర. ఓ పాటలో మాత్రమే చరణ్ కనిపిస్తారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, జగపతిబాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ‘మనం’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు–నాగార్జున– నాగచైతన్య నటించిన ‘మనం’లో అఖిల్ ఓ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున, అఖిల్ హీరోలుగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఇంకోవైపు ‘అగ్ని నక్షత్రం’ కోసం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు తండ్రీకూతురు మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి. ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వంత్, చిత్రా శుక్లా, మలయాళ నటుడు సిద్ధిఖ్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్ మెంట్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళ హిట్ ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ తెలుగు రీమేక్ హక్కులను హీరో– నిర్మాత విష్ణు మంచు దక్కించు కున్నారని తెలిసింది. ఈ సినిమాలో తండ్రి పాత్రలో మోహన్‌బాబు నటించనున్నారు. తనయుడు పాత్రలో టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో కనిపిస్తారట. ఒకవేళ మంచు విష్ణుయే ఈ పాత్రనూ చేస్తే అది మరో మల్టీస్టారర్ అవుతుంది. ఇంకోవైపు మేనమామ... మేనల్లుడు పవన్ కల్యాణ్– సాయిధరమ్ తేజ్‌లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సిత్తమ్’ తెలుగులో రీమేక్ కానుందని, ఈ చిత్రంలోనే పవన్ కల్యాణ్, సాయిధరమ్ నటించనున్నారన్నది ఫిల్మ్ నగర్ టాక్. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఇంకోవైపు మీడియమ్ రేంజ్ హీరోల మల్టీస్టారర్ మూవీస్ కూడా రానున్నాయి. హీరో సత్య దేవ్, డాలీ ధనంజయ (‘పుష్ప’ సినిమాలో యాక్ట్ చేశారు) కలిసి ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఈశ్వర్కార్తీక్ దర్శకుడు. అలాగే రాజ్ తరుణ్, ‘జార్జిరెడి’్డ ఫేమ్ సందీప్ మాధవ్ ‘మాస్ మహా రాజు’ అనే సినిమా చేస్తున్నారు. ఇవేకాదు.. మరికొన్ని మల్టీస్టారర్ ఫిల్మ్స్‌కి కాంబినేషన్ సెట్ అవుతోందని తెలిసింది. -
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మోహన్‌బాబు
-
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మోహన్‌బాబు
రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల సినియర్ హీరో మంచు మోహన్‌బాబు స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని మోహబాబు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పవన్‌కు ఎందుకంత భయం: మంత్రి అనిల్) ‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కల్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్ కల్యాణ్‌గారు అనడంతో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదిన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B — Mohan Babu M (@themohanbabu) September 26, 2021 -
డైలాగ్ కింగ్‌కి మెగా వాయిస్
మంచు మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం హీరో సూర్య సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌కు ప్రముఖ నటులు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ‘‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక..’’ అని మోహన్‌బాబు పాత్రను పరిచయం చేశారు చిరంజీవి. ఇంకా మోహన్‌బాబు చెప్పిన ‘నేను చీకట్లో ఉండే వెలుతుర్ని, వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ డైలాగ్స్‌తో టీజర్ సాగుతుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘టీజర్‌కు చిరంజీవి అంకుల్ వాయిస్ ఓవర్ అయితే బాగుంటుందని విష్ణు అన్నాడు. చిరంజీవికి ఫోన్ చేసి అడిగితే, ‘వాయిస్ ఓవర్ మ్యాటర్ పంపు’ అన్నాడు. ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ నేను అడిగిన మూడు రోజులకే నాకు చెప్పకుండా తనే థియేటర్ బుక్ చేసి డబ్బింగ్ చెప్పి, పంపాలనుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసి విష్ణుబాబును పంపాను. ‘నిన్ను (విష్ణును ఉద్దేశిస్తూ) ఎవరు రమ్మన్నారు. డబ్బింగ్ పూర్తి చేసి మీ నాన్నకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను’ అని విష్ణుతో చిరంజీవి అన్నాడు. నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించినందుకు చిరంజీవికి ధన్యవాదాలు. అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్యకు ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో వస్తాం’’ అని అన్నారు. -
పాటగా రఘువీర గద్యం
మంచు మోహన్ బాబు లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రఘువీర గద్యాన్ని పాటగా మలుస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరిగాయి. చిత్ర సంగీత దర్శకుడు ఇళయారాజాతో మోహన్ బాబు, రత్నబాబు సమావేశమయ్యారు. ‘ఇది గద్యంలాగా ఉంది. దీనికి ట్యూన్ చెయ్యడం ఎలా కుదురుతుంది? చాలా కష్టం’ అని ఇళయరాజా అనడంతో.. ‘మీకే కుదురుతుంది సార్. మీరు చేయంది లేదు’ అని చెప్పి ‘రఘువీర గద్యం’ రాత ప్రతిని ఆయనకు అందజేశారు మోహన్ బాబు. ‘11వ శతాబ్దంలో శ్రీరాముని ఘనతను చాటి చెబుతూ వేదాంత దేశికర్ అనే మహనీయుడు రఘువీర గద్యం రాశారు. ఆ గద్యాన్ని అద్భుతమైన పాటగా ప్రేక్షకులకు అందించనున్నాం. తెలుగులో ఇంతవరకూ రాని ఒక విభిన్న కథా కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. మోహన్ బాబు పవర్ఫుల్ రోల్ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇదివరకు విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మెడలో రుద్రాక్ష మాలతో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన మోహన్ బాబు రూపానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్లో ఆయనకి ఇది వన్నాఫ్ ది బెస్ట్ లుక్స్ అవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, స్టైలిస్ట్: విరానికా మంచు. -
అందుకే నాన్నంటే అసూయ: మంచు విష్ణు
సాక్షి, హైదరాబాద్: డైలాగ్ కింగ్ మోహన్ బాబు మంచు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. విలన్‌గా ఆయన వేసే పంచ్ డైలాగులకు అభిమానులు ఫిదా అవుతుంటారు. హీరోగా ఎంతటి భారీ, పవర్‌పుల్ డైలాగ్‌నైనా అలవోకగా చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తారు. అలా డైలాగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ‘పెద్దరాయడు’, ‘రాయలసీమ రామన్న చౌదరి’, ‘అడవిలో అన్న’ వంటి చిత్రాల్లో నాయకుడి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాల్లో ఆయన చెప్పే ఒక్కొక్క పవర్‌పుల్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటి తరం వారు సైతం ఆయన డైలాగ్ డెలివరిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అంతేగాక అచ్చం ఆయలా చేయడానికి ఆసక్తిని చూపుతారు. (చదవండి: డైలాగ్ కింగ్ 45 ఏళ్ల సినీ ప్రయాణం) అలా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైలాగ్ కింగ్ మోహన్‌బాబు గత నెల నవంబర్‌లో 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు, హీరో మంచు విష్ణు తన తండ్రి పవర్‌పుల్ డైలాగ్‌ను పంచుకున్నారు. మోహన్‌బాబు నటించిన ‘అడవిలో అన్న’ చిత్రంలోని పాపులర్ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ గురువారం ట్వీటర్లో షేర్ చేశారు. ‘ఆయన నటించిన సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమా, డైలాగుల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో ఆయన డైలాగ్ చెప్పే విధానం, ఆయన మ్యానరీజం చూసినప్పుడల్లా నాకు అసూయగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోసారి డైలాగ్ కింగ్ సినిమాలను గుర్తు చేసుకుంటూ ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. (చదవండి: హద్దులు చెరిపిన ఆకాశం) One of my favorite movie and favorite dialogue. Relevant for any time and age. Jealous of the way he delivers ferocious dialogues! @themohanbabu pic.twitter.com/H69wAtbeBI — Vishnu Manchu (@iVishnuManchu) December 10, 2020 -
భాగ్యనగరంలో సన్ ఆఫ్ ఇండియా
మంచు మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ‘‘ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారు. ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. ఇటీవల తిరుపతి షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించాం. హైదరాబాద్ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై అధిక భాగం సన్నివేశాలను చిత్రీకరిస్తాం. మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూర్చిన ఈ సినిమాకు ‘డైమండ్’ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాశారు. మోహన్‌బాబుకు స్టయిలిస్ట్‌గా ఆయన కోడలు విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: చిన్నా. -
అందుకే ఈ ఆడియో!
సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితి నేడు. ఈ సందర్భంగా భక్తులందరూ గణనాథుడి కథను చదివి, వినాయక వ్రత కల్పాన్ని పాటిస్తారు. గంభీరమైన స్వరం ఉన్న నటుడు మంచు మోహన్‌బాబు వినాయక చవితి పూజను తన గళంతో వినిపించారు. దాన్ని ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘నేనిష్టపడే పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితుల్ని మా ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలు చదివి, కథను వినిపించడం నాకు అలవాటు. నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు ఈ వినాయక కథను అందరికీ వినిపించవలసిందిగా కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుడి కథను వినిపిస్తున్నాను’’ అన్నారు మోహన్ బాబు. వినాయకుని జననం, విఘ్నాలకు అధిపతి ఎవరు? చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం: ద్వాపరయుగం, భాద్రపద శుద్ధ చవితి మహత్యం, వినాయక వ్రతకల్పం వంటివి చెబుతూ ఈ ఆడియోను విడుదల చేశారు. -
'మంచు'వారి సాయం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21రోజులు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పలువురు దాతలు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. మరికొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు తన కుమారుడు విష్ణుతో కలిసి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లోని పేద కుటుంబాలకు రోజుకు రెండుసార్లు భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాదు.. ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలను కూడా సరఫరా చేస్తున్నారు మోహన్‌బాబు, విష్ణు. -
బాబు నీకు చివరి ఎన్నికలు: మోహన్‌బాబు
పుంగనూరు : చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని, అబద్ధాల చంద్రబాబును ఇంటికి సాగనంపాలని విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీనటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఇందిరా సర్కిల్ నుంచి బస్టాండు, పోలీస్‌స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహించారు. ‘చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా వాసిగా ఉండి, అపద్దాలు చెబుతాడు నమ్మకండి.. నేను అల్లా సాక్షిగా , సాయిబాబా సాక్షిగా అపద్దాలు చెప్పను నిజాలే చెబుతా‘ అంటూ మోమన్‌బాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు, చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఆయనను ఈయన ఏం చేశారో తెలుసా అంటూ ప్రశ్నించడంతో సభలో రకరకాల సమాధానాలు ఇచ్చారు. మోహన్‌బాబు నవ్వుతూ నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబునాయుడుకు లక్షల కోట్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అంతా అవినీతి సొమ్మేనని ఆయన తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై 32 కేసులు ఉన్నాయంటూ అబద్ధపు మాటలు చెప్పే చంద్రబాబునాయుడుపై 11 కేసులు ఉన్నాయన్న విషయం ఎవరికైనా తెలుసా ? అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా యువనాయకుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్‌ను చేతబట్టుకుని ప్రజలకు చూపుతూ.. డైలా గులతో సభను విజయవంతం చేశారు. మునిసిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, విశ్వనాథ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 25 వేల ఓట్లు అదనంగా వేయాలి ‘నా ప్రచారంతో వైఎస్సార్సీపీకి అదనంగా 25 వేల ఓట్లు ప్రజలు వేయాలి. ఇది నా విన్నపం’ అని మోహన్‌బాబు ప్రజలను కోరారు. ‘ 2.30 లక్షల ఓట్లలో 2 లక్షలు మీరు వైఎస్సార్సీపీకి వేసేలా నిర్ణయించుకున్నారు. మిగిలిన 30 వేలలో 25 వేల ఓట్లు నా తరఫున వేయండి , ఐదువేల ఓట్లు మాత్రం ఇతరులకు వేయండి’ అని మోహన్‌బాబు కోరగానే జనం కేరింతలతో చప్పట్లు కొట్టారు. -
దర్శకరత్న విగ్రహావిష్కరణ
దర్శకుడిగా, రచయితగా, నటుడిగా దర్శకరత్న దాసరి నారాయణరావు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు గురించి తెలిసిందే, పాలకొల్లు నుంచి సాదాసీదా వ్యక్తిగా మద్రాస్‌లో అడుగుపెట్టిన దాసరి సినిమా పరిశ్రమలో వేసిన విజయవంతమైన అడుగులు ఎన్నో. ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన దాసరి 2017లో మరణించారు. సినీ చరిత్రలో మరచిపోలేని ప్రముఖుల్లో ఒకరైన ఆయన విగ్రహావిష్కరణ ఈ నెల 26న జరగనుంది. దాసరి పుట్టిన ఊరు పాలకొల్లులో ఈ విగ్రహాన్ని ఆయన ప్రియ శిష్యుడు, ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త మంచు మోహన్‌బాబు ఆవిష్కరిస్తారు. దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో చలనచిత్ర, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. సంగీత దర్శకులు కోటి ఆధ్వర్యంలో దాసరి సంగీత విభావరి జరుగుతుంది. -
మోహన్‌బాబుకు మాతృవియోగం
ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం కన్ను మూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. లక్ష్మమ్మ భౌతికకాయాన్ని ఎ.రంగంపేట సమీపంలోగల శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే హుటాహుటిన ఇండియాకి బయలుదేరారు. ‘‘మా నానమ్మ లక్ష్మమ్మగారు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్సవుతాం నానమ్మా. ఈ సమయంలో మేం ఇండియాలో లేకపోవడం బాధ కలిగించింది. ఇది ఊహించని పరిణామం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ట్వీటర్ ద్వారా మంచు మనోజ్ పేర్కొన్నారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం తిరుపతిలో జరుగుతాయి. సినీ నటి, ఎమ్మెల్యే రోజా లక్ష్మమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
తర్వాత సంగతి తర్వాత!
కొంతమంది మనస్తత్వం అంతే.. మనసులో ఏదనిపిస్తే అది బయటకు చెప్పేస్తారు. తర్వాత సంగతి తర్వాత అంటారు. ఎవరేమనుకుంటారో అని భయపడరు. లోపల ఒకటి అనుకొని బయట ఇంకోలాగా ప్రవర్తించటం వాళ్లకు చేత కాదు. అలాంటి మనస్తత్వం ఉన్న పాత్రనే పోషించారు శ్రియ ‘గాయత్రి’ సినిమాలో. ఈ సినిమాలో శ్రియ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘నేనేదనుకుంటే అది చెప్పటం నాకలవాటు.. తర్వాత సంగతి తర్వాత’ అని క్యాప్షన్ ఉన్న ఆమె పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పణలో మంచు మోహన్‌బాబు నటించి, శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పై నిర్మించిన ఈ సినిమాలో గాయత్రి పాత్రను నిఖిలా విమల్ పోషించారు. విష్ణు, శ్రియ భార్యాభర్తలుగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు మదన్ రామిగాని దర్శకుడు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సర్వేష్ మురారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్.ఆర్. -
అవ్రామ్ భక్త మంచు...గ్రాండ్ సన్నాఫ్ భక్తవత్సలం నాయుడు
భక్తవత్సలం నాయుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘మంచు మోహన్‌బాబు’. ఈ విలక్షణ నటుణ్ణి ఆయన సన్నిహితులు ‘భక్తా’ అని పిలుస్తుంటారు. స్క్రీన్ నేమ్ ఎంత కలిసొచ్చినా ఒరిజినల్ నేమ్ అంటే ఓ స్పెషల్ మమకారం ఉంటుంది కదా. అందుకే మనవడికి తన పేరు వచ్చేలా పేరు పెట్టారు మోహన్‌బాబు. విష్ణు భార్య విరానిక ఇటీవల ఒక బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బేబీ బాయ్‌కి ‘అవ్రామ్ భక్త మంచు’ అని పేరు పెట్టినట్లు గురువారం విష్ణు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. విష్ణుకి ఆల్రెడీ ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే. అప్పుడే తమ్ముణ్ణి ఏమని పిలవాలో ఈ చిన్నారులు డిసైడ్ అయ్యారట. ‘‘అరియానా ‘బేబీ లయన్’ అని పిలుస్తుంది. వివియానా ‘బేబీ టెడ్డీబేర్’ అని పిలుస్తుంది. మేమంతా అవ్రామ్ భక్త మంచు అని పిలుస్తున్నాం. అవ్రామ్ అంటే.. వన్ హూ కెనాట్ స్టాప్ అని అర్థం’’ అని విష్ణు అన్నారు. ‘‘నా బిడ్డలు పుట్టినప్పుడు... త్రీ షిప్ట్స్‌లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నందున వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే త్రీ షిప్ట్స్ వాడితోనే గడుపుతున్నాను ’’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు. ఈ కుటుంబానికి సంక్రాంతి ముందే వచ్చేసింది. -
మహిళ సర్పంచ్‌కు మోహన్ బాబు ప్రశంసలు
చంద్రగిరి: ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు ఓ మహిళను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్‌కు కోడలుగా వచ్చి, సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నారంటూ.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల పద్మజను మోహన్ బాబు ప్రశంసించారు. సోమవారం రామిరెడ్డిపల్లిలో నిర్వహించిన జల్లికట్టు ప్రదర్శనకు మోహన్ బాబు, ఆయన కుమారుడు యువ హీరో మంచు మనోజ్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులతో కలసి జల్లికట్టు ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. తనకు కొన్ని సిద్ధాంతాలున్నాయని, ఆవులను, జంతువులను హింసించరాదని అన్నారు. పశువులను హింసించకుండా తరతరాలుగా వస్తున్న జల్లికట్టు ఆట నిర్వహించడాన్ని తప్పుపట్టరాదని చెప్పారు. సర్పంచ్ పద్మజను అభినందించారు. పశువులను హింసించకుండా సాంప్రదాయబద్ధంగా జల్లికట్టు నిర్వహించుకోవచ్చని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తమ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ కుమార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు సర్పంచ్ పద్మజ కృతజ్ఞతలు తెలిపారు.