కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో (Supreme Court ) స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే వరకు మోహన్‌బాబుపై (Mohan Babu) ఎలాంటి చర్యలు తీసుకోకవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
అయితే, విచారణలో భాగంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు అడిగింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా.. ? అంటూ నటుడు మోహన్ బాబును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది ఆవేశంలో జరిగిన ఘటన అని, బాధితుడికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు.
అయితే, ఈ కేసుకు సంబంధించి నష్టపరిహారం కావాలా.. ? మోహన్ బాబును జైలుకు పంపాలా..? అని జర్నలిస్టు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగింది. అయితే, ఈ అంశం గురించి తదుపరి విచారణలో సమాధానం ఇస్తామని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది చెప్పడంతో మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని రంజిత్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది.
(ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే హైప్)
మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇలా వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు ఆహ్వానం లేకుండానే ఎందుకు ఇంటికి వచ్చారని న్యాయవాది ప్రశ్నించారు. అయినప్పటికీ ఇది ఆవేశంలో జరిగిన ఘటనగా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ముకుల్ కోరారు. అయితే, మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డానని జర్నలిస్ట్ కోర్టుకు తెలిపారు. ఆ కారణంగా ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ దాడి వల్ల వృత్తిపరంగా తనకు నష్టం జరిగిందని జర్నలిస్ట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment