
సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితి నేడు. ఈ సందర్భంగా భక్తులందరూ గణనాథుడి కథను చదివి, వినాయక వ్రత కల్పాన్ని పాటిస్తారు. గంభీరమైన స్వరం ఉన్న నటుడు మంచు మోహన్‌బాబు వినాయక చవితి పూజను తన గళంతో వినిపించారు. దాన్ని ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘నేనిష్టపడే పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి.
ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితుల్ని మా ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలు చదివి, కథను వినిపించడం నాకు అలవాటు. నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు ఈ వినాయక కథను అందరికీ వినిపించవలసిందిగా కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుడి కథను వినిపిస్తున్నాను’’ అన్నారు మోహన్ బాబు. వినాయకుని జననం, విఘ్నాలకు అధిపతి ఎవరు? చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం: ద్వాపరయుగం, భాద్రపద శుద్ధ చవితి మహత్యం, వినాయక వ్రతకల్పం వంటివి చెబుతూ ఈ ఆడియోను విడుదల చేశారు.