
యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఇటీవలె ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ఆరంభించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే మనోజ్ పెళ్లి విషయంలో పలు వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి.
మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, వివాహానికి కూడా ఆయన హాజరు కారంటూ వార్తలు వినిపించాయి. కానీ వీటిని పటాపంచెలు చేస్తూ దగ్గరుండి మనోజ్ పెళ్లి జరిపించి వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు మనోజ్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ''మనోజ్ నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు.
ఓసారి ఆలోచించమన్నాను. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను భావిస్తున్నాను అన్నాడు. ఇంకేముంది చేసుకో.. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. కాదని ఎందుకంటాను. ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఎన్ని కుక్కలను నువ్వు ఆపుతావు?'' అంటూ మనోజ్ పెళ్లిపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment