నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న గొప్ప నటుడు మంచు మోహన్ బాబు. పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్, అల్లుడుగారు, అసెంబ్లీ రౌడి, రౌడీ గారి పెళ్ళాం.. ఇలా ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఆయన పుట్టినరోజు నేడు(మార్చి 19). ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్‌బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'ఎక్కడో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడిని అప్రెంటిస్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి నట జీవితం ప్రారంభించి మోహన్‌బాబు యూనివర్సిటీ ఛాన్స్‌లర్ దాకా వచ్చాను. నా తల్లిదండ్రులు, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. నా జీవితంలో భయంకరమైన ఎత్తుపల్లాలు ఉన్నాయి. నాకు పగవాళ్లంటూ ఎవరూ లేరు.. కానీ ఎవరికీ నాలాంటి కష్టాలు రాకూడదు. హీరోగా వరుసగా సినిమాలు చేశాను. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు విలన్‌గానూ చేశా. నటుడిగా ఏ పాత్ర వేయడానికైనా నేను సిగ్గుపడను. కానీ సినిమాలు తీసే క్రమంలో సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకున్నా. ఎంతో అందంగా కట్టుకున్న ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ తిరిగి వాటిని సాధిస్తాననుకున్నా. అనుకున్నది సాధించాను. ఇల్లేంటి, ఏకంగా యూనివర్సిటీనే స్థాపించాను.
నేను సొంతంగా బ్యానర్ పెట్టి ఎన్నో హిట్ సినిమాలు తీశాను. కానీ అదే బ్యానర్‌లో ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. నేను చేసిన సన్నాఫ్ ఇండియా ప్రయోగాత్మక చిత్రం. కానీ మంచు విష్ణు 'జిన్నా' ఎక్స్‌ట్రార్డినరీ మూవీ. అది ఎందుకు ఫ్లాప్ అయిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. విష్ణు కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీ. చిరంజీవికి, నాకు గొడవలు జరిగాయని పదేపదే రాస్తుంటారు. కానీ మేము ఎన్నోసార్లు ఎదురుపడ్డాం, మాట్లాడుకున్నాం. కాకపోతే మేము భార్యాభర్తల్లాగా పోట్లాడుకుని మళ్లీ కలిసిపోతుంటాం. ఇకపోతే కొన్ని సందర్భాల్లో నా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేను. ఎన్టీ రామారావు, కృష్ణ మరణించినప్పుడే కాదు ఇటీవల నా కొడుకు మనోజ్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. నా కుటుంబంపై వచ్చే ట్రోల్స్ గురించి నేను పట్టించుకోను' అని చెప్పుకొచ్చారు మోహన్‌బాబు.
Comments
Please login to add a commentAdd a comment