
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి: 2898 ఏడీ'. భారీ బడ్జెట్‌తో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా వస్తున్న ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. అయితే తాజాగా కల్కి కథ గురించి డైరెక్టర్ నాగ్అశ్విన్ పలు అసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
కొద్దిరోజుల్లో కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ భారీగా పెంచేశారు మేకర్స్. 'వరల్డ్ ఆఫ్ కల్కి' పేరుతో కొన్ని ఎపిసోడ్స్ రూపంలో ఈ సినిమా విషయాలను నాగ్ అశ్విన్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఎపిసోడ్-1 విడుదలైంది.

కల్కి కథ రాయడానికి ఐదు ఏళ్లు పట్టినట్లు నాగ్ అశ్విన్ చెప్పారు. భారతీయ పురాణాలు అన్నింటికి క్లైమాక్స్ (ముగింపు) లాగా కల్కి ఉంటుందని ఆయన చెప్పారు. కలియుగంలో జరగబోయే అంశాలను ఇందులో చూపించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అందరూ దీనికి కనెక్ట్ అవుతారని ఆయన తెలిపారు.
'మన పురాణాల ప్రకారం కృష్ణుడి అవతారంతో ముగింపు పలికి కలియుగం ప్రారంభం అవుతుంది. కృష్ణుడి అవతారం తర్వాత పదో అవతారం కల్కి. కలియుగంలో ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా. కలి అనే వాడు ప్రతీ యుగంలో ఉంటాడు. కానీ రూపం మారుతుంది. ఒకసారి రావణుడిలా, దుర్యోధనుడిలా ఉంటే చివరగా కలియుగంలో ఎలా ఉంటాడు.. అలాంటప్పుడు ఎలాంటి హీరో వస్తాడనే ఆలోచనతో రాసిన కథ ఇది. ' అని ఆయన చాలా ఆసక్తిగా చెప్పారు.