![Naga Chaitanya Voiceover For Trailer Of GV Prakash Kumar and Aishwarya Rajesh Dear - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/7/naga%20chaitanya22.jpg.webp?itok=zQvCtX86)
‘‘ఓపెన్ చేస్తే వైజాగ్‌లో అందమైన ఇల్లు...’’ అంటూ నాగచైతన్య ఇచ్చిన వాయిస్ ఓవర్‌తో మొదలైంది ‘డియర్’ చిత్రం ట్రైలర్. జీవీ ప్రకాశ్‌కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన చిత్రం ‘డియర్’. తమిళంలో ఈ నెల 11న, తెలుగులో 12న ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి. పృథ్వీరాజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రాలో అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణలో ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. భార్య (ఐశ్వర్యా రాజేశ్) గురక కారణంగా భర్త (జీవీ ప్రకాశ్) సతమతమవుతుంటాడు.
ఆ గురక కారణంగా వారి అనుబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది ‘డియర్’ కథాంశం. ‘‘ఈ ప్రపంచంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? రాత్రిపూట మంచి నిద్ర. ఈ కథను (‘డియర్’కి ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని ఉద్దేశించి) నెరేట్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ (జీవీ ప్రకాశ్ పాత్ర) భయానికి నేను కనెక్ట్ అయ్యాను. మీరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో ‘డియర్’ ట్రైలర్‌ని షేర్ చేశారు నాగచైతన్య. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
Comments
Please login to add a commentAdd a comment