నాగార్జున, విజయ్ బిన్నీ, ‘అల్లరి’ నరేశ్, శ్రీనివాసా చిట్టూరి
‘‘నేను దాదాపు 95మందికి పైగా దర్శకులతో పని చేశాను. చక్కని క్లారిటీతో సినిమాలు చేసే కొద్దిమంది దర్శకుల్లో విజయ్ ఒకరు అని నాకనిపించింది. ‘నా సామిరంగ’ మూవీని ఓ పాటలా అందంగా తీసి, కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. ఇలా తీయడం అంత సులభం కాదు’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ‘నా సామిరంగ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ – టీవీ డ్యాన్సర్స్ – డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ బిన్నీని సన్మానించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది.
విజయ్‌తో వండర్‌ఫుల్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్’’ అన్నారు. మరో అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని కావాలనుకున్న తన కలను సక్సెస్‌ఫుల్‌గా నెరవేర్చుకున్నారు విజయ్. ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నన్ను దర్శకుడిగా ఎంచుకోవడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘విజయ్‌గారు డైరెక్టర్‌గా గొప్ప విజయాన్ని అందుకోవడం మా అందరికీ గర్వకారణం’’ అన్నారు శేఖర్ మాస్టర్.
Comments
Please login to add a commentAdd a comment