సినిమా టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటేనే చిత్రపరిశ్రమకు మంచిదని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో కాచిగూడలో తారకరామ థియేటర్‌ను ఆయన పునః ప్రారంభించారు. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, నందమూరి తారక రామారావుపై అభిమానంతో 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను పునరుద్ధరించారు. ఇవాళ 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను బాలకృష్ణతో పాటు ప్రొడ్యూసర్ శిరీష్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ' మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిచారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడైన ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా నా అభినందనలు. తారకరామ థియేటర్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేలా చేస్తారు. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. 1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్ ప్రారంభించడం జరిగింది. సునీల్ నారంగ్ అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైన విషయం. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ ఉంది. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది.' అని అన్నారు
సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. 'మహనీయుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ థియేటర్ ఉంది. బాలకృష్ణ థియేటర్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. సరి కొత్త టెక్నాలజీతో థియేటర్ అద్భుతంగా నిర్మించాం. 600 సీట్లు ఏర్పాటు చేశాం. రేట్లు కూడా రిజనబుల్‌గానే పెట్టాం. మా నాన్న, ఎన్టీఆర్ చాలా మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్‌లో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment