సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్‌లు వెండితెరపై అలా మెరిసి, ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తారు. అలాంటి మార్క్‌నే సినిమా ప్రపంచంలో నయనతార వేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. ఇదే సందర్భంలో నేడు (నవంబర్ 18) నయన్ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
వెండితెరపై ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించగలదు అదే ఆమె ప్రత్యేకత. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా.. కథ, అందులో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడమే ఆమె ప్రత్యేకత.ప్రారంభంలో ఏ సినిమా ఛాన్స్ వచ్చినా కాదనకుండా ఓకే చెప్పిన నయన్... తర్వాత తన రూట్ మార్చి ప్రేక్షల చేత విజిల్స్ వేసే పాత్రలు చేసింది. అలా ఇప్పటి వరకు 80కి పైగా చిత్రాల్లో నటించింది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె బెంగళూరులో జన్మించారు. కానీ ఆమె స్వస్థలం కేరళ.. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన్ కురియన్. . నయన్ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. కేరళలో ఇంగ్లిషు లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసిన నయన్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేశాంరు. అలా కెరియర్ ప్రారంభంలో టీవీ యాంకర్‌గా కూడా పనిచేశారు. ఆపై 2003లో మలయాళ సినిమా అయిన 'మానస్సినక్కరే' తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
చంద్రముఖి సినిమాతో గుర్తింపు రావడంతో ఆమెకు టాలీవుడ్‌లో 'లక్ష్మీ'లో ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత బాస్, యోగి,దుబాయ్ శ్రీను, తులసి తదితర సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. 2010లో వచ్చిన అదుర్స్ సినిమా ఆమె కెరియర్‌నే మార్చేసింది. అక్కడి నుంచి ఆమె జర్నీలో భారీ విజయాలు దక్కాయి. అలా ఇక్కడ యంగ్, సీనియర్ హీరోలతో వరుస ఛాన్సులు దక్కించుకుని లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. కొద్దిరోజుల క్రితం చిరంజీవి చెల్లెలుగా గాడ్ ఫాదర్‌లో మెప్పించిగా.. షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
వారిద్దరితో ప్రేమ.. ఆ గాయాలను తట్టుకుని నిలిచింది
సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ నయనతార వార్తల్లో నిలిచింది. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చిచెప్పేసింది. తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. అలా పెళ్లి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార.
తన ప్రేమ గురించి నయనతార ఏమన్నారంటే..?
ఒక ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని స్వయంగా నయన్ ఇలా చెప్పింది. 'నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టం అయినా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డా.
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చా.. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి బలంగా నిలబెట్టాయి. నాలో ధైర్యాన్ని నింపాయి.' అని నయన్ అన్నారు. అలా ప్రేమ గాయాలను తట్టుకుని కొంత కాలం తర్వాత దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు.
నయనతార ఆస్తులు ఎంత..?
నయనతార ఒక్కో సినిమాకి దాదాపు రూ.10 నుంచి 14 కోట్లు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ బ్యూటీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.200 కోట్లపై మాటే. 2018లో అయితే ఏకంగా ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్‌లో చోటు సాధించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో నిలిచిన మొదటి మహిళా నటి నయనతారే కావడం ఇక్కడ విశేషం.అలాగే, ఆమె ఇటీవల తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి చర్మ సౌందర్య ఉత్పత్తుల కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. వారి వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉంది.
హిందూ మతాన్ని స్వీకరించిన నయన్
నయన్ క్రిస్టియన్.. ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ (పెబెల్స్) సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది. శ్రీరామరాజ్యంలో సీతగా మెప్పించిన నయనతారకు 2011లో నంది అవార్డు దక్కింది. అదే సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఆమెకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment