విఘ్నేశ్ లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉందంటోంది నయనతార. కానీ తన వల్ల అతడు విమర్శలపాలవుతున్నాడని, అదే సహించలేకపోతున్నానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. జీవితాన్ని కలిసి పంచుకోకపోయుంటే బాగుండేదేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. తనను ఈ రిలేషన్‌షిప్‌లోకి లాగినందుకు గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పటికీ అలాగే ఫీలవుతున్నాను.
ప్రేమను పంచుకోవాలి కానీ..
మా రిలేషన్‌లో నేనే మొదటి అడుగు వేశాను. నేనే గనక అతడి జీవితంలో లేకపోయుంటే అతడి ప్రతిభను గుర్తించేవారు. డైరెక్టర్‌గా, రచయితగా, గేయరచయితగా తనకు క్రెడిట్ ఇచ్చేవారు. విఘ్నేశ్ మంచి మనసున్న వ్యక్తి. నేను కూడా మంచిదాన్నే. కానీ తనంత మంతనమైతే నాలో లేదనుకుంటా! సక్సెస్ అయిన మనుషులు తమతో సమానంగా సక్సెస్ అయినవారినే పెళ్లి చేసుకోవాలని జనం ఆలోచిస్తారు. ఇక్కడ మీరు ప్రేమను ఎంచుకోవాలి తప్ప విజయాలను, డబ్బును, లగ్జరీని కాదు! అప్పుడే మీరు మరింత ప్రేమలో పడతారు.
అందుకేనేమో..
విఘ్నేశ్ నాకంటే ఆలస్యంగా కెరీర్ ప్రారంభించాడు. నేను అతడికంటే సీనియర్‌ను. అతడు వరుస బ్లాక్‌బస్టర్స్ ఇవ్వలేదనో, తన సినిమాలు ఆలస్యంగా వస్తున్నాయనో కానీ విఘ్నేశ్‌ను చాలామంది ట్రోల్ చేస్తుంటారు. నేను ఆల్‌రెడీ సక్సెస్ అయిపోయి, నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అతడు ఇంకా తన స్థానం సంపాదించుకునే పనిలోనే ఉన్నాడు. అందుకేనేమో అతడిపై ఎక్కువ ద్వేషం, చులకన! అని నయనతార చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment