నీలమ్
గోవిందా మనసారా ఇష్టపడ్డ అమ్మాయి నీలమ్. కానీ సునీతతో జీవితాన్ని పంచుకోవాల్సి వచ్చింది. ఆమెతో పెళ్లయిన ఏడాదికి గానీ ఆ విషయాన్ని నీలమ్‌తో చెప్పలేదు గోవిందా. ‘నేను చేసింది తప్పే. సునీతతో పెళ్లి విషయం నేను నీలమ్‌కు చెప్పి ఉండాల్సింది’ అని తప్పు ఒప్పుకుంటాడు గోవిందా. అయితే నీలమ్‌ను ఇష్టపడ్డం, పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పేం లేదు అనీ అంటాడు. ‘అవును.. నీలమ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. సునీతతో నిశ్చితార్థాన్ని తెంచుకునైనా నీలమ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకెలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకున్నానో అలాంటి అమ్మాయే నీలమ్. అలాగని సునీతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.. పెట్టను. భర్తగా నా బాధ్యతనెప్పుడూ విస్మరించలేదు. నీలమ్ మీద ఇష్టమూ చావలేదు. ఇప్పటికీ ఆమె ఎక్కడ కనపడ్డా నా గుండె లయ తప్పుతుంది. కానీ ఎందుకో నీలమే నాతో సినిమాలు చేయడం మానేసింది. బహుశా అదే డాన్స్, అదే డైలాగ్ డెలివరీ తనకు బోర్ కొట్టి ఉండొచ్చు. తనతో మళ్లీ సినిమాలు చేయాలనుంది’ అని చెప్పాడు గోవిందా ఒక ఇంటర్వ్యూలో. ఇంకో మాటా గట్టిగా చెప్పాడు.. ‘దయచేసి మాది అఫైర్ అని కామెంట్ చేయొద్దు. అది అఫైర్ కాదు.. నీలమ్ మీద నాకున్న ప్రేమ’ అని.
గోవిందా పెళ్లి విషయం తనకు తెలిసినప్పటి నుంచి అతనితో స్నేహాన్నే కాదు.. సినిమాలనూ మానేసింది. అలాగని గోవిందా పట్ల ఎన్నడూ కోపాన్ని, దురుసుతనాన్నీ ప్రదర్శించలేదు. బహుశా.. తను ఆ వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదేమో అంటారు నీలమ్ సన్నిహితులు. ఆమె సినిమాల్లో రాణించాలనే లక్ష్యం వల్లా అది నిర్లక్ష్యం అయిండొచ్చు అంటారు.
నీలమ్ కూడా ప్రేమలో పడింది. బాబీ డియోల్‌తో. అతనూ నీలమ్‌ను మనసులో నింపుకున్నాడు. ఆ ప్రేమను పెళ్లితో భద్రం చేసుకోవాలనీ అనుకున్నాడు. నీలమ్, బాబీ కలసి తిరుగుతున్నారు అన్న విషయం మొదట్లో ధర్మేంద్రకు తెలిసినా ఇండస్ట్రీలో అది మామూలే అని ఊరుకున్నాడ్లు. కానీ ఎప్పుడైతే కొడుకు ఆలోచన పెళ్లి దాకా వెళ్లిందని తెలిసిందో అప్పుడు సీరియస్ అయ్యాడు ఆ తండ్రి. నీలమ్ అంటే ఇష్టం లేక కాదు.. సినిమా హీరోయిన్లు తనింటి కోడళ్లుగా రావడం ఇష్టంలేక. ఆ మాటే బాబీ డియోల్‌కూ చెప్పాడు ధర్మేంద్ర. హతాశుడయ్యాడు బాబీ డియోల్. ఆ విషయంలో తండ్రిది మొండిపట్టే అని సన్నీ కూడా చూచాయగా మందలించాడు. అందుకు సన్నీ జీవితమే పెద్ద ఉదాహరణ. సినిమాల్లోకి వచ్చి అలాంటి ఆకర్షణలకు లోనవుతాడని తెలిసే పెళ్లి చేశాకే సన్నీని వెండితెర మీదకు తెచ్చాడు. తండ్రి ఆ ఆచరణంతా బాబీకి తెలియందేం కాదు. తండ్రి కోసం నీలమ్‌ను వదులుకోవాలనీ లేదు. తండ్రి తత్వం తెలిసీ మొండి పట్టూ పట్టలేదు.
భారమైన హృదయంతోనే ఒకరోజు నీలమ్‌ను కలిశాడు బాబీ డియోల్. తండ్రికి, తనకు మధ్య జరిగిన చర్చ గురించి చెప్పాడు. మొత్తం సీన్ అర్థమైపోయింది ఆమెకు. అందుకే ఎదురు ప్రశ్నలేం వేయకుండానే ‘సరే.. ఇక్కడితో ఆపేద్దాం’ అంది. ఆ మాట అంటున్నప్పుడు నీలమ్ కళ్లల్లో నిండిన నీళ్లు బాబీ దృష్టి దాటి పోలేదు. నిస్సహాయంగా ఇద్దరూ గుడ్ బై చెప్పుకున్నారు అయిదేళ్ల ఆ అనుబంధానికి.
వదంతులు.. చెక్
ఆ ఇద్దరి బ్రేకప్ మీద చాలా వదంతులు ప్రచారమయ్యాయి. ఒకసారి నీలమ్ స్టార్‌డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వదంతులకు చెక్ పెట్టింది. ‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డం నాకిష్టం ఉండదు. నా లవ్ అండ్ బ్రేకప్ గురించి వస్తున్న రూమర్స్ వింటూంటే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడక తప్పట్లేదు. నాకు, బాబీకి బ్రేకప్ అయిన మాట నిజమే. అయితే పూజాభట్ ఇన్‌వాల్వ్‌మెంట్ వల్లే మా బ్రేకప్ అయిందన్నది శుద్ధ అబద్ధం. పూజానే కాదు ఇంకే అమ్మాయి వల్లా మా బ్రేకప్ కాలేదు. మా పరస్పర అవగాహనతోనే విడిపోయాం’ అంటూ స్పష్టం చేసింది.
‘సెపరేషన్ బాధాకరమే. దాదాపు ఎమోషన్స్‌కి సర్జరీ చేసినట్టే. ఒక ఎమోషన్‌ను తీసేసి ఇంకో ఎమోషన్‌ను అనుభవించడమే. చుట్టూ ఆరోగ్యకర వాతావరణం ఉంటే ఆ గాయం నుంచి త్వరగా కోలుకోగలం. అయితే ఆ విడిపోవడం, ఎడబాటు నిజాయితీగా జరిగితేనే త్వరగా కోలుకోగలుతాం. మా బ్రేకప్ అలాంటిదే. విడిపోవాలని ఒక్కసారి నిర్ణయించుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచించలేదు. కన్నీళ్లు పెట్టలేదు. ముందుకే వెళ్లాను’ అని బ్రేకప్ తర్వాత తన మానసిక స్థితినీ వివరించింది నీలమ్.
తర్వాత..
బ్యాంకాక్‌కు చెందిన రిషి సేథియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కాని ఆ బంధం ఎన్నాళ్లో నిలువలేదు. ఆ విడాకుల తర్వాత జ్యుయెలరీ డిజైన్ మీద మనసు పెట్టింది. ఓ వైపు ఈ కొత్త వృత్తి ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న టైమ్‌లోనే నటుడు సమీర్ సోనీతో స్నేహం కుదిరింది. ప్రేమగా మారింది. పెళ్లీ చేసుకుంది. ఒక అమ్మాయి (ఆహనా)ని దత్తత కూడా తీసుకుంది ఆ జంట. ‘కదిలిపోయిన గతం పట్ల రిగ్రెట్స్ లేవు. వర్థమానమంతా సంతోషమే. భవిష్యత్ గురించి బెంగలేదు’ అంటుంది నీలమ్.
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment