నేను ఫొటోలు దిగి చాన్నాళ్లయింది: ఇలియానా | New mommy Ileana DCruz shares cutest pic of baby boy as he turns 2 months old | Sakshi
Sakshi News home page

నాకు నేనే పరాయిదానిలా... 

Mar 4 2024 1:07 AM | Updated on Mar 4 2024 6:36 AM

New mommy Ileana DCruz shares cutest pic of baby boy as he turns 2 months old - Sakshi

‘‘నేను ఫొటోలు దిగి చాన్నాళ్లయింది. అలాగే ఈ ప్లాట్‌ఫామ్‌లో నా అబీప్రాయాలు షేర్‌ చేసి కూడా చాలా రోజులైంది. తల్లయ్యాక బిడ్డను చూసుకోవడం, ఇల్లు చక్కబెట్టుకోవడంతోనే సరిపోతోంది. నాకోసం టైమ్‌ కేటాయించుకోలేకపోతున్నాను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నారు ఇలియానా. గత ఏడాది ఆగస్టులో ఒక బాబుకి జన్మనిచ్చారు ఇలియానా. ప్రెగ్నెసీ తర్వాత సహజంగా కొందరికి ఏర్పడే డిప్రెషన్‌లాంటిది ఇలియానాకి కూడా ఏర్పడిందట. సినిమా స్టార్‌గా కొన్నేళ్లు మేకప్‌కి దగ్గరగా ఉన్న ఇలియానాకి ఇప్పుడు మేకప్‌ బాక్స్‌ తెరిచే సమయం కూడా లేదు.

ఇక హెయిర్‌ స్టయిల్‌ అంటారా? గట్టిగా ముడి వేసుకునే ఉంటున్నారట. తల్లయ్యాక వచ్చిన ఆ మార్పులు గురించి ఇలియానా మాట్లాడుతూ – ‘‘మా చిన్నోడి చేతికి జుట్టు దొరికితే అంతే సంగతులు. అందుకే దాదాపు ముడి వేసుకునే ఉంటున్నాను’’ అంటూ ఆ ఫొటోను కూడా షేర్‌ చేశారు. ఇంకా చెబుతూ – ‘‘అమ్మ అయ్యాక నా లైఫ్‌ స్టయిల్‌లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటివరకూ ఒక రకంగా.. ఇప్పుడు ఒక రకంగా. నాకు నేనే పరాయిదానిలా అనిపిస్తున్నాను. తల్లయ్యాక కొంతమంది త్వరగా కోలుకుని, పనిలో (కొందరు హీరోయిన్లు సినిమాలు చేయడం గురించి) పడిపోతారు. కానీ నేను అంత త్వరగా కమ్‌బ్యాక్‌ కాలేను. అయితే ఎప్పటికైనా రావడం ఖాయం. కాకపోతే త్వర త్వరగా కాకుండా నాకు కుదిరినట్లు మెల్లిగా వర్కవుట్స్‌ చేసుకుంటూ, పూర్వపు శక్తి తెచ్చుకున్నాకే వస్తాను. ఇలా ఇంటికి, నా బిడ్డకి అంకితం కావడం నాకు ఏమాత్రం బాధగా లేదు. 

ఎందుకంటే అన్నింటికన్నా నా జీవితంలోకి వచ్చిన ఈ అందమైన చిన్నోడు ముందు నాకు ఏదీ పెద్దగా అనిపించడంలేదు. ఇప్పుడైతే ప్రతి రోజూ ఓ 30 నిమిషాలు వర్కవుట్‌ చేస్తున్నాను. ఆ తర్వాత జస్ట్‌ ఓ ఐదు నిమిషాలు స్నానం చేసి, నా ఇంటి పనులతో బిజీ అవుతున్నాను. ఒక్కోసారి వర్కవుట్‌ చేసే వీలు కుదరడంలేదు. అయినా ఫర్వాలేదు. నేను చెప్పాచ్చేదేంటంటే కచ్చితంగా ‘బౌన్స్‌ బ్యాక్‌’ అవుతా. అయితే కొంత ఆలస్యంగా..’’ అన్నారు ఇలియానా. ఇదిలా ఉంటే... గత ఏడాది మైఖేల్‌ డోలన్‌ని పెళ్లాడారు ఇలియానా. అయితే కొన్నాళ్ల పాటు రహస్యంగా ఉంచారు. కుమారుడు పుట్టాక మైఖేల్‌ పూర్తి ఫొటోను షేర్‌ చేశారు ఇలియానా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement