‘బలగం’ సినిమాకి ముందు ఇండస్ట్రీలో వేణుకి ఉన్న ఇమేజ్ వేరు. అప్పటి వరకు వేణు అంటే కమెడియన్ మాత్రమే అని అందరికి తెలుసు. ఆయనలో ఓ గొప్ప దర్శకుడు దాగి ఉన్నాడనే విషయం ‘బలగం’ రిలీజ్ ముందు వరకు తెలియదు. అందరికి లాగే తాను కూడా సరదా కోసం మెగాఫోన్ పట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత వేణు టాలెంట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. తొలి సినిమాతో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించాడు. ఆ హోదాను వేణు అలాగే కాపాడుకోవాలి అంటే..కచ్చితంగా ‘బలగం’కి మించిన సినిమాను తీయాలి. ఆ విషయం వేణుకి కూడా బాగా తెలుసు. అందుకే కాస్త సమయం తీసుకొని మరోసారి తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తెలంగాణ ‘కాంతార’
బలగం తరహాలోనే వేణు మరోసారి పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న కథతో ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారట. వేణు కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా ముఖ్యం అందుకే చాలా జాగ్రత్తగా ఈ కథను రాసుకున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ కథను రెడీ చేశాడట వేణు. కాంతార తరహాలోనే ఈ కథకి కూడా బలమైన క్లైమాక్స్ ఉంటుందట.
నాని టు నితిన్
‘ఎలమ్మ’ కథను పలువురు హీరోలకు వినిపించాడట వేణు. ప్రతి ఒక్కరు బాగుందనే చెప్పారట. తొలుత నానికి కథ చెప్పాడట. ఆయనకు విపరీతంగా నచ్చిందట. అయితే అప్పటికే తెలంగాణ నేపథ్యంలో ‘దసరా’ సినిమా ఒప్పుకోవడంతో ‘ఎల్లమ్మ’ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత ‘హను-మాన్’ హీరో తేజ సజ్జను అనుకున్నారట. కానీ ఈ వయసులోనే అంత పెద్ద పాత్రను పోషించలేని తేజ వెనక్కి తగ్గారు. వరుణ్ తేజ్ కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారట. వీరందరికి కంటే ముందే హీరో నితిన్‌కి ఈ కథ చెప్పాడట వేణు. అయితే దిల్ రాజు బ్యానర్‌లో వరుస సినిమాలు చేస్తున్నాని..మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్‌లో చేస్తే బాగోదని చెప్పాడట. కానీ మళ్లీ ఈ కథ చివరికి నితిన్ వద్దకే చేరిందట.
ఆయన అయితేనే వేణు రాసుకున్న పాత్రకు న్యాయం చేస్తాడని భావించి.. దిల్ రాజు ఒప్పించారట. నితిన్ ప్రస్తుతం ‘తమ్ముడు’, ‘రాబిన్‌వుడ్’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే ‘ఎల్లమ్మ’ సెట్‌లోకి అడుగుపెడతారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment