
సాక్షి,ముంబై: కరోనా మహమ్మారి సంక్షోభం, లాక్‌డౌన్ ఆంక్షల కాలంలో వలస కార్మికులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ సూపర్ స్టార్‌గా నిలిచారు. తన చేతికి ఎముకే లేదు అన్నట్టుగా ఆ తరువాత కూడా అప్రతిహతంగా దానగుణాన్ని చాటుకుంటూనే వస్తున్నారు. అడగనిదే అమ్మయినా పెట్టదు అన్న మాటలు చిన్నబోయేలా అన్‌లిమిటెడ్‌గా సాయాన్ని అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. (పుట్టిన రోజున సోనూసూద్ బంపర్ ఆఫర్)
యాదాద్రి భునవగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన సత్యనారాయణ, అనురాధకు ముగ్గురు సంతానం. తండ్రి సత్యనారాయణ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి అనురాధ కూడా ఇటీవల మరణించారు. దీంతో ఈ ముగ్గురు పిల్లలూ అనాధలుగా మారిపోయారు. అయితే తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడు మనోహరే పెద్ద దిక్కుగా మారి తన చెల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్న వైనం పలువురిని కదలించింది. ఈ కథనంపై స్పందించిన సోనూసూద్ ఆముగ్గురు చిన్నారులు ఇక ఎంతమాత్రం అనాథలు కాదని, వారి బాధ్యత తనదే నంటూ ట్విటర్ వేదికగా ప్రకటించడం విశేషం. (వారి కోసం సోనూసూద్ మరో గొప్ప ప్రయత్నం)