‘ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలలో కమర్షియల్ హంగులతో పాటు పిల్లలకు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’ మూవీ కృష్ణారెడ్డికి మంచి కమ్‌బ్యాక్ సినిమా అని ప్రముఖ దర్శఖుడు శేఖర్ కమ్ముల అన్నారు.
సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు. కృష్ణారెడ్డి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత సీ.కల్యాణ్ మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆర్గానిక్ మామ ` హైబ్రిడ్ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్‌లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి.
44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా నేను బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్ సంపాదించారు. సోహైల్ కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్‌లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది?. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అన్నారు.
‘చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ప్రతి సినిమా కోసం ఇలానే కష్టపడతాను’అన్నారు సోహైల్. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి , నటుడు అలీ, హేమ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment