
బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మనదేశం తరఫున ఆస్కార్ నామినేషన్ పోటీకి గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’) ఎంపికైన విషయం తెలిసిందే. భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్ నలిన్ (నలిన్ కుమార్ పాండ్య) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
రాయ్‌కపూర్ ఫిల్మ్స్, ఆరెంజ్ స్టూడియో సమర్పణలో సిద్ధార్థ్ రాయ్ కపూర్, ధీర్ మోమయ్య, పాన్ నలిన్, మార్క్ డ్యూలే నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘మా నాన్న నన్ను కొట్టారు. నేను సినిమా చూడటానికి వెళ్లానని’, ‘భవిష్యత్ స్టోరీ టెల్లర్స్‌దే’ వంటి డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇక ‘లాస్ట్ ఫిల్మ్ షో’ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. సినిమాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ (భవిన్ రాబరి) ఎలా ఫిల్మ్‌మేకర్ అయ్యాడు? అన్నదే చిత్ర కథ.