ఓవైపు హాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతగా కూడా నిరూపించుకుంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తాను నిర్మాతగా తెరకెక్కించిన 'అనూజ' (Anuja) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం దక్కించుకొని సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆడమ్ జే గ్రేవ్స్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. జీవిత గమనాన్ని మార్చే సినిమాగా అనూజ అందరినీ మెప్పిస్తుందని ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులో తాను భాగమయ్యినందుకు గర్వపడుతున్నాని ఆమె తెలిపింది.
ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో అనూజ చోటు దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అనూజ చిత్రం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న ఈ చిత్రం తప్పకుండా అవార్డ్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు.
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. మన దేశం నుంచి రేసులో అనూజ చిత్రం ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment