అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రకృతి ప్రకోపానికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు కాలి బూడిదైపోయాయి. ఈ ఘటనతో ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియ వాయిదా పడింది.
ప్రతి ఏడాది నామినేషన్స్ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు జరుగుతుంది. కార్చిచ్చు వల్ల జనవరి 17న ప్రకటించాల్సిన నామినేషన్స్‌ను వాయిదా వేశారు. ఈనెల 23న పూర్తి నామినేషన్స్ చిత్రాల జాబితా వెల్లడిస్తామని ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. మంటల వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ తెలిపారు.
భారత్ నుంచి ఆరు చిత్రాలు
కాగా.. ఈ ఏడాది భారత్ నుంచి ఆరు చిత్రాలు నామినేషన్ల బరిలో చోటు దక్కించుకున్నాయి. సూర్య హీరో నటించిన కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (మలయాళం), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), సంతోష్ (హిందీ), గర్ల్స్ విల్ బి గర్ల్స్( హిందీ, ఇంగ్లిష్) నామినేషన్స్ ప్రక్రియలో నిలిచాయి.
బాక్సాఫీస్ వద్ద ఫెయిల్..
సూర్య హీరోగా నటించిన కంగువాను శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీ 2025 ఆస్కార్ నామినేషన్స్‌లో పోటీ పడుతోంది. సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.
పాయల్ కపాడియా మూవీకి చోటు..
పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.
ముంబయిలోని ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సాధించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్‌లోనూ పోటీలో నిలిచింది. త్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్..
గతేడాది వచ్చిన హిట్ చిత్రాల్లో మలయాళ మూవీ ది గోట్ లైఫ్ కూడా ఒకటి. ఈమూవీ తెలుగులో ఆడుజీవితం పేరిట విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ డబ్బు సంపాదించేందుకు సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నింటినీ బెన్యమిన్ అనే రచయిత గోట్ లైఫ్ అనే నవలలో రాసుకొచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆడు జీవితం మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో పోటీ పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment