టైటిల్: పారిజాత పర్వం
నటీనటులు: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , గడ్డం నవీన్, జబర్దస్త్ రోహిణి తదితరులు
నిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్
రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
సంగీతం: రీ
ఎడిటర్: శశాంక్ వుప్పుటూరి
విడుదల తేది: ఏప్రిల్ 19, 2024
‘పారిజాత పర్వం’ కథేంటంటే?
చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్) గ్యాంగ్ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్ చేయమని బార్ శ్రీను గ్యాంగ్‌కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
సినిమా తీయడం ఓ కళ. ప్రేక్షకుడిని నవ్వించో, భయపెట్టో.. ఏదో ఒకటి చేసి రెండున్నర గంటల పాటు థియేటర్స్‌లో కూర్చోబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. రొటీన్ కథనే మరింత రొటీన్‌గా చూపిస్తానంటే ఎందుకు వస్తాడు? ఈ విషయం తెలిసి కూడా పారిజాత పర్వం తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి.
క్రైమ్ కామెడీ జోనర్‌లో సెఫెస్ట్ కాన్సెప్ట్ అయిన కిడ్నాప్ డ్రామానే కథగా మలుచుకొని.. రొటీన్ ట్విస్టులతో సాదాసీదాగా కథనాన్ని నడిపించాడు. ఫన్, సస్పెన్స్, థ్రిల్..వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడికి పూర్తిగా అందించలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చైతన్య సినిమా కష్టాలను చూపిస్తూనే బారు శ్రీను నేపథ్యాన్ని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చెప్పిన కథనే మళ్లీ చెప్పడం..వచ్చిన సీన్లే మళ్లీ రావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వైవా హర్ష పంచులతో పాటు హీరోయిన్ కారు డ్రైవింగ్ సీన్లు కాస్త నవ్విస్తాయి.
అసలు కథంతా(కిడ్నాప్) సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే కిడ్నాప్ కోసం రెండు టీమ్‌లు చేసే ప్లాన్ మొదలుకొని..చివరి సీన్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. కన్ఫ్యూజన్ డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. కిడ్నాప్ తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంది. పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులతో కథను సాగదీశాడు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించడమే ప్రేక్షకుడికి పెద్ద ట్విస్ట్.
ఎవరెలా చేశారంటే..
నటన పరంగా చైతన్యకు వంక పెట్టలేం కానీ ఆయన ఎంచుకుంటున్న కథలే రొటీన్ ఉంటున్నాయి. ఇందులోనూ ఆయన రొటీన్ పాత్రే పోషించాడు. సునీల్‌కి మంచి పాత్రే లభించింది. కానీ అటు విలన్‌గాను, ఇటు కమెడియన్‌గానూ పూర్తిగా మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం తనదైన కామెడీతో నవ్విస్తాడు. పార్వతిగా శ్రద్ధాదాస్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగాను కనిపించింది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష పండించే కామెడీ బాగుంది.
ఇక చైతన్య లవర్‌గా మాళవికా సతీశన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. వైవా హర్షకు, ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, సురేఖ వాణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటనను దర్శకుడు సరిగా రాబట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment