రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా టైటిల్ కొట్టేశాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కొంతవరకు సింపతీ పని చేసినప్పటికీ.. తనలో టాలెంట్‌ను కూడా అభిమానులకు చూపించాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్‌లో ఉండి తాను అనుకున్నది సాధించాడు. అయితే పల్లవి ప్రశాంత్‌కు బిగ్‌బాస్‌కు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బిగ్‌బాస్‌పై ఎందుకంత ఆసక్తి పెంచుకున్నాడు? దీనికి దారితీసిన పరిస్థితులేంటి? అనే విషయాలపై విన్నర్ ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఇచ్చిన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం.
ప్రశాంత్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లో నాకు తెలిసిందే కూకట్‌పల్లి రైతు మార్కెట్ ఒక్కటే. చాలా రోజుల కింద ఓ వీడియోను చేశా. మనలాంటి వాళ్లు బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లకూడదు? అని ఆలోచించా. అంతే కాకుండా మా బాపు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి మీ కొడుకు ఏం చేస్తాడని అడిగిండు. పొలంలో బాయి కాడ పనిచేస్తాడని బాపు చెప్పిండు. ఆయన మా బాపుతో మొహం మీదనే చాలా చీప్‌గా మాట్లాడిండు. ఆ తర్వాత నేను బాపుకు మాటిచ్చినా. బాయి కాడ పని చేసేటోళ్లు ఏం అనుకుంటే అది సాధిస్తారని బాపుతో చెప్పా. ఆ తర్వాత బాపును ఒప్పించి రూ.500 రూపాయలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టా.' అని అన్నారు.
రతికతో బిహేవియర్ గురించి మాట్లాడుతూ..'నేను ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేస్తా. రతికతో పాటు అందరినీ నేను కుటుంబసభ్యులు గానే భావిస్తా. ఆమెను నేను ఒక ఫ్రెండ్‌గానే చూశా. రతికను చూడగానే మనవాళ్లు అనే భావన కలిగింది. నామినేషన్స్ తర్వాత ఎలా పిలవాలి అనే టాపిక్ వచ్చింది. ఆమెనే నన్ను అక్క అని పిలవమని చెప్పింది. అందుకే అక్కా అని పిలిచా. రతికకు ఎవిక్షన్ పాస్ ఇద్దామనుకున్నా. ఆమె తీరు మారకపోవడంతో వద్దనుకున్నా.' అని ప్రశాంత్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment