ప్రైవసీ కోసమో, అడ్వెంచర్ చేయాలనో.. ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా లేదంటే జంటగా వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఆహ్లాదం వెనుకే కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ కథతో తీసిన మలయాళ సినిమానే 'ప్యారడైజ్'. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం!
కథేంటి?
అది 2022 జూన్. దేశం దివాళా తీయడంతో శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇదే టైంలో ఇండియా నుంచి కేశవ్ (రోషన్ మాథ్యూస్), అమృత (దర్శన రాజేంద్రన్) అనే జంట శ్రీలంకకి విహారయాత్రకి వస్తారు. ప్రైవసీ కోసం ఓ మారుమూల పల్లెటూరిలోని కాటేజీలో దిగుతారు. ఓ రోజు దుండగులు వీళ్ల గదిలోకి వచ్చిన ల్యాప్ ట్యాప్, ఫోన్స్ ఎత్తుకెళ్లిపోతారు. దీంతో కేశవ్-అమృత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
'ప్యారడైజ్' అంటే స్వర్గం అని అర్థం. శ్రీలంకని చాలామంది భూతల స్వర్గం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడి లొకేషన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాల్ని చూసేందుకు విదేశీ టూరిస్టులు చాలామంది వస్తూనే ఉంటారు. అలా శ్రీలంకలో 2022లో అల్లరు జరుగుతున్న టైంలో అక్కడికి వెళ్లిన భారతీయ జంట ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొంది అనే కాన్సెప్ట్‌తో తీసిన థ్రిల్లర్ డ్రామా మూవీ 'ప్యారడైజ్'.
చాలామంది ప్రైవసీ కోసమో లేదంటే అడ్వంచర్ చేద్దామనో శ్రీలంక లాంటి చోట్లకు వెళ్తుంటారు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగతనం, ఇంకేదైనా జరగొచ్చేమో అనే ఓ భయం ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. అలానే శ్రీలంకలో టూరిస్టులని అటు జనాలు కావొచ్చు, ఇటు పోలీసులు కావొచ్చు ఎంతలా గౌరవిస్తారనేది కూడా చాలా చక్కగా చూపించారు. సినిమాలో శ్రీలంక అందాల్ని చాలా బ్యూటీఫుల్ గా క్యాప్చర్ చేశారు.
ఓ వైపు నెక్స్ట్ ఏం జరుగుతుందోనని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ థ్రిల్లర్, డ్రామా చూపిస్తూనే మరోవైపు రాముడు, రావణుడు, సీతతో పాటు రామాయణానికి సంబంధించిన కొన్ని సీన్స్ బాగుంటాయి. స్టోరీ పరంగా సింపుల్ లైన్ అయినప్పటికీ.. కొన్ని సీన్లు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లీడ్ రోల్స్ చేసిన రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. మిగిలిన వాళ్లందరూ లోకల్ యాక్టర్స్. ఉన్నవి కొన్ని పాత్రలే అయినా సరే జీవించేశారు.
కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉన్న ఈ సినిమా.. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. అలానే లోన్లీగా ఉండే ప్రదేశాలకు వెళ్దామనుకునేవాళ్లు ఈ సినిమా చూస్తే మాత్రం కొంపదీసి సినిమాలో చూపించినట్లు జరిగితే అంతే ఇక అని భయపడేలా చేస్తుంది. రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకుంటే దీన్ని చూడండి.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment