
అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసురాలుగా ఏడేళ్ల క్రితం సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్(Janhvi Kapoor). హిందీలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు భారీ హిట్ పడిందే లేదు. తెలుగులో మాత్రం దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అటు బాలీవుడ్లోనూ, ఇటు సౌత్లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అయినా కూడా ఇప్పటికీ ఈ బ్యూటీకి బాలీవుడ్లో సాలిడ్ హిట్ పడలేదు. కానీ రెమ్యునరేషన్ మాత్రం సినిమా సినిమాకి పెంచేస్తుంది. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలకే ఎక్కువ పారితోషికం పుచ్చకుంటుందట.
తొలి టాలీవుడ్ మూవీ దేవరకు రూ. 5 కోట్లు పారితోషికంగా పుచ్చుకుంది ఈ బ్యూటీ. అప్పటి వరకు ఆమెకు అదే అత్యధిక పారితోషికం. ఆ తర్వాత పెద్ది సినిమాలో చాన్స్ వచ్చింది. ఈ సినిమాకు మరో కోటి పెంచేసిందట. ఈ సినిమాకు గాను రూ. 6 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
అల్లు అర్జున్-అట్లీ సినిమాలోనూ ఓ పాత్ర కోసం జాన్వీ కపూర్‌ని సంప్రదించారట. ఈ చిత్రానికి మరో కోటి పెంచేసి..మొత్తంగా రూ. 7 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. దీంతో చిత్రబృందం ఆమెతో బేరాలు సాగిస్తునారట. కాస్త తగ్గిస్తే ఆమెను తీసుకుందామని అనుకుంటున్నారట. జాన్వీ మాత్రం తగ్గేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్‌లో తక్కువ తీసుకొని తెలుగు సినిమాలకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం సరికాదని, ఇలా అయితే ఆమె కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.